మ దర్ ఇండియా.. అంటే మాకు పద్మశ్రీ నర్గిస్ దత్తు .!

మ దర్ ఇండియా.. అంటే మాకు పద్మశ్రీ నర్గిస్ దత్తు .!

భారతీయ సమాజంలో ‘మాతృమూర్తి’ స్థానానికి మహోన్నతమైన విలువ ఉంది. భావ ప్రపంచంలోనూ, అన్ని సాహితీ కళారూపాల్లోనూ ‘అమ్మ’ పాత్రకి ఎనలేని గౌరవమూ పూజనీయమైన స్థానమూ ఆపాదించబడ్డాయి. దేవతా స్థానాన్నిచ్చి కేవలం కుటుంబానికే పరిమితం చేయకుండా అమ్మ అంటే మొత్తం ఊరుకూ, జాతికి తల్లి అన్న భావాన్ని కూడా రూపునిచ్చారు. అలాంటి ఒక భావనా ప్రపంచపు మాతృమూర్తి పాత్రను ముఖ్య అభినేతగా చేసి 43 ఏళ్ల క్రితం మహబూబ్ ఓ చిత్రం నిర్మించాడు. అది నాటికీ నేటికీ విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది.

అంతే కాదు, ఆ చిత్రం తర్వాత అందులోని పాత్రలకు మొత్తం చిత్రానికే అనేక అనుకరణలూ, కొనసాగింపులూ భారతీయ సినిమా రంగంలో వెలువడ్డాయి. నర్గీస్‌లోని ఓ మహానటిని ఆ సినిమా ఆవిష్కరించింది. ఆ సినిమా ‘మదర్ ఇండియా’. అంతకుముందు పదిహేడేళ్ల క్రితం మహబూబ్ తానే ‘ఔరత్’ చిత్రాన్ని నిర్మించాడు. అందులో సర్దార్ అఖ్తర్ ప్రధాన భూమికను పోషించగా అది గొప్ప విజయాన్ని సాధించింది. సరిగ్గా అదే సినిమాని మహబూబ్ ‘మదర్ ఇండియా ‘ గా తీశాడు. అయితే దీనిలో తల్లి పాత్రకి కొంత కొనసాగింపు ఉంది. ‘మదర్ ఇండియా’ ప్రధానంగా నర్గీస్ పోషించిన తల్లి పాత్ర రాధ జీవన పోరాటాన్ని ప్రధాన ఇతివృత్తంగా చేసుకొని నిర్మించబడినప్పటికి అది కేవలం ఆమె జీవిత చరిత్ర మాత్రమే కాదు. అది ఆనాటి సామాజిక , ఆర్ధిక జీవన చిత్రం కూడా. అప్పటికే విశృంఖలమవుతున్న డబ్బు ప్రభావమూ, కూలి పోతున్న వ్యవసాయరంగ స్థితిగతులూ, విచ్చిన్నమైపోతున్న రైతుల బ్రతుకు అన్నీ కలగలిసి మదరిండియాగా రూపుదిద్దుకున్నాయి. ప్రకృతి వనరులపైన ఆధారపడి సాగుతున్న భారతీయ వ్యవసాయరంగం అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతు తాను నమ్ముకున్న భూమిని ఎలా పరాయిపరం చేయాల్సి వచ్చిందో, రైతు ఎలా కరిగిపోతున్నాడో మదరిండియాలో స్పష్టంగా చిత్రించారు. డబ్బు, అధికారం, వడ్డీ వ్యాపారం జులుం భూమిని ఎలా కబళించిందీ క్రమంగా రైతు జీవితాన్నే ఎలా బలిగొంది ఈ చిత్రం వివరిస్తుంది. కుటుంబం కూలిపోయిన స్థితి నుంచి రాధ తిరిగి మట్టినే నమ్ముకుని శ్రమనే పెట్టుబడిగా పెట్టి, పలాయనం చిత్తగించనున్న ఊరికి స్పూర్తినిచ్చి తిరిగి తన కాళ్లపైన తన కుటుంబాన్ని, వ్యవసాయాన్ని నిలుపుతుంది.

