ఏమిటో ఈ మోడీ అస్సలు అర్థం కావడం లేదురా బాబోయ్...

ఏమిటో ఈ మోడీ అస్సలు అర్థం కావడం లేదురా బాబోయ్...

‘‘ఎవడైనా కోపంతో కొడతారు, కసితో కొడతారు… ఈడేంట్రా చాలాశ్రద్ధగా కొట్టాడు… ఏదో గోడకడుతున్నట్టు, గులాబి మొక్కకు అంటు కడుతున్నట్టు, చాలా జాగ్రత్తగా, పద్ధతిగా కొట్టాడురా…’’అని ఏదో తెలుగు సినిమాలో తనికెళ్ల భరణి విపరీతంగా ఆశ్యర్యపోతాడు…

అవును… ఇక్కడ ‘‘ఆడు మగాడ్రా బుజ్జీ’’ అనే పురుషాధిక్య, వివక్షాపూరిత డైలాగు వాడను… కానీ పాకిస్థాన్ ను చాలా శ్రద్ధగా కొడుతున్నాడు మోడీ… ఎంత శ్రద్ధగా అంటే అసలు పాకిస్థాన్ ను ఎన్నిరకాలుగా కొట్టొచ్చో ఆలోచిస్తూ మరీ కొడుతున్నాడు… అదేమీ మోడీని పొగడ్డం కాదు… నిజానికి మోడీ ఏంటో, ఆలోచన విధానమేంటో, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఏ అడుగులు వేస్తాడో… శతృదేశాలు, ఇరుగు పొరుగు దేశాలకే కాదు… ప్రపంచ దేశాల్లోని తలలుపండిన రాజకీయ విశ్లేషకులకూ అర్థం కావడం లేదు… ఆ పండిన తలలు బద్ధలు కొట్టుకుంటున్నారు… 

మోడీ… ఎవరికీ అర్థం కావడం లేదు… వాస్తవానికి గతంలోనూ కాలేదు… ఇకముందు కూడా కాడు…గోద్రా రైలు ఘటన తరువాత వేరే నాయకులైతే ఎలా ఉండేదో కానీ, మోడీ రియాక్టయిన తీరు తన సొంత పార్టీవారికే చిర్రెక్కించింది… అద్వాణీ అంతటోడే నివ్వెరపోయాడు… చివరకు వాజపేయ ‘రాజధర్మం’ పాటించురా నాయనా అని బుద్ధిచెప్పి, మందలించి, ఏమీ చేయలేక ఊరకుండిపోయాడు… 

మామూలుగా ఆర్ఎస్ఎస్ ప్రభావమే బలంగా ఉండే బీజేపీలో ప్రధాని అభ్యర్థిత్వం అనేది ఊహించలేం… కానీ బీజేపీని దానికి ఒప్పించాడు… ప్రత్యేక విమానం వేసుకుని ప్రతి రాష్ట్రమూ తిరిగాడు… సరే, గెలిచాడు… ఆ తరువాత బీజేపీలో తమకుతాము మహామహులం, అతిరథులం, మహారథులం అనుకున్న ప్రతి ఒక్కరినీ పక్కన పెట్టేశాడు…. అద్వానీతో సహా!! చివరకు వీహెచ్పీ, సంఘ్ కూడా కిమ్మనలేదు… ప్రధానిగా ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాల అధినేతల్ని పిలిచి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, మర్యాదలు చేసి పంపించాడు... 

అయిపోయిందా? తను ఏయే దేశాలు తిరుగుతున్నాడో ఎవరికీ అంతుపట్టడం లేదు… గతంలో ఇండియా ప్రధానులు వెళ్లని దేశాలు సైతం చుట్టి వస్తున్నాడు… అమెరికా అవసరమో, మన అవసరమో గానీ దాదాపు సైనిక సహకారం దాకా తీసుకొచ్చాడు… మధ్యలో అకస్మాత్తుగా నవాజ్ షరీఫ్ ఇంటి దగ్గరకు విమానం తీసుకెళ్లి, చాయ్ పే చర్చ పెట్టేసి, వాళ్ల అమ్మ కాళ్లు మొక్కి, ఆశీర్వాదం తీసుకుంటాడు… ఆ మరుసటి రోజే చైనా, పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ తమకు వ్యతిరేకమని స్టేట్ మెంట్ ఇచ్చాడు… తెల్లవారే ఇరాన్ వెళ్లి పాకిస్థాన్- చైనా కలిపి నిర్మించే గ్వదర్ పోర్టుకు దీటైన పోర్టు నిర్మాణానికి నిధులిచ్చి వచ్చాడు… నాగా తీవ్రవాద గ్రూపుతో చర్చలు సఫలమని ట్వీటాడు… తరువాత బర్మా సరిహద్దులు దాటి లోపలికి జొచ్చుకుపోయి నాగా తీవ్రవాదుల్ని హతం చేయించాడు….ఢిల్లీలో మూడంచెల నిఘా వ్యవస్థ… దళారుల మీద, అధికారుల మీద, నాయకుల మీద…. 

తన అధికార నివాసం వైపు ఒక్కరంటే ఒక్క కుటుంబసభ్యుడినీ రానివ్వడు…. తల్లిని మాత్రం అప్పుడప్పుడూ చూసొస్తాడు…. గురువు చనిపోతే భోరున కన్నీళ్లు పెట్టుకుంటాడు… అదేసమయంలో కాశ్మీర్ లో ఒక బురాన్ వనీ ఎన్కౌంటర్ జరుగుతుంది… 

అందుకే మోడీ ఎవరికీ అర్థం కాడు… బ్రహ్మోస్ క్షిపణులను ఏకంగా అమ్మేస్తామంటూ వియత్నాంకు ఆఫర్ ఇస్తాడు… మిగిలినవన్నీ తీసుకొచ్చి చైనా హద్దుల్లో మొహరిస్తాడు…. దీనికోసం ఓ బెటాలియనే ఏర్పాటు చేస్తాడు…. అదే రాత్రి చైనా వెళ్లి ‘మంచి టీ తాగుదాం గురూ’ అంటూ ఆ నేతల్ని కౌగిలించుకుంటాడు….

యూరీలో ఉగ్రదాడి జరిగితే… సింధు జలఒప్పందంబయటికి తీశాడు, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ కాగితాలు వెలికితీశాడు… విమాన ప్రయాణాలూ నిషేధమంటాడు… బెలూచిస్థాన్ లో తీవ్రవాదుల్ని ఎగేస్తాడు… ఇటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనూ ఉద్యమాలు పుట్టిస్తాడు… మళ్లీ ఇవన్నీ తీసుకెళ్లి ఐక్యరాజ్యసమితిలో గగ్గోలు పెడతాడు…. లెమో ఒప్పందం కుదిరిందిగా, పాకిస్థాన్ ను అధికారికంగా టెర్రరిస్టు దేశంగా ప్రకటించండి బాస్ అంటూ ఒబామాపై ఒత్తిడి తీసుకొస్తాడు…. ఉరి దాడి జరిగితే, యుద్ధానికి సిద్ధమా, నిరుద్యోగం మీదా? ఆకలిమీదా? శిశుమరణాల మీదా అని సవాల్ చేస్తాడు… ఓ అర్ధరాత్రి సర్జికల్ స్ట్రయిక్స్ తో ‘హద్దులు’ దాటేస్తాడు…. పార్లమెంటుపై దాడి తరువాత వాజపేయికి కూడా చేతకాని ఫీట్ అది…

అందుకే మోడీ ఎవరికీ అర్థం కాడు… కావడం లేదు… ఇకపైనా కాడు...

జయహో మోడీ జీ...

Krishna Somayaji గారికి కృతజ్ఞలతో .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!