శ్రీశ్రీ సినీ ప్రస్థానం!

శ్రీశ్రీ సినీ ప్రస్థానం!

శ్రీశ్రీ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యడం అంటే అది ఆయన్ను అవహేళన చేయడమే!! ఎందుకంటే శ్రీశ్రీ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి; ఒక జాతిని జాగృతం చేయడానికి కలాన్ని కరవాలంగా ఉపయోగించిన ప్రచండ శక్తి;

1950లో “నీరా ఔర్ నందా” అనే హింది చిత్రం తెలుగు “ఆహుతి” అనే పేరుతో అనువదించారు. ఆ చిత్రానికి రచయితగా సినిరంగ ప్రవేశం చేశారు. నాటి నుంచీ ఆయన మరణించేదాకా ప్రేక్షకులను రంజింపచేసారు. తన మూడుపదుల సినిమా జీవితం లో అనేక డబ్బింగ్ చిత్రాలకు రచయితగా ఉన్నారు అంతేకాక స్వయంగా “చెవిలో రహస్యం” అనే డబ్బింగ్ సినిమా నిర్మించి చేతులు కాల్చుకున్నారు. సామాన్య మానవుడి బాధల్ని తన పాటల్లో వినిపించిన శ్రీశ్రీ మధుర ప్రణయ గీతాల్ని, అద్భుత విషాదగీతాల్ని కూడా అందించారు.

అనేక పాటల్లో, గేయాల్లో సగటు మనిషి వేదనను వర్ణించిన శ్రీశ్రీ తనకు అలవాటైన శైలి నుంచీ బయటకు వచ్చి కొన్ని ఆణిముత్యాల్లాంటి యుగళ గీతాలని, హుషారెత్తించే గీతాలని రాశారు. 

“బొమ్మను చేసి ప్రాణము పోసి” అంటూ ఒక గంభీరమైన పాటను అందించిన ఆ కలమే “జోరుగా హుషారుగా షికారు పోదమా” అంటూ అలరించింది.. 

“ఎవ్వరి కోసం ఈ మందహాసం” అనే డ్యూయెట్ రాసిన శ్రీ శ్రీ 

“పాడవేల రాధికా, ప్రణయ సుధా గీతికా”, ”

ఏమని పాడెదనో ఈవేళ” వంటి వీణా వాద్య ప్రధానమైన పాటలు కూడా రాశారు.. “అగాథమౌ జలనిధిలోన ఆణింత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే” అని ఆశావాదాన్ని బోధించారు.

. “వెలుగు నీడలు” చిత్రం లోని ఈ పాట విన్న అభాగ్యుడొకడు ఆత్మహత్యా ప్రయత్నాన్ని మానుకున్నాడట. 

“అల్లూరిసీతారామరాజు” సినిమాలో “తెలుగువీర లేవరా” అనే పాటకు కేంద్ర ప్రభుత్వం అవార్డ్ ప్రకటించి తనను తాను గౌరవించుకుంది.

ఇవంతా ఒక ఎత్తైతే “ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా” అనే పాట కాలదోషం పట్టకుండా ఉండటానికి మన సమాజం ఇథోధికంగా శ్రమించింది.. ఆనాడు మహాకవి “ఆకాశం అందుకొనే ధరలొకవైపు, అంతులేని నిరుద్యోగ మింకొకవైపు, అవినీతి బందుప్రీతి చీకటిబజారు అలముకున్న

నీదేశం ఎటుదిగజారు” అనే వాక్యంలో దేశ సమస్యలను ఏకరువు పెడితే ఈనాటికీ అవే సమస్యలు సజీవంగా ఎక్కువ మాట్లాడితే మరింత బలిమితో మనముందు నిలవడం మన ప్రారబ్దం. ఇలాంటి అజరామరమైన సాహిత్యాన్ని మన చిత్రసీమకు అందించిన మహాకవి 1983 జూన్ 15న తిరిగిరాని లోకాలకు తరలిపోయారు..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!