ఆ స్థితిలో రాధ శక్తి స్వరూపిణిగా తన పిల్లలకే కాదు మొత్తం ఊరికే తల్లిగా ఎదుగుతుంది. కాని రాధ కొడుకుల్లో ఒకడైన బిర్జు తన తల్లి కష్టాలకు మూలకారణమైన వడ్డీ వ్యాపారిపై పగ సాధించడానికి, అనేక సంవత్సరాలుగా తమ శ్రమని వడ్డీగా దోచుకుంటున్న వాడి కోటను బద్దలు కొట్టడానికి ఎదురు తిరిగినపుడు ఆ రాధే బిర్జును నిలువరిస్తుంది. ఊరుకోసం, మాట నిలుపుకోవడం కోసం వడ్డీ వ్యాపారి కూతురికి అన్యాయం జరగరాదన్న భావన కోసం సొంత కొడుకునే కాల్చి చంపుతుంది. చిత్రం మౌళిక సమస్యదాకా వచ్చి సినిమాటిక్ ముగింపుతో తేలిపోతుంది. ప్రేక్షకుల ఎమోషన్లని తడమడంతో గొప్ప రెస్పాన్స్ ని అందుకొని విజయవంతమైన సినిమాగా మిగిలిపోయింది.

‘మదర్ ఇండియా’ లో ప్రధాన పాత్ర రాధకు పౌరాణిక పాత్రల లక్షణాల్ని కూడా సంతరింపజేసారు. పేరుకు రాధ అయినప్పటికీ సీతకుండే సాధ్వీ లక్షణాల్ని, సచ్చీలతనూ, ఆప్యాయతనూ కలిగి ఉంది. వడ్డీవ్యాపారి ఆమెను బలాత్కారం చేయాలనుకున్నప్పుడు కాళీమాత లాగ ఎదురుతిరిగి ధైర్యాన్ని ప్రదర్శిస్తుంది. శక్తి స్వరూపిణిగా కష్టాలని ఎదురొడ్డి నిలుస్తుంది రాధ. ఊరుకోసం తన స్వంత కొడుకునే హత్య చేసి ఆమె భూదేవిగా త్యాగం చేసినట్టు తెలుస్తుంది.

చిత్రకథాంశం విషయానికి వస్తే రాధ పెళ్లయినతర్వాత భర్త ఊరికి వస్తుంది. ఆమె భర్త శ్యాములు మంచి కష్టించి పనిచేయగలిగిన రైతు. జీవితం పట్ల గొప్ప ఆశలు కలిగినవాడు. రాధ అత్తింటి పనులతో పాటు భర్తకు తోడుగా వ్యవసాయ పనులూ నిర్వహిస్తూ ఉంటుంది. వాళ్ల పెళ్లికోసం చేసిన అప్పులు వారి ముందున్న ప్రధాన సమస్య. వడ్డీ వ్యాపారి, ఆ ఊరి భూస్వామి సుఖీలాలాకు తమ భూమిని తనఖా పెడుతుంది శ్యాములు తల్లి. రాధకు మొదటి కొడుకు పుడతాడు. ఆనందం వెల్లివిరుస్తుంది. అదే క్రమంలో మరిద్దరు పిల్లలు అయ్యేసరికి అప్పులు పెరిగిపోతాయి. అందిన పంట వడ్డీలకే సరిపోదు. లాలా జులుం మరింత పెరిగి పోతుంది. శ్యాము అంత కష్టపడ్డా ఫలితం ఉండదు. వారి ఎద్దు చనిపోవడంతో కష్టాలు రెట్టింపవుతాయి. లాలా నుంచి మరింత అప్పు తీసుకోవడానికి శ్యాములు అంగీకరించడు. కాని రాధ తన పెళ్లినాటి ఆభరణాలు తనఖా పెట్టి మరో ఎద్దును కొంటారు. వ్యవసాయం మెరుగుపరచే క్రమంలో బావి తవ్వకాన్ని ఆరంభించి బండను తొలగించే ప్రయత్నంలో శ్యాము తన రెండుచేతులను పోగొట్టుకుంటాడు. దుఃఖంతో శ్యాము ఇంట్లో ఉంటే రాధ ఇంటి బాధ్యతలు తీసుకుంటుంది. లాలా చేసిన ఎగతాళిని భరించలేక అవిటి బతుకును కొనసాగించలేక ఓ రాత్రి రాధ నుదుటి బొట్టును చెరిపేసి శ్యాములు ఇంట్లోంచి వెళ్లిపోతాడు. నలుగురు పిల్లలతో రాధ ఒంటరిగా మిగులుతుంది. వడ్డీవ్యాపారి లాలా రాధను తనతో ఉండమంటాడు. మొత్తం కుటుంబ బాధ్యతను తీసుకుంటానంటాడు. ఆమె అంగీకరించదు. కాని తుఫాను వరదలొచ్చి సర్వం కొట్టుకుపోగా ఇద్దరు పిల్లల మరణాన్ని చూసి రాధ కదలిపోతుంది. ఆకలికి విలవిల్లాడుతున్న మిగిలిన పిల్లల్ని చూసి వారికోసం లాలాకు లొంగిపోవడానికి వెళ్తుంది. కాని చివరి నిమిషంలో తనను తాను సంబాళించుకుని వాడిని ఎదిరించి కొట్టి బయటపడుతుంది. వరదలకి అంతా కొట్టుకుపోగా ఊరంగా వలసకు సిద్ధమవుతారు. కాని రాధ తన భూమినే నమ్ముకుంటానని ఊరుని విడిచి వెళ్లనంటుంది. ఊరివాళ్లనందరిని నిలువరిస్తుంది.

