బంగారు దొంగ కల !

బంగారు దొంగ కల !
(కలలు కనండి...క లా ము గారి స్లోగాను .)

పూర్వం ఒక గ్రామంలో ఒక చిల్లర దొంగ ఉండేవాడు. సన్నాసులు, సన్యాసులు, నాయకులు, నాయక దొంగలు కలలు కంటున్నప్పుడు పాపం ఆ చిల్లర దొంగ మాత్రం కలలు కంటే తప్పేమిటి? ఆ దొంగ కూడా కలలు కన్నాడు. తమ వ్యవసాయ భూమికి కావలిసినంత నీరు లభించి చక్కని పంట పండినట్టు కలలు కన్నాడు. చెప్పడం మరిచాను అతను కల కన్నది పట్టుపరుపుల మీద పడుకుని కాదు, జైలు గోడల మధ్య!
దొంతనానికి పాల్పడడం వల్ల రాజభటులు చిల్లర దొంగను అరెస్టు చేసి కారాగారంలో బంధించారు. దొంగతనం చేస్తే సన్మానించేందుకు, అభిమాన సంఘాలను ఏర్పాటు చేసేందుకు అదేమీ ఆధునిక కాలం కాదు. రాజుల కాలం కాబట్టి దొంగతనం చేసి పట్టుపడితే జైలే గతి.

పార్లమెంటుపైనే దాడి చేసిన కసబ్‌లాంటి వాడికి కోట్ల రూపాయల ఖర్చుతో రాజభోగాలు కల్పించే మన కాలం కాదు. చిన్నచిన్న రాజ్యా లున్న కాలమది. దొంగ దొరకడం, భటులు పట్టుకు వెళ్లడం, శిక్ష విధించడం అన్నీ అప్పటికప్పుడే జరిగిపోయేవి.

జైలుపాలైన చిల్లర దొంగ ఆలోచనల్లో పడ్డాడు. వీరోచితంగా జనం సొమ్ము దోచుకున్నాడని ఆభిమానించే అభిమానులు లేరు. ముసలి తల్లిదండ్రులు, వారికి ఆధారంగా వ్యవసాయ పొలం తప్ప ఏమీలేవు. తాను జైలులో ఉన్నందున పొలానికి నీళ్లు తోడే అవకాశం లేకుండా పోయింది. ఎలారా భగవంతుడా!అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. బంగారం లాంటి కల కన్నాడు!

ఉదయం లేచాక తల్లిదండ్రులకు ఉత్తరం రాశాడు. భటుణ్ణి పిలిచి ఈ ఉత్తరం తన తల్లిదండ్రులకు చేర్చమని కోరాడు. సరేనని భటుడు ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి తన పై వాడికి ఇచ్చాడు. అసలే దొంగ.. వాడు కారాగారంలో ఉన్నాడు. లేఖ రాశాడు అంటే ఏదో ఉండే ఉంటుంది అనుకుని లేఖ చదివాడు.

అమ్మానాన్నా ...!
నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను. నేను రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఈ విషయం ఎవరికీ చెప్పకండి.. నేను ఇంత కాలం దొంగతనాల్లో సంపాదించిన బంగారం అంతా మన పొలంలోని వ్యవసాయ బావిలో పాతిపెట్టాను. నేను బయటకు వచ్చాక ఆ బంగారంతో హాయిగా జీవిద్దాం... అంత వరకు సెలవు అని ముగించాడు. ఉత్తరం చదవగానే భటునితోపాటు సైనికాధికారి ఎగిరి గంతేశారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఉత్తరంలో ఉన్న చిరునామాకు భటులను వెంటబెట్టుకెళ్లాడు. బావిలోని నీళ్లన్నీ తోడి పోశారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారు ఝాము వరకు అదే పని. పంటపొలాలన్నీ నీటితో తడిసిపోయాయి. బావిలోనీరు అయిపోయంది కానీ బంగారం జాడలేదు. ఉదయం జన సంచారం మొదలుకావడంతో భటులు కిమ్మనకుండా వెనక్కి వెళ్లిపోయారు.

కొడుకు జైలులో ఉన్నా దేవుడి దయవల్లనే పొలానికి నీళ్లు అందాయని వృద్ధ దంపతులు సంతోషించారు. భటులు తేలుకుట్టిన దొంగల్లా వౌనంగా ఉండిపోతే దొంగ మాత్రం తన తెలివితేటలకు మురిసిపోయాడు.
చిన్నప్పటి ఈ కథ తెగ నచ్చినా అది కథ కాబట్టి సాధ్యమైంది కానీ బావిలో బంగారం ఉందటే నమ్మి నీటిని తోడేందుకు భటులు మరీ అంత అమాయకులా అని పెద్దయ్యాక అనిపించింది..... మరింత పెద్దయ్యాక చిన్నప్పటి కథే నిజమని ఇప్పుడు అనిపిస్తోంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!