Thursday, September 15, 2016

కాలునితో కలసి నడిచిన సతీసావిత్రికి జీవాత్మ దర్శనం.!

కాలునితో కలసి నడిచిన సతీసావిత్రికి జీవాత్మ దర్శనం.!

.

ప్రాణ, అపాన అనే వాయువులతో కలిసి అన్ని శరీరాల్లో సంచరించే అగ్నే జీవాత్మ. అచేతనమైన దేహాన్ని చేతనంగా చేసేవాడు, జీవాత్మగా భాసించే ఆ పరమాత్మ అని మహాభారతం అరణ్యపర్వంలో ఎర్రాప్రగడ వివరించాడు.

ప్రత్యక్ష దర్శనం...

ఇంతకూ ఆ జీవున్ని ప్రత్యక్షంగా దర్శించిన వారెవరైనా ఉన్నారా అంటే, ఉన్నారు. ఆ వ్యక్తే మహాసాధ్వి సావిత్రి, సత్యవంతుని భార్య. జీవున్ని యముణి్న దర్శించగలిగింది, కేవలం ఆమె పాతివ్రత్య మహిమ చేతనే.

నల్లని మేఘంలా శోభిల్లే నల్లని కాటుకవంటి ఆకారంతో, భయంకరమైన కోరలతో, మిలమిల మెరిసే నెత్తుటి రంగు నేత్రాలు కలిగి, ప్రళయకాలంలోని అగ్నిలా మండుతూ బంగారు రంగుతో వెలుగుతున్న వస్త్రాలు ధరించి, లోకంలోని జనులకు భీతిని కలిగించే విధంగా యమధర్మరాజు సావిత్రికి ప్రత్యక్షమవుతాడు. నిడివి ఎక్కువగా గల పాశాలను రాకుమారుడైన సత్యవంతుడి పైకి భయంకర రీతిలో ప్రయోగిస్తాడు. అతడి శరీరం నుంచి జుత్తిలి కొలత గల (చూపుడు వేలు, బొటనవేలు చాపగా, పైన నడిమ కొలతకు లోబడిన ఆకృతి) జీవుడిని బంధించి బయటకు లాగగా ఆ జీవుణి్న సావిత్రి ప్రత్యక్షంగా దర్శిస్తుంది.

కారణజన్మురాలు...

సావిత్రి ఉపాఖ్యానం మహాభారతంలో ఒక విశిష్ఠ రచన. వైధవ్యం తప్పదని తెలిసి వివాహం చేసుకున్న సాధ్వి సావిత్రి. ఆమె కారణజన్మురాలు, ధీరమాత కూతురు. ఆమె అంగీకారానికి ఆమోదముద్ర పలికిన ఆమె తండ్రి ధైర్యవంతుడు. 'పేర్కొనజాల పెంపునన్' అని కోరిన వరునితో వివాహం జరిపిస్తాడు. త్రిరాత్రోపవాసం చేసిన సావిత్రికి యమదర్శనం కలగడం విడ్డూరం కాదు. కాని ఆమె వివాహమైన తరువాత ఆ సంవత్సరకాలం కాలుని ఆగమనం కోసం నిరీక్షిస్తున్న పుణ్యవతిగా గోచరిస్తుంది. అంటే ఆమె తన భర్త మరణకాలాన్ని కొలుస్తున్నందువల్లే ఆమె కాలుడిని చూడగలిగిందన్నమాట. సావిత్రి కాలుడితో చాలా దూరంగా నడిచి ఎన్నో మాటలు మాట్లాడింది. 'సఖ్యం - సాప్తపదీనం' అంటూ ఏడు అడుగులు నడిచి మాట్లాడితే ఎవరైనా బంధువులవుతారని వివరించింది. ప్రసన్నుడైన యమధర్మరాజు పరిపూర్ణ ఫలాన్నిచ్చాడు సావిత్రికి. భర్త పరిపూర్ణ ఆయుస్సును, శతపుత్ర లాభాన్ని వరంగా పొంది పుట్టింటికి, మెట్టినింటికి గౌరవాన్ని తెచ్చిపెట్టిన మహాపతివ్రతా శిరోమణి సావిత్రి. కొలిచిన దైవం ప్రత్యక్షం కాగా కలిసి నడిచిన ఏకైక భక్తురాలు సావిత్రి, ధన్యురాలు.