తర్వాత అష్టకష్టాలు పడి తన వ్యవసాయాన్ని, పిల్లల్ని పెంచుతుంది. కొడుకులిద్దరూ రాము, బిర్జూ ఎదుగుతారు. బిర్జు తన తల్లి పడ్డ కష్టాల్ని, కన్నీళ్లని దగ్గరనుంచి చూసి లాలాపై అతని చర్యలపైన వ్యతిరేకతను పెంచుకుంటారు. వడ్డీకోసం పంటను ఊడ్చుకెళ్లేందుకు వచ్చిన లాలను లెక్క చెప్పమంటాడు. తన చదువురాని స్థితికి దుఃఖపడతాడు. లాలాపై పగతీర్చుకునే ప్రయత్నంలోనూ లాలా వద్దనున్న తన తల్లి కంగన్‌ని తిరిగి తెచ్చే ప్రయత్నంలోనూ లాలానుంచి, ఊరునుంచి వ్యతిరేకతకు గురై బహిష్కరించబడతాడు. ఊరు వదలిన బిర్జూ డాకూ అవుటాడు. లాలా ఇంటిపై దాడి చేసి అతని వడ్డీ కాగితాలన్నింటిని తగులబెడతాడు. అతని కూతురిని ఎత్తుకెళ్లిపోతుండగా అప్పటికే బిర్జూనుంచి ఊరికెలాంటి ఆపద రాకుండా చూస్తానని మాట ఇచ్చిన రాధ బిర్జూని తుపాకితో కాల్చివేస్తుంది. బిర్జూ తల్లి వొడిలో ప్రాణం విడుస్తాడు. బిర్జూ చేతిలోంచి రక్తంలో తడిచిన రాధ కంగన్ జారిపడుతుంది. చిత్రం భావోద్వేగంతో ముగుస్తుంది.

చిత్రీకరణ విషయంలో కూడా మదర్ ఇండియా అనేక కొత్త కోణాల్ని చూపించింది. రాధగా నర్గీస్, బిర్జూగా సునీల్ దత్ అద్వితీయమైన నటనను ప్రదర్శించారు. ఈ చిత్రంలో నటనకు నర్గీస్‌కు 11వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమనటి అవార్డు లభించింది. మహబూబ్,నర్గీస్‌లు మదర్ ఇండియాతో భారతీయ చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

దర్శకత్వం : మహబూబ్

నటీనటులు : నర్గీస్(రాధ), సునీల్ దత్ (బిర్జూ), రాజేంద్రకుమార్, రాజ్ కుమార్.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!