అంత:సౌందర్యాము !

 అంత:సౌందర్యాము !

అనగనగా ఒక యువరాజు. ఆ రాజు ఎంతసేపూ తన అందాన్ని చూచుకొని మురిసి పోతుండేవాడు; మైమరచి పోతుండేవాడు.

ఎవరైనా బాటసారులు రాజభవనానికి వస్తే "మీరెప్పుడైనా నా అంత సౌందర్యవంతుణ్ణి చూశారా?" అని వాళ్ళనడిగేవాడు. అందరూ 'లేదు'అనే చెప్పేవారు.

ఒకరోజు దర్శనాని కొచ్చిన ఓ బాట సారైతే "దేవుడు కూడా మీ అంత అందంగా వుంటాడని నేననుకోను...!" అంటూ అతిగా పొగిడాడు.

దాంతో పొంగిపోయిన యువరాజు "దేవతల కంటే కూడ నేనే సౌందర్య వంతుడినట.." అంటూ మరింత గొప్పగా చెప్పుకునేవాడు.

అలా రోజులు గడుస్తున్నాయి.

ఒకరోజు దేవదూతలమని చెప్పుకునేవాళ్ళు ఇద్దరు అతని దర్శనానికి వచ్చారు.

"మీరు చెప్పుకుంటున్నంత సౌందర్యవంతులో..కాదో.. చూద్దామని వచ్చాం" వివరించారు.

"ఏమని తేల్చుకున్నారు? నేను అత్యంత సౌందర్యవంతుడినా, కాదా!?" ఉత్సాహంగా అడిగాడు యువరాజు.

"మిమ్మల్ని ఈ రోజు ఉదయం నిద్రిస్తుండగా చూశాం. అప్పుడు ఇంకా అందంగా వున్నారు..." ఒక దేవ దూత చెప్పాడు.

"నా సౌందర్యం కొన్ని గంటల్లోనే ఎలా తగ్గిపోయింది?" అంటూ సేవకుల్ని పిలిచి "నేను ఉదయం ఇప్పటి కంటే ఎక్కువ అందంగా వున్నానా?" ఆరా తీసాడు యువరాజు.

"మీరు అప్పుడూ ఇప్పుడూ ఒకేలా వున్నారు ప్రభూ!" జవాబిచ్చారు సేవకులు.

"మేము దైవ స్వరూపలం. మీ సేవకులు చూడలేని వాటిని కూడా మేము చూడగలం. వాళ్ళ దృష్టి అసంపూర్ణం. కనుక వారు చెప్పింది నిజంకాదు. ఆ విషయం మీకు రుజువు చేస్తాం...." అంటూ ఒక దేవ దూత రాజుగార్ని ఒక పాత్రలో నీళ్ళు తెప్పించమని అడిగాడు.

రాజు వెంటనే ఒక పాత్రలో నీళ్ళు తెప్పించాడు.

దేవదూత సేవకుల్ని పిలిచి "పాత్రలోని నీటిని మీరు దగ్గరగా పరిశీలించండి. జాగ్రత్తగా గమనించండి. తరువాత గది బయటికి వెళ్ళండి" అని చెప్పాడు. సేవకులు పాత్రలోని నీటిని జాగ్రత్తగా పరిశీలించి, బయటికి వెళ్ళారు.

అప్పుడు ఆ దేవ దూత పాత్రలోంచి ఒక అరచెంచా నీటిని తీసివేశాడు. మళ్ళా సేవకుల్ని లోపలికి పిలిచాడు- "పాత్రలోని నీటిలో ఏమైనా తేడా వుందా?" అడిగాడు.

"ఏమీ లేదు" జవాబిచ్చారు సేవకులు.

"పాత్రలో నీళ్ళు తగ్గినట్లు మీ సేవకులు గమనించ లేకపోయారు. మీ అందం‌ తగ్గిన విషయం ఎలా గమనించలేదో ఇదీ అంతే..." రాజు గారితో చెప్పాడు దేవదూత.

ఆ మాటలకు రాజు కంపించిపోయాడు.

'నా అందం రోజు రోజుకీ తరిగిపోతోందన్న మాట! అంటే కొన్ని రోజులకు అది బాగా తగ్గిపోతుంది!

దాన్ని గురించి నేను ఇంత ఆరాట పడుతున్నానే, అయినా అది స్థిరంగా ఉండదన్నమాట! మరెలాగ?!'

అని ఆలోచనలోపడ్డాడు.

మెల్లగా అతనిలో జ్ఞానం‌ ఉదయించింది. అద్దం అతన్ని ఆకర్షించటం మానేసింది.

నశించిపోయే భౌతిక సౌందర్యానికి గాక, అంత:సౌందర్యానికి, తన కర్తవ్యానికి ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలని అతనికి అర్థమైంది.

కాలక్రమేణా అతను పూర్తిగా మార్పుచెందాడనీ, గొప్ప మానవత్వంగల రాజుగా ఎదిగి, అటుపైన రాజ్యాన్ని కూడా వదిలేసి విరాగి అయ్యాడనీ చెబుతారు.

మూలం: ది హిందూ, ఏప్రియల్ 10, 2012. అనువాదం: శ్రీ పి.వి.ప్రసాద్, విజయవాడ.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!