తోలుబొమ్మలాట !

తోలుబొమ్మలాట !

-

తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం. తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోనూ, పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా షృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుకనుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఆ జీవంలేని బొమ్మలతో జీవనిబద్దమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది.


ఒక సామూహిక సంగీత, నాట్య ప్రదర్శన కళారూపమైన తోలుబొమ్మలాట చారిత్రక పరిణామాలు గమనిస్తే ఒకప్పుడు విలక్షణమైన ఉన్నతిని అనుభవించిన ఈ కళ మొత్తం భారతీయ జానపద కళారూపాల్లోనే విశిష్ట స్థానాన్ని పొంది ఉంటుందని చెప్పవచ్చు. నృత్య దశలో నుండి మానవుడు నాటక దశలోనికి ఎదిగే పరిణామ క్రమంలో తోలుబొమ్మలాట ప్రముఖ పాత్ర వహించింది. జానపదుని మొదటి రంగస్థల ప్రదర్శన కళగా ఈ కళారూపాన్ని గుర్తించవచ్చు.


తోలుబొమ్మలపై వాలిసుగ్రీవులు, రావణుడు, సీతారామలక్ష్మణులు, రాజులు, భటులు, మహాభారత వీరులు, మున్నగు వేషాలన్నియు వివిధ రంగులతో తీర్తురు. ప్రేక్షకులు బొమ్మల చూడగనే ఇది యీ వ్యక్తిని నిరూపించు బొమ్మ అని పోల్చుకొను సాంప్రాదాయ మేర్పడినది. ఈ బొమ్మలలోని వేషాలు పూర్వపు రాజులు రౌతులు మున్నగువారి వేషములను ఊహించుటకు తోడ్పడ వచ్చును. ఈ బొమ్మలాటలో మధ్య మధ్య హాస్యప్రదర్శనము చేయుదురు. అది చాలా అసభ్యముగా నుండును. సినిమా అసభ్యాలను నిషేధించే ప్రభుత్వము వీటిని తొలగించినదికాదు .


తోలుబొమ్మలాటలో పాత్రలు

తోలుబొమ్మలాట అంటే చాలు కేతిగాడు, బంగారక్క, జుట్టుపోలిగాడు వంటి హస్యపాత్రలు ప్రధానంగా వస్తాయి. ఈ పాత్రలు గ్రామీణుల మనస్సులపై విశేషాదరణ చూపుతాయి. తోలుబొమ్మలాటలో ప్రధానకథకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ఈ హస్యపాత్రలకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ పాత్రలను సామాజిక స్థితిగతులకు దర్పణంగా నిలిపి, పాత్రల ద్వారా సమాజంలో ఉండే దురాచారాలను, మూఢనమ్మకాలను ఎండగడతారు. ఇందులో సామెతలు, లోకోక్తులు, పొడుపుకథలు, నీతికథలు మొదలైనవి చోటు చేసుకుంటాయి. అదేవిధంగా అభినయాలకు స్వభావానుగుణంగా తేల్చడానికి వాద్యాలు కూడా ప్రధాన భూమికను నిర్వహిస్తాయి. వాద్యానికి సంబంధించి హర్మోనియం, తాళాలు, తొక్కుడుబిళ్ల, మద్దెల, డప్పు, గజ్జెలు వంటివి ఉంటాయి. తోలుబొమ్మల ప్రదర్శనలో రామాయణం, భారతం లకు సంబంధించిన కథా వస్తువులు ఉంటాయి. లంకాదహనం, సతీసులోచన, యయాతి, అంగద రాయబారం, మైరావణవధ, విరాటపర్వం, పద్యవ్యూహం, ఉత్తరగోగ్రహణం వంటి కథలతో తోలు బొమ్మలను ప్రదర్శిస్తారు.


