చందమామ కధ....... అమ్మ ప్రేమ !



                                            చందమామ కధ....... అమ్మ ప్రేమ !


-------------
అనగనగా ఒక ఊళ్లో ఒక తల్లి, కూతురు నివసించేవాళ్లు. తల్లి పేరు లక్ష్మమ్మ. కూతురు శాంతి. వాళ్లకు ఏ ఆస్తిపాస్తులూ లేవు. శాంతి చిన్నతనంలోనే వాళ్ల నాన్న వాళ్ళను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. భర్త లేడని లక్ష్మమ్మ ధైర్యం కోల్పోలేదు. ఎందరు ఎన్ని రకాలుగా అవమానించినా సరే, తను మాత్రం ఉన్నంతలో చక్కగా బ్రతుక్కోవాలని సంకల్పించుకున్నది. క్రమం తప్పకుండా కూలికి పోయేది. ఒళ్ళు వంచి పని చేసేది. 'లక్ష్మమ్మ వస్తే చూసుకోనక్కర్లేదు' అనుకునేవాళ్ళు రైతులు. తనకు వచ్చిన కూలిని రెండు భాగాలు చేసేది లక్ష్మమ్మ. ఒక భాగం కుటుంబం గడపడానికి. మరొక భాగం శాంతి భవిష్యత్తుకు.

లక్ష్మమ్మకు కూతురంటే ప్రాణం. శాంతికి కూడా అమ్మ అంటే చాలా ఇష్టం. ఒక రోజున తల్లీకూతుళ్లు ఇద్దరూ పొలం గట్టుమీద నడుస్తున్నారు. ఒకచోట గెనం సన్నగా ఉండింది. కూతురికి తను కింద పడుతానేమోనని భయం వేసి, అమ్మ చేతిని గట్టిగా పట్టుకుంది. లక్ష్మమ్మ ఆ చేతిని వదిలించుకొని, తనే శాంతి చేతిని పట్టుకుంది.

శాంతి ఈ సంగతిని గుర్తించి, గెనం దిగగానే అడిగింది- "అమ్మా నువ్వు నా చేయి పట్టుకున్నా, నేను నీ చేయి పట్టుకున్నా ఒకటే కదా?" అని. లక్ష్మమ్మ నవ్వి, జవాబిచ్చింది "పాపా! మనూళ్ళో జనాల్ని అందరినీ బాగా గమనించు- పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రుల చేతులు వదిలిపెట్టచ్చు; వాళ్ళని పట్టించుకోకపోవచ్చు గానీ, ఆ తల్లులు మాత్రం పిల్లల చేతులు వదలరు- వాళ్ళకు సాయం చేస్తూనే ఉంటారు" అని. "నేను మాత్రం నీకు సాయం చేస్తూనే ఉంటానమ్మా" అన్నది శాంతి. ఆ పాపకు అర్థమైంది, తల్లికి తనంటే ఎంత ప్రేమో.

ఇట్లా తల్లినుండి జీవితానికి సంబంధించిన విలువల్ని అనేకం నేర్చుకున్నది శాంతి. ఆ క్రమంలోనే ఆ పాపకు తల్లి తనకోసం ఎంత కష్టపడుతున్నదో అర్థమైంది- శాంతికి పదేళ్ళు వచ్చేసరికి, ఆ పాప ఇక బడికి వెళ్లటం మానేసింది. లక్ష్మమ్మ శాంతికి అనేక రకాలుగా చెప్పి చూసింది- బడికి వెళ్ళటం ఎంత అవసరమో. అయినా శాంతి వినలేదు. తల్లితోబాటు కూలికి పోవటం మొదలు పెట్టింది. తన వంతుగా వచ్చిన కూలిని వేరుగా పెట్టుకోసాగింది కూడాను!

రాను రాను లక్ష్మమ్మకు శాంతి భవిష్యత్తు పట్ల బెంగ పట్టుకున్నది. తన జీవితం కూలితో సాగిపోతుంది- కానీ తన బిడ్డ?! శాంతి జీవితం బాగుండాలి. "సొంత పొలం ఉంటే కొంత నయం". అయితే ఆ సరికి ఆమె కూడబెట్టిన డబ్బు చాలానే అయ్యింది- దానితో ఊరికి దగ్గరగా రెండెకరాల పొలం కొని, సొంత పొలం సాగు చెయ్యటం మొదలుపెట్టింది లక్ష్మమ్మ. ఇప్పుడు శాంతి తల్లితోబాటు తమ పొలంలోనే పనిచేయసాగింది. లక్ష్మమ్మ తెలివిగా తోటలో కొన్ని కాయగూరలూ, ఆకుకూరలూ, పూల మొక్కలూ, పండ్ల చెట్లూ- ఇట్లా రకరకాల పంటలు సాగు చేసేది. ఆ ఉత్పత్తులను తీసుకెళ్ళి వారం వారం జరిగే సంతలో అమ్ముకొచ్చేది శాంతి. అలా వచ్చిన డబ్బుల్ని తల్లికీ-తనకూ సమానంగా పంచి ఇచ్చేది. లక్ష్మమ్మ తన వాటాలో సగాన్ని ఇంటి ఖర్చులకోసం వాడి, మిగిలిన సగాన్ని శాంతికోసం అదనంగా దాచేది!

ఇట్లా పదేళ్ళు గడిచేసరికి లక్ష్మమ్మ కుటుంబం కొద్దిగా స్థిరపడింది. లక్ష్మమ్మ శాంతికి తన ప్రేమను అందివ్వటంతో పాటు ఎన్నో విలువలను నేర్పింది. అందరితో కలసిమెలసి ఎలా మెలగాలో, అందరికీ ప్రేమను ఎలా పంచాలో నేర్పింది. శాంతికి ఇప్పుడు ఇరవయ్యేళ్ళు వచ్చాయి. పొలంలో పని చేసి, చేసి ఆమె శరీరం‌ బాగా గట్టి పడ్డది. ఇప్పుడు లక్ష్మమ్మకు, ఆమెకు కూడా విశ్రాంతిగా ఉండేందుకు కొద్దిగా సమయం చిక్కుతున్నది.

ఒక రోజున వాళ్ళింటి దగ్గర్లో ఆడుకుంటున్న పిల్లలు కొందరు శాంతిని ఎగతాళి చేశారు. "నువ్వు మాలాగా బడికి వెళ్లలేవు; చదువుకోలేవు. నీకు ఏమీ రాదు, నువ్వు ఏమీ రాయలేవు, చదవలేవు. మేము చూడు ఎంతబాగా చదువుతామో!" అంటూ నవ్వుకున్నారు. అది విని శాంతి చాలా నొచ్చుకున్నది. అక్కడే ఉండి అంతా గమనించిన లక్ష్మమ్మ "బాధపడకు శాంతీ, నీకు చదువు పెద్దగా లేకపోయినా ఎన్నో విలువలు తెలుసు; మంచి-చెడు తెలుసు. ఏదో ఒక రోజున నువ్వు కూడా చదువుకుంటావు- నాకు తెలుసు. నువ్వు గొప్పదానివి అవుతావు శాంతీ! అయినా సమయం అస్సలు మించి పోలేదు. ఇప్పుడైనా చదవటం మొదలు పెట్టు" అని చెప్పింది.

శాంతికి తల్లి మాటలు గొప్ప ప్రేరణనిచ్చాయి. ఊళ్ళో రంగనాధం మాస్టారు మంచి మనిషి అని అందరూ చెప్పుకుంటారు. శాంతి వెళ్ళి ఆయన్ని సాయం చెయ్యమని అడిగింది. "దానిదేముందమ్మా, మొదట నువ్వు పదోతరగతి పరీక్షలు రాయాలి. తర్వాత ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పరీక్షలు రాయొచ్చు. నువ్వు కృషి చెయ్యి- నేను నీకు సాయం చేస్తాను" అన్నారాయన. శాంతి ఆరోజునే చదువు మొదలు పెట్టింది. సంవత్సరం తిరిగేసరికి పదోతరగతి పరీక్షలు రాసింది. యాభైశాతం మార్కులతో పాసైంది! వెంటనే సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీకి కట్టుకున్నది. రామనాధం మాస్టారి సాయంతో చాలా శ్రమించి చదివింది. మొదటి తరగతిలో ఉత్తీర్ణురాలైంది! ఆ వెంటనే జరిగిన రాష్ట్రస్థాయి పరీక్షల్లో పదో ర్యాంకు సంపాదించుకొని, ఆమె "గ్రూప్ 2" ప్రభుత్వ ఆఫీసరుగా ఎంపికైంది. పేపర్లవాళ్ళు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. "కఠిన పరిస్థితులు ఎన్ని ఉన్నా పోరాడి గెల్చిన మహిళ" అని ప్రశంసించారు.

"నాదేం లేదు- ఇదంతా మా అమ్మ గొప్పతనం" అన్నది యంఆర్వో శాంతి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!