త్రిరాత్రోపవాస వ్రతం..

సావిత్రి ఉపాఖ్యానంలో సమాధానం దొరకని ఒకే ఒక ప్రశ్న, భర్త మరణాన్ని ఆమె ఎలా ఎదుర్కోపోతున్నది ? కథను పరిశీలిస్తే మనకు తెలిసే విషయాలు స్వల్పం. సావిత్రి అందమైన ఆభరణాలు, వస్త్రాలు త్యజించి నారచీరలతో అడవిలో భర్తకు సపర్యలు చేసింది. నారద మహాముని చెప్పిన ప్రకారం తన భర్త ఆయువు ప్రమాణం లెక్కించుకుంటూ గడిపిన సావిత్రి అతని మరణానికి ఇంకా నాలుగురోజులే ఉన్నట్లు తెలుసుకుంది. అంటే అప్పటికి నాలుగురోజులు తక్కువగా ఒక సంవత్సరకాలం గడిచిపోయిందన్నమాట. వెంటనే పరమనిష్ఠతో త్రిరాత్రోపవాస మహావ్రతాన్ని పూనింది. పగళ్లతో కూడిన మూడురాత్రులు దీక్షతో ఉపవాసాలు చేసింది. నాలుగవ రోజున వేకువనే కాలకృత్యాలు తీర్చుకుని, భక్తితో భర్త శుశ్రూష చేసి, అత్తమామలకు, పెద్దలకు ప్రత్యేకంగా నమస్కరించింది. వారు ప్రీతితో చిరకాలం మాంగల్యంతో వర్ధిల్లమని పలికిన దీవెనలను మనసారా గ్రహించింది. భర్త సమిధలు, దర్భలు తేవడానికి అడవికి పోతుండగా అత్తమామల అనుమతితో అతడిని అనుసరించింది. అడవిలో చెట్లు నరుకుతుండగా సత్యవంతుడు శిరోవేదనతో బాధపడుతూ సావిత్రి ఒడిలో తలపెట్టుకున్నాడు. ఆ క్షణంలో ప్రత్యక్షమైన యముడిని చూసి "ఆర్యా, మీరెవరు?" అని ప్రశ్నించింది సావిత్రి. ప్రతిగా యముడు నేను కాలుడను సుమా! నీవు మహాపతివ్రతవు, అందుకనే నన్ను చూడగలిగావు. నీ భర్త ఆయువు తీరింది. ఇతడు పుణ్యాత్ముడు కనుక నేనే స్వయంగా వచ్చాను అంటూనే సత్యవంతుడి శరీరం నుంచి జీవుడిని బయటకు లాగి బంధించి దక్షిణ దిశగా బయలుదేరాడు. ఆయనను అనుసరిస్తూ సావిత్రి యముణి్న భక్తిపూర్వకంగా ఆరాధిస్తూ ఇలా సంబోధించింది.

"అంతకుండు, దండధరుడు, సంస్తుతగుణుడు, సమవర్తి, పితృపతి, ధర్మదేవత, యముడు, జలజాప్తసుతుడు, బ్రేతపతి, వైవస్వతుడు, ప్రథమ ధర్మాధ్యక్షుడు, ధర్మరాజు, ధర్మపదవీ పరిరక్షణుడు..."

గమనిస్తే ఆమె సంవత్సర కాలం త్రికరణశుద్ధిగా ఆరాధించి కొలిచిన దైవం ఎవరో కాదు...కాలుడే (కాలం) అని అర్థమవుతుంది. ఆ కాలాన్నే ఆమె లెక్కిస్తూ నిరంతరం కాలాన్ని కొలవడం వల్ల యముణి్న ఆరాధించిన ఫలం దక్కింది. దీక్షతో త్రిరాత్రోపవాసాలు చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకుని భర్త ప్రాణం పొంది ఆదర్శనారిగా, పతివ్రతగా జీవించింది ధీరవనిత సతీసావిత్రి.

.

(కృతజ్ఞతలు ..."Padyala Vaidyudu" Late Sri Dr. C.M. Krishnamurthy Garu)

No comments:

Post a Comment