భాస్కర శతకము - మారవి వెంకయ్య!

ఎట్టుగఁ బాటుపడ్డ నొక యించుక ప్రాప్తములేక వస్తువుల్

పట్టుపడంగనేరవు; నిబద్ధి సురావళిఁ గూడి రాక్షసుల్

గట్టు పెకల్చి పాల్కడలిఁ గవ్వముచేసి మధించి, రంతయున్

వెట్టియెగాక యే మనుభవించిరి వా రమృతంబు భాస్కరా!

(భాస్కర శతకము - మారవి వెంకయ్య

విశ్లేషణ....శ్రీ పిస్కా సత్యనారయణ గారు.)

అర్థములు: ఎట్టుగ = ఎంతగా; పాటుపడ్డ = కష్టపడినా; పట్టుపడంగనేరవు = లభించవు; నిబద్ధి = నిబద్ధతతో; సురావళి = దేవతల సమూహము; గట్టు పకల్చి = కొండను పెకలించి; పాల్కడలి = పాలసముద్రము; మధించి = చిలికి; వెట్టియె = వెట్టిచాకిరి, వృధా.

భావము: "మనుజులు ఏదైనా పొందాలంటే ప్రాప్తం ఉండాలి. అది లేనినాడు, ఎంత శ్రమపడినా అనుకున్న ప్రయోజనం సిద్ధించదు. ఎలాగంటే, క్షీరసాగరమును చిలుకుటకు దేవతలతో కలిసి, రాక్షసులు కూడా ఎంతో నిబద్ధతతో కష్టపడినారు. మందరపర్వతమును పెకలించి తెచ్చి కవ్వముగా చేశారు. సర్పశ్రేష్ఠుడైన వాసుకిని కవ్వపుత్రాడుగా ఉపయోగించారు. (చెప్పాలంటే సురలకన్నా, అసురులే ఎక్కువగా శ్రమించారు. దేవతలు వాసుకి యొక్క తోకవైపు పుట్టుకుంటే, దైత్యులు అతని పడగలవైపు పట్టుకుని, ఆ సర్పరాజు పడుతున్న ఆయాసమును, బుసబుసలను భరించినారు). ఇంతచేసినా, దానవులకు ఏమైనా ఒరిగినదా? అమృతం దొరికే ప్రాప్తం వారికి లేదుమరి!" అంటున్నాడు కవి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!