#గోంగూరపచ్చడి గొప్పతనం!

#గోంగూరపచ్చడి గొప్పతనం!

.

" పూర్వం దేవతలూ - రాక్షసులూ ముసలితనమూ,,చావూ తప్పించుకోవడానికై అమృతపానం చేస్తే ఫలితం ఉంటుందని తెలుసుకుని ఆ అమృతంకోసమై పాలసముద్రాన్ని మధింప పూనుకున్నారట.ఆదికూర్మాన్ని వేడుకుని కవ్వపుకొండకు అడుగున చుట్టకుదురుగా చేసుకున్నారట.. పాతాళం తాకే మూలభాగంగల మందర గిరిని కవ్వపు కొండగా చేసుకుని నాగరాజ వంశోత్తముడైన వాసుకుని కవ్వపు త్రాడుగా చేసుకుని ఆవహం,ప్రవాహం మొదలైన వాయుబేధాలను అడ్డత్రాళ్ళుగా అమర్చుకుని బలి నాయకత్వాన రాక్షసులు ఒకవైపూ,,దేవేంద్రుని నాయకత్వాన దేవతలందరూ మరోవైపూ నిలవబడి క్షీరసాగర మధనం ప్రారంభించారట..

.

అప్పుడు సముద్రమధ్య నుంచి భువనగోళాన్నీ,,దిక్కులనూ కబళిస్తూ చెవులు బ్రద్దలు చేసే ఘమఘమ ధ్వని పుట్టిందట..

.

అలా సముద్రమధనం అంతకంతకూ తీవ్రస్థాయి అందుకొంటూ ఉండగా మొదట వానకారు మబ్బు వన్నెతో హాలాహల విషం ఉద్భవించిందట..ఆ విషాగ్ని జ్వాలలకు దేవాసురులు బెంబేలెత్తిపోయి పరమేశ్వరుడిని ప్రార్ధిస్తే ఆయన వీరిని కరుణించి ఆ విషానంతటినీ చాలా అవలీలగా గుట్టుక్కున మ్రింగేశాడట.

ఆపద తప్పిందని మళ్ళీ వాళ్లందరూ అమృతంకోసమై పాలకడలిని మధిస్తూంటే వరుసగా చంద్రుడూ,,కల్పవృక్షమూ,,అప్సరసలూ,కౌస్తుభమణీ,ఉచ్చైశ్రవమనే గుర్రమూ,,ఐరావతమూ,,ఇంకా సమస్త కోరికలూ తీర్చే పదార్ధాలూ,,లక్ష్మీ దేవి ఆ తర్వాత అమృతకలశహస్తుడై మహానుభావుడైన ధన్వంతరీ ఉదయించారట..

వెంటనే రాక్షసులు ధన్వంతరి చేతిలోని ఆ అమృతకలశాన్ని లాక్కొని పారిపోతూ ఉండగా నారాయణుడు మోహినీ రూపందాల్చి ఆ రాక్షసులను వంచించి ఆ అమృతకలశాన్ని గ్రహించి దేవతలందరికీ ఆ అమృతాన్ని పంచాడట..

అలా పంచేశాక మిగిలిన ఆ అమృతపు కుండని భూమి మీదకి జారవిడిచేశాడట ఆ విష్ణుమూర్తి..

.

అది కాస్తా మా పిఠాపురం పరిసర ప్రాంతాలలోని గోంగూర తోటల్లో పండింది...

అందుకే అప్పటినుంచీ ఈ గోంగూరకి అమృతతుల్యమైన ఈ రుచి అబ్బింది :

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!