పాకుడురాళ్ళు-డాక్టర్ రావూరి భరద్వాజ 🌹

పాకుడురాళ్ళు-డాక్టర్ రావూరి భరద్వాజ 🌹


🏵️

.

పాకుడురాళ్ళు రావూరి భరద్వాజ విశిష్టమైన నవలా రచన.

చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల పాకుడురాళ్లు.

భరద్వాజ దీనికి మాయ జలతారు అని నామకరణం చేశాడు.


అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టాడు.

మల్లంపల్లి సోమశేఖరశర్మ, ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మ ల 

ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే వ్రాసిన 'పాలపుంత' అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా వ్రాశాడు.


ఈ నవల మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రిక లో ధారావాహికగా వెలువడినది. ఈ పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి

ఈ నవల రాసినందుకు రావూరికి 2013 లో సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది.


ఈ పాకుడు రాళ్ళు వంటి సినీ ప్రపంచం నుండి జారి పడి, నేల రాలిన తారలని కాసేపు ఇక్కడ గుర్తు చేసుకుందాం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో స్లీపింగ్ పిల్స్ వేసుకుని చనిపోవడం మనకందరికీ తెలిసిందే! 

పాకీజా లాంటి అద్భుత కళాఖండంలో నటించిన మీనా కుమారి తాగుడుకి బానిసై చనిపోయింది. మహానటి సావిత్రి కూడా తెరపై మనందరినీ ఆకట్టుకున్నా వ్యక్తిగత జీవితంలో సరైన ప్రేమకు నోచుకోక చిన్న వయసులోనే ఈలోకాన్ని వీడింది. 

పొట్టేలు పున్నమ్మ, స్వర్గం నరకం లో మనకందరికీ గుర్తుండిన ఫటాఫట్ జయలక్ష్మి కూడా ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకోవడం మనకు ఇంకా గుర్తు. 

బొబ్బిలి రాజా, ధర్మ క్షేత్రం, అసెంబ్లీ రౌడీ ఇంకా అనేక హిట్ సినిమాలలో నటించిన అందాల తార దివ్య భారతి కూడా చిన్న వయసులోనే నేల రాలింది. 

తెలుగు, తమిళం, మళయాళం ఇంకా పలు భాషల్లో నటించిన సిల్క్ స్మిత కూడా జీవితంలో ఓడిపోయి చావుకి దగ్గరయింది. పలు ప్రేమ కథా చిత్రాలలో ఘన విజయం సాధించిన లవర్ బాయ్ గా చెప్పుకునే 

ఉదయ్ కిరణ్ కూడా సినీ ప్రపంచంలో ఒత్తిడిని తట్టుకోలేక చాలా చిన్న వయసులోనే జీవితం నుండి నిష్క్రమించాడు. వీకీపీడియాలో చూస్తే ఇలా నేల రాలిన తారలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 140 మంది ఉన్నారు.


ఇక నవల గురించి మాట్లాడుకుందాం. మంగమ్మ ఒక రంగస్థల నటి. నాటకాలలో బాగా పేరు తెచ్చుకున్న మంగమ్మను ఆమె విటుడు అయిన చలపతి తను తీస్తున్న సినిమాలో కథానాయకి పాత్ర ఇవ్వగలనని మద్రాసు తీసుకు వస్తాడు. సినిమాలలో చాన్సుల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసి మంజరిని పెద్ద కథానాయకిని చేస్తాడు. మంగమ్మ కాస్తా మంజరిగా మారి తెలుగు సినీలోకాన్ని రంజింపజేస్తుంది. ఎడా,పెడా సినిమాలతో బాగా డబ్బు సంపాదిస్తూ అదే సమయములో సినీ ప్రపంచంలో తన స్థానం కోసం వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ ఉంటుంది. చేతి నిండా డబ్బు ఉన్నా మంజరికి మనశ్శాంతి కరువవుతుంది. సినీరంగంలో ప్రముఖులతో మనస్తాపాలు,సినిమాలకు డబ్బులు పెట్టే లక్షాధికారులు, సినీ దర్శకులు, నిర్మాతలు ఇలా అవసరమున్న వారితో సంబంధాలు పెట్టుకోవడం, తనని సినీ రంగానికి పరిచయం చేసిన చలపతితో రోజువారీ పోట్లాటలు, సినీ పాత్రికేయులని మచ్చిక చేసుకుని తనకి కావసినట్లుగా పత్రికలలో వ్రాయించుకోవడం లాంటి సమస్యలతో మంజరి సతమతమవుతూ ఉంటుంది. ఈ సమస్యల సుడిగుండం నుండి మంజరికి ఎలా విముక్తి కలిగిందో తెలుసుకోవాలంటే పాకుడు రాళ్ళు నవల చదవాల్సిందే!