సూత్రధారుడు

నాటకానికి, సినిమాకు దర్శకునిలాగా తోలుబొమ్మలాటకు సూత్రధారి ప్రధాన బాధ్యత తీసుకొంటాడు. అతను చాలా విషయాలలో ప్రజ్ఞాశాలి కూడా అయిఉంటాడు. మిగిలినవారందరూ అతనిని అనుసరిస్తూ ఉంటారు. సూత్రధారుడు కథను చాలా వివరంగానూ, చాకచక్యంగానూ చెబుతుంటాడు. అవసరమైనంత వరకు అర్థాలను విడమరచి వివరిస్తాడు. పాత్రల ఔచిత్యానుసారం గొంతు మారుస్తుంటాడు. ప్రేక్షకుల ఆదరణను, విసుగును గమనిస్తూ సమయాను కూలంగా మార్పులు చేస్తాడు, ఇతర పాత్రలను ప్రవేశపెడతాడు.


జుట్టుపోలిగాడు, బంగారక్క

ఈ రెండు పాత్రలూ తమ హాస్యం ద్వారా ఇంత పొడవాటి ప్రదర్శనలో ప్రేక్షకులను నవ్విస్తూ నిద్రమత్తు వదలగొడుతూ ఉంటాయి. మధ్యమధ్యలో వారి విసుర్లు, పనులు సమాజంలో దురంతాలను కుళ్ళగిస్తూ ఉంటాయి. ఎక్కువగా బంగారక్క గడసరి పెళ్ళాంగా ఉంటుంది. పోలిగాడితో కయ్యానికి దిగుతుంది, మోటు సరసమాడుతుంది.


అల్లాటప్పగాడు, కేతిగాడు

పోలిగాడు తెరమీదనుండి తప్పుకున్నపుడు అల్లాటప్పగాడు ప్రత్యక్షమై బంగారక్కని ప్రసన్నం చేసుకునే దానికి (లోబరుచుకునే) దానికి ప్రయత్నిస్తుంటాడు. వారిద్దరూ మంచి రసపట్టులో ఉన్నపుడు హఠాత్తుగా కేతిగాడు ఊడిపడతాడు. అన్నిబొమ్మలకంటే కేతిగాని బొమ్మ చిన్నది. పానకంలా పుడకలా తెరపై ఎక్కడో ఒకచోట ప్రత్యక్షమై శృంగారఘట్టంలో ఉన్న అల్లాటప్పగాడిని టకీమని ఒకదెబ్బ కొడతాడు కేతిగాడు. వెంటనే అంతర్ధానమౌతాడు అల్లాటప్పగాడు. ఇక కేతిగాడు బంగారప్పను ఏడిపిస్తాడు.


తోలుబొమ్మలాటలకు ఉథృతంగా ఆదరణ లభిస్తున్న రోజుల్లో ఈ ప్రదర్శన జరుగుతున్నదంటే ఆ గ్రామంలో పండిత పామరులు కులమత భేదభావాలు మరచి తిలకించేవారు. తమకిష్టమైన పురాణ పురుషుల కథలను తెలుసు కునేందుకు ఈ తోలుబొమ్మలు తప్ప, మరోసాధనం ఉండేది కాదు. ఆ రోజుల్లో ఇంకా చరిత్రను పరిశీలించి చూస్తే నాగరికత వికసిస్తున్న తొలి రోజుల్లో మానవుడు తన మనుగడ కోసమే ఎక్కువ కాలాన్ని వెచ్చించిన తొలినాళ్ళలో ఈ జానపద కళారూపం అవిర్భవించడంతో అతనికి మనోరంజనం కలగడమేకాక, తాను విన్న పురాణ కథల్లోని పాత్రలు కళ్ళముందు సాక్షాత్కరించడంతో భక్తి పారవశ్యంతో ఆనందానుభూతులకు లోనయ్యేవాడు. అంతేకాక పాత్రల స్వరూప స్వభావాలను ఆకళింపు చేసుకుని, తన జీవన సరళిలో నీతినియమాల పాటింపుతో కొంత నాగరికతను పెంపొందించుకునేవాడు. ఒకరకంగా తాము కొలిచే దేవుడికి ఒక సమగ్రమైన రూపాన్ని తోలుబొమ్మలాటతోనే గుర్తించగలిగి, ఆరాధించడం మొదలు పెట్టాడని చెప్పవచ్చు.


వార్తాపత్రికలు, రేడియో వంటి సమాచార వ్యవస్థలేని తొలిరోజుల్లో తోలుబొమ్మలాట సమాచార మాథ్యమంగా పనిచేసిందని చెప్పవచ్చు. గ్రామ సంచారంగా సాగే ఈ కళాప్రక్రియ ఒక గ్రామంలోని సమాచారాన్ని మరో గ్రామానికి చేరవేయడం, ఆరోగ్యవిషయాలు, నీతి నియమాలు, రాజకీయ మార్పులు, దొంగవ్యాపారుల గుట్టు మొదలైన ఆనాటి స్థితిగతులను బొమ్మలతో దృశ్యరూపంగా అందించి సమాచార వారధిగా నిలిచింది. ఆంధ్రదేశంలోని హిందూపురం, బొమ్మలాటపల్లి, అనంతపురం, ధర్మవరం, చెరుకుపల్లి, మదిరి, బసవయ్యపాలెం, గుండాలమ్మ పల్లె, వాడపల్లి, నెల్లూరు, వంటి అతికొద్ది ప్రాంతాల్లో తోలుబొమ్మల బృందాలు చివరి దశలో జీవిస్తున్నాయి.


తోలుబొమ్మలు - ఆవిర్భావం

తోలుబొమ్మల పుట్టుక మీద అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం రాజాస్థానాల లోని పండితులు తమ ప్రభువులను సంతోష పెట్టడానికి బొమ్మలను తయారు చేసి మానవులుగా నటింపచేస్తే సృజనాత్మకంగా ఉంటుందని భావించి తోలుబొమ్మలను తయారుచేసి, తెల్లటి పంచెను తెరగా అమర్చి, దానిపైన దీపం కాంతిలో బొమ్మల నీడలను పడేటట్లు చేసి బొమ్మలాటను ప్రదర్శించేవారు. ఈ విధంగా తోలుబొమ్మలాట పుట్టిందని, ఈ ఆట పండితుల చేత మెరుగులు దిద్దుకున్నదని, చెప్పడానికి అమరకోశం లోని శ్లోకాలను నిదర్శనంగా పేర్కొనవచ్చు.


ఈ తోలుబొమ్మలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రాచీన ఓడరేవులైన కళింగపట్నం, భీమునిపట్నం, కోరంగి, మచిలీపట్నం, వాడరేవు, కొత్తపట్నాల నుంచి విదేశాలకు భారతీయులతో పాటు వెళ్ళాయి. పాశ్చాత్యదేశాలలో జరిగే ఉత్సవాలలో తోలుబొమ్మలను ప్రదర్శించడాన్ని బట్టి చూస్తే ఈ కళకు ఇతర దేశాల్లో బహుళ ఆదరణ లభించిందని తెలుస్తున్నది. పర్షియా, టర్కీ ల మీదుగా గ్రీసు దేశంలో ప్రవేశించిన తోలుబొమ్మలు, గ్రీసులో నూతన రూపం సంతరించుకుని ఉత్తరాఫ్రికా లోని ముస్లిం దేశాలకు, 17వ శతాబ్దంలో ఇటలీ కి, అక్కడినుండి ఫ్రాన్స్ లోని వెర్సయిల్స్, పారిస్, పేలేరాయల్ నగరాలకు వ్యాపించాయి. తోలుబొమ్మలు కాలానుగుణంగా ఆయాదేశాల్లో భిన్నరూపాలు ధరించినప్పటికీ, భారతదేశం వీటికి మాతృక అని చెప్పవచ్చు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!