కలవారి కోడలు !

దేశి సాహిత్యము జానపద గేయములు !

కలవారి కోడలు

అవిభక్త కుటుంబము నందలి సౌందర్యమును వ్యక్తము చేస్తుంది ఈ పాట. వినండి.

కలవారి కోడలు కలికి కామాక్షి

కడుగుచున్నది పప్పు కడవలో పోసి

అప్పుడే ఏతెంచె ఆమె పెద్దన్న

కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీళ్ళు నింపె

ఎందుకు కన్నీళ్ళు ఏమి కష్టమ్ము

తుడుచుకో చెల్లెలా ముడుచుకో కురులు

ఎత్తుకో బిడ్డను ఎక్కు అందలము

మీ అత్తమామలకు చెప్పిరావమ్మ

కుర్చీ పీట మీద కూర్చున్న అత్తా

మా అన్నలొచ్చారు మమ్మంపుతార?

నేనెరుగ నేనెరుగ మీ మామ నడుగు

పట్టెమంచము మీద పడుకున్న మామ

మా అన్నలొచ్చారు మమ్మంపుతార?

నేనెరుగ నేనెరుగ మీ బావ నడుగు

భారతము చదివేటి బావ పెదబావ

మా అన్నలొచ్చారు మమ్మంపుతార?

నేనెరుగ నేనెరుగ నీ అక్క నడుగు

వంట చేసే తల్లి ఓ అక్కగారు

మా అన్నలొచ్చారు మమ్మంపుతార?

నేనెరుగ నేనెరుగ నీ భర్త నడుగు

రచ్చలో మెలిగేటి రాజేంద్ర భోగీ

మా అన్నలొచ్చారు మమ్మంపుతార?

పెట్టుకో సొమ్ములు కట్టుకో చీర

పోయిరా సుఖముగా పుట్టినింటికిని

ఎంత సుఖమైన హుకుము! రచ్చలో మెలిగేటి రాజేంద్ర భోగి ఉత్తరాంధ్ర సీమ గేయాలలో రెండు మూడు తడవలు కనబడుతాడు.

సరిగ్గా ఇటువంటి పాటయే రాయలసీమ పాటలలో ఒకటున్నది.

పట్టెమంచం మీద పండుండె మామా

అందరూ బోతారు నంది తిరణాళూ స్వామి తిరణాళూ

నన్నేమి యడిగేవు మీయత్త నడుగే

గద్దె పీటలమింద గౌరి పెద్దత్తా

అందరూ బోతారు నంది తిరణాళూ స్వామి తిరణాళూ

రచ్చకట్ట మింద రాజా పెదబావా

అందరూ బోతారు నంది తిరణాళూ స్వామి తిరణాళూ

వంటసాలల నుండె వయ్యారి అక్కా

అందరూ బోతారు నంది తిరణాళూ స్వామి తిరణాళూ

ఎద్దూల గాసేడి ముద్దూల మఱదీ

అందరూ బోతారు నంది తిరణాళూ స్వామి తిరణాళూ

సూదుల్లో ఉండేటి ఓ మొగలీరేకా

అందరూ బోతారు నంది తిరణాళూ స్వామి తిరణాళూ

రచ్చలో మెలిగేటి రాజేంద్రభోగికీ, సూదుల్లో ఉండేటి మొగలి రేకుకీ తారతమ్యమున్నది కదా! అది హుకుములో కూడ కనిపిస్తున్నది. ఈతడు వల్లగాదన్నాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!