ఈ నవలలో భరద్వాజ్ గారు మనకి శర్మ పాత్రలో కనిపిస్తారు. సినీ పత్రికలు వ్యాపార రహస్యాలని ఈ నవలలో మనకి శర్మ గారి ద్వారా తెలియజేస్తూ ఉంటారు. అపుడపుడూ ఈ సమాచారం అందించే సందర్భం లేకపోయినా పిలవని పేరంటానికి వచ్చిన చుట్టంలా శర్మ గారు నవల మధ్యలో దూరి చిరాకు పెట్టారు. మంగమ్మని మంజరిగా మార్చిన జక్కన్న పాత్రలో చలపతి గారు సినీ రంగాన్ని మనకి పరిచయం చేస్తూ ఉంటారు. మంజరికి సినిమాలలో అవకాశం దొరకడం భలే తమాషాగా జరిగిపోతుంది. ఈ తమాషా చెయ్యడం కోసం చలపతి తిమ్మిని బమ్మి చేస్తాడు. ఈ తతంగం అంతా చదువుతుంటే రాం గోపాల్ వర్మ తన మొదటి సినిమా శివ కోసం ఆడిన నాటకం గుర్తుకు వస్తుంది. మీకు ఆ నాటకం వివరాలు కావాలంటే వర్మ విత్ వోడ్కా చదవండి.


ఇంకో సందర్భంలో అప్పటికే సినిమాలలో రాణించిన మంజరిని సినీ పెద్దలు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు జరుగుతాయి. భరద్వాజ్ గారు భూకైలాస్ చిత్రంలో జమునకి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు గారితో జరిగిన గొడవను వాడుకున్నారని మనకి తెలుస్తుంది. జమున గారు కూడా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు కూడా, కాకపోతే పెద్ద మనుషుల పేర్లు బయట పెట్టలేదు. సహజకవి మా ఎమ్మెస్.రెడ్డి బయటకు రాని తన ఆత్మకథలో ఈ విషయాన్ని బయట పెట్టారు. నవలలో ఈ విషయాలు చదువుతుంటే మనకి అప్పటి రోజులు మళ్ళీ గుర్తుకు వస్తాయి. ఇప్పుడు కూడా అటువంటి సంఘటనలు సినీ రంగంలో జరుగుతుండడం సిగ్గుచేటు. ఎలాగయిన సినిమా తియ్యాలని పల్లెటూరు నుండి పొలాలు అన్నీ అమ్మి అది తియ్యలేక అప్పుల పాలవడం, ఆఫీసు మూసేసి వూరెళ్ళిపోవడం చదువుతుంటే కొడవటిగంటి కుటుంబ రావు గారు సినిమాపై రాసిన ఒక కథ మనకు లీలగా కనిపిస్తూ ఉంటుంది.


మంజరి సినిమాలలోకి రాకముందే కళ్యాణి పెద్ద నటి. పూల పానుపు తలపించే ఆమె జీవితంలో చీకటి కోణాలు ఒక్కొక్కటీ ఆవిష్కరిస్తూ ఉంటే అందమయిన గులాబీ మొక్కపై ముళ్ళు మనకి గుచ్చుకుంటూ ఉంటాయి. చివరికి ఈమెని ఆమె దగ్గరి వాళ్ళే హత్య చేస్తారు. మంజరి హాలీవుడ్ యాత్ర ద్వారా రచయిత పాఠకులకి అంతర్జాతీయ ముచ్చట్లు తెలియజేస్తారు. మంజరి మార్లిన్ మన్రోతో కొద్ది రోజులు గడుపుతుంది. ఆమెతో కబుర్లు మనకి చాలా వింతగా, ఆశ్చర్యంగా ఉంటుంది. వీళ్ళిద్దరినీ ఇలా కలపాలన్న రచయిత ఊహ నిజంగా అద్భుతం. నవల చదవడం పూర్తి అవగానే ఒక మంచి తమిళ సినిమా చూసినట్లు ఏదో బాధ ఇక్కడ అని తెలియని చోటల్లా బాధిస్తుంది.


.


పాకుడురాళ్ళు నవల,కేవలం మంజరిగా మారిన మంగమ్మ కథ 

మాత్రమే కాదు, తెలుగులో సినిమా నిర్మాణం ఊపందుకున్న రోజుల్లో ఆ పరిశ్రమలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిదీ కూడా.

ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ కూడా, అవసరార్ధపు స్నేహాలు నటించే ఇద్దరు అగ్ర హీరోలు, అగ్ర నాయికగా ఎదిగాక, అగ్ర హీరోలతో నటించనని ప్రకటించికొత్త నాయకులని పరిచయం చేసే నాయిక, సినిమా వాళ్ళని బెదిరించి పబ్బం గడుపుకునే సినీ విలేఖరి, ఇలా ఎందరెందరిదో కథ ఇది.

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!