ఒక స్త్రీ స్వగతం....

ఒక స్త్రీ స్వగతం.... 

.

అమ్మాయిలు - ఆంటీలు 

తెలుగులో కొన్ని కొన్ని మాటలు ఇతర భాషల నుండో, లేక సరదా కోసం పుట్టించినవో లేక మరో రకంగానో వచ్చి చాలా జెన్యూన్ గా చెలామణి అయిపోతుంటాయి.

.

'సుత్తి ' , 'అంత సీన్ లేదు ' 'కాలింది '(మండిపోయింది) మొదలైనవి..ఇంకా చాలా ఉన్నాయి గాని ఇప్పుడు విషయం వాటి గురించి కాదు. ఇలా పుట్టిన మాటల్లో

.

నాకు ఒళ్ళు మండించే మాట ఒకటుంది. అదే "ఆంటీ" ! ఆ మధ్య ఒక బ్లాగులో 'ఆంటీ 'అని పిలవడం పట్ల కొందరు స్త్రీ బ్లాగర్లు బాధ పడ్డారు కూడా! కేవలం బాధ బాధ పడి ఊరుకుంటె లాభం లేదని, ఒక టపా రాసేయాలని అనిపించి రాస్తున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మ స్నేహితుల్ని 'సుశీలత్త ''రాధత్త ' 'కమలత్త 'ఇలాగే పిల్చేదాన్ని! హైస్కూలుకొచ్చాక ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మల్ని 'అత్తా 'అని పిలుద్దామంటె కొంచెం సంకోచంగా ఉండేది.పైగా నా ఫ్రెండ్స్ అన్నలెవరూ అంత పెద్ద అందగాళ్ళు కుడా కాదని తెలిసిపోయింది. ఈ లోపు నా స్నేహితురాళ్ళు మా అమ్మను 'ఆంటీ ' అని పిలిచి నాకు దారి చూపించారు.

.

ఆడవాళ్ళను గౌరవంగా పిలవడానికి ఉపయోగించే మాటగా దీనికేమైనా నిఘంటువు అర్థం ఉందేమో గానీ నాకు మాత్రం భలే మంట! ముక్కూ, మొహం తెలియనివాళ్ళు వచ్చి 'ఆంటీ' అని పిలవడమేంటి? మొదట నన్ను మా ఇంటి వోనర్ గారి అమ్మాయి, నా ఈడుదే, పెళ్లైన కొత్తలో వాళ్ళింట్లో చేరిన నాల్రోజుల కల్లా "ఆంటీ అమ్మ మీకు ఇమ్మంది 'అని పాయసమో నా పిండాకూడో ఏదో ఇచ్చి శుభారంభం చేసింది. ఆ రోజు నుండి ఆంటీగా ఫిక్సయి పోయాను. నేను అప్పుడే నన్ను అక్కా అని పిలవమని చెప్పాను సౌమ్యంగానే! ఆ పిల్ల 'సరే అక్కా ' అని సంతోషంగా ఒప్పేసుకుంది.

ఆ మర్నాడు నుంచి మా వారు ఆఫీసు నుంచి రాగానే ' బావా, అక్క నీకు తాళాలియ్యమంది ' అనగానే పాపం తను ఎగిరి పడి పారిపోయారు. అయినా ఆ అమ్మాయి రూటు మార్చుకోక, ' బావా, అక్క ఇంకా రాలేదా, బావా అక్క ఆఫీస్ ఎక్కడ, 'బావా ఏడికెల్లొస్తున్నవ్ ' అంటూ బావా బావా బావా అని ఊదరగొట్టేసింది.! నేను కనపడితే 'అక్కా, బావ డ్యూటీకి పొద్దున్నే పోతడా?' 'బావ నీకంటె స్మార్ట్ కొడుతున్నడు కదా, నిన్నెట్ల షాది చేసుకుంటుండె?' అని మాట్లాడ్డం మొదలెట్టింది. దీనితో తను ఆఫీస్ అయిపోయాక రోడ్లమ్మట తిరిగి అర్థ రాత్రులు ఆ పిల్ల నిద్రపోయాక ఇంటికి వచ్చి, తిరిగి మరదలు నిద్ర లేవకముందే ఆఫీస్ కి పారిపోవడం ప్రాక్టీస్ చేసాడు. దానితో నేను మళ్ళీ ఆంటీగా మారడానికి నిశ్చయించుకున్నాను. 

అదే మొదలు! సిటీ బస్సులో అయిటే స్కూలు పిల్లలు, కాలేజీ పిల్లలు, పరిచయం లేని మగవాళ్ళు అందరూ 'ఆంటీ ' అనే పిలవడం! పెళ్ళి వల్ల జరిగే నష్టాల్లో ఇదొకటన్నమాట! ఇక లాభం లేదని, వాడుతున్న సబ్బు మానేసి, సంతూర్ సబ్బు మొదలెట్టాను.వాళ్ళూ ఆ మోడల్ కి ఎంత డబ్బిచ్చారో గానీ, సబ్బు వాడాక కూడా నన్ను మాత్రం ఒక్కళ్ళు కూడా ఆంటీ అనడం మానలేదు. ఇక మా పాప పుట్టాక పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇదివరలో ఎవరో ఒక్కళ్లన్నా, 'దీదీ' అనో, మేడం అనో పిలిచేవాళ్ళు! ఇప్పుడు చాలా మామూలుగా అదేదో నా పేరన్నట్టు నన్ను 'ఆంటీ' ని చేసేశారు. పెళ్ళవగానే 'శ్రీమతి ' తో పాటుగా 'ఆంటీ' కూడా బోనస్ గా వచ్చి చేరుతుందని అనుభవ పూర్వకంగా తెలిశాక, ఇహ ఏమీ చెయ్యలేకపోయాను.

.

ఎంతమందికని చెప్పడం "నన్ను పేరుతో పిలవండి ' 'నన్ను ఆంటీ అని పిలవకండి ' అని? పాలు, పేపరు వేసే వాడు (వయసు నలభై కి తక్కువుండవు) 'ఆంటీ , సారు లేరా? " అని అడిగినపుడు ఒళ్ళు మండి పోతుంది! నేనేమో ఆంటీ, ఆయనేమో 'సారు '! బయటి నుంచి వస్తుంటే,సెక్యూరిటీ 'ఆంటీజీ,ఆప్ కేలియే కొరియర్ " ఆంటీజీ !,ఇందులో బోడి మర్యాదొకటి! ఎల్కేజీ చదువుతున్న పాపను స్కూల్లో దింపడానికి వెళితే పదేళ్ళ కొడుకుని తీసుకునొచ్చిన చిన్ని నాయన 'ఆంటీ, వేర్ కెన్ ఐ మీట్ ద ప్రిన్సిపాల్?" అనడుగుతాడా? మా ఇంటి దగ్గర కడుతున్న ఒక బిల్డింగ్ లో పని చేసే తాపీ పని వాడు "ఆంటీ టైమెంత?" అని అడుగుతాడు.పాతిక నిండకుండానే పదివేల మంది నన్ను ఆంటీ అని పిల్చేసారు. ఇక చెత్త తీసుకెళ్ళే వాడైతే బెల్లు కొట్టి "చెత్తాంటీ!" (చెత్త ఉందా.ఆంటీ అనడం అన్నమాట) అని అరుస్తాడు. ఇదీ మరీ భయంకరంగా అనిపించింది నాకు. ఎన్ని సార్లు చెప్పినా ప్రతి ఇంటి ముందూ ఇదే కేక! గట్టిగా చీవాట్లేసానొకరోజు "చెత్తాంటీ ఏమిటి నీ మొహం " అని! మర్నాటినుంచీ వాడు "ఆంటీ, చెత్త " అనరవడం మొదలు పెట్టాడు. "ఒరే నాయనా, చెత్తాంటీ అన్నా, ఆంటీ చెత్త అన్నా తేడా లేదురా " అని చెపితే ఈ లాజిక్ వాడికర్ధం కాలేదు. పైగా విసుక్కుని "అబ్బ ఏంటాంటీ మీరు, ఒక పని చేయండి మీరంతా, నా బండి పదింటిదాకా ఈ ఏరియాలోనే ఉంటది.తొమ్మిదింటికి మీరు నాకో missed call ఇయ్యండి, నేనొచ్చి చెత్త దీస్క పోతా'నన్నాడు. అందువల్ల వాడు పైకి రాకుండా చెత్త అంతా కింద కలెక్ట్ చేసుకునే పద్ధతి పెట్టి వాడి నుంచి తప్పించుకున్నాం! కూరల వాడు, బస్టాప్ లో పక్కన నిల్చున్న కాలేజీ అమ్మాయిలు,పాత పేపర్లు కొనేవాడు,పక్కింటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్, (వాళ్ళు నార్త్ ఇడియన్స్ అయితే వాళ్ళ నాన్న కూడా),పై ఇంటి పిల్లల తల్లి, కిందింటి కొత్తగా పెళ్ళైన జంట(ఇద్దరూ) ...అరె ఒకళ్ళా ఇద్దరా! మగవాళ్ళ కి 'అంకుల్ ' పిలుపు ప్రాబ్లం ముప్ఫై కూడా నిండకుండా ఇంత తీవ్రంగా ఉంటుందనుకోను. అందుకే వాళ్ళు మరణ మృదంగం నవల్లో బిలహణుడిలాగా 'అల్లనల్లన జుట్టు తెల్ల బడినా, ఏ పిల్లా నన్నింత వరకూ అంకులనలేదు ' అని మురిసి పోతుంటారనుకుంