కవిత్వము ఛందస్సు .....నేనూ - నా సాహిత్య రచనలు : శ్రీ విశ్వనాథ సత్యనారాయణ!

కవిత్వము ఛందస్సు .....నేనూ - నా సాహిత్య రచనలు : శ్రీ విశ్వనాథ సత్యనారాయణ!


(మహతి ఆగష్టు 1972, యువభారతి ప్రచురణ నుంచి; వారి సౌజన్యంతో)

.

కవిత్వము ఛందస్సు వ్రాయవలయును. అట్లు వ్రాయనిచో కవిత్వము కాదు. ఈ ఛందస్సన్న శబ్దము రెండు ధాతువులనుండి పుట్టుచున్నది. 'ఛంద్‌-ఆహ్లాదనే'. రెండవ ధాతువు 'ఛది-ఆచ్ఛాదనే'. ఒకటి ఆహ్లాదనము చేయుచున్నది గనుక; రెండవది కప్పుచున్నది గనుక. అందుకని వేదమునకు ఛందస్సని పేరు. వేదము పాడబడినది. జీవుని యొక్క మాయను కప్పుచున్నది. ఆహ్లాదమును కల్పించుచున్నది. అందులో సంగీత మున్నది, లయ యున్నది. లయయు, సంగీతమును - అనగా రాగచ్ఛాయయును దానియం దున్నవి. సామ వేదమునందే లేదు. ఋగ్వేదమునందు నున్నవి. ఈ రహస్యము తెలిసిన త్యాగరాజుల వారు -

'నాద తను మనిశం శంకరం

నమామి మే శిరసా మనసా!'

అన్నారు. అనగా నాదము శివునియొక్క శరీరము. సంగీత విద్యలో నున్న రాగములన్నీ శివునిశరీరము. కనుక ఛందస్సు శివుని యొక్క శరీరము. శివుడు లేనిచో దేవుడు లేడుకదా! ఛంద స్సక్కరలేదు.


మరి రెండవ విషయము. కవిత్వము నాల్గు విధములు. ప్రబంధ కవిత్వము, ఆశుకవిత్వము, బంధకవిత్వము, చాటుకవిత్వము. చాటు కవిత్వానికి అనాది నుండి మన దేశములో తక్కువ వెల; ప్రబంధకవిత్వానికి ఎక్కువ వెల. ఈ ఇంగ్లీషు చదువులో Minor Poetry వృద్ధి పొందినది. ఖండికలు వచ్చినవి. అవి కవిత్వం కావటం మొదలు పెట్టింది. కావ్యము, శిల్పము, మహాపద్యరచనా శిల్పము, పాత్ర పోషణము, అనంతవిజ్ఞానము, ఒక జ్ఞానభాండాగారముగా నగుచున్న మహాకావ్యము, కవియొక్క అనంతశక్తి - మొదలైనవన్నియు ఉప్పునీళ్ళు చల్లుకొని పోయినవి.


చాటు కవిత్వమువంటి దానికి ప్రాశస్త్యము వచ్చినది. పూర్వము మన దేశములో నిది వినోదమునకైన కవిత్వము - రస సిద్ధికైన కవిత్వము కాదు. ఏవో నాల్గు పద్యములు వ్రాయుట - అట్టి పద్యము లొక గ్రంథముగా ప్రకటించుట - వాడు కవి. నిర్దుష్టమైన శబ్ద మక్కర లేదందురు. వదలి పెట్టుదము. ఔచిత్య మక్కరలేదా? ఉచితమైన యర్థ మక్కరలేదా?


ఈరీతిగా మనదేశములో నున్న మహాదివ్యకవితాభావనయే రూపుమాసి పోయినది. ఇపు డాపద్యానికి కూడా ముప్పు వచ్చినది.


ఇంకొక్క మాట చెప్పి మానివేసెదను. ప్రపంచకము - సర్వమానవ సౌభ్రాతృత్వము - ఏదో మిల్లి నీకు వచ్చునట! దాని మాట అట్లుంచి, ప్రపంచకమున ఇన్ని దేశము లున్నవి; ఇన్ని భాష లున్నవి. ఇన్ని దేశము లెందుకు? ఇన్ని భాషలెందుకు? ఎక్కడివాడు అక్కడనే చచ్చుచున్నట్లున్నాడే!


నిజానికి శిల్పముకాని, సాహిత్యము కాని, జాతీయమై యుండవలయును. విజాతీయమై యుండరాదు. వ్రాసినవానికి ముక్తి, చదివినవానికి రక్తి, ముక్తి. ఎంత సముద్రముమీద ఎగిరినను, పక్షి రాత్రి గూటికి చేరును. ఇది జాతీయత! ఇది సంప్రదాయము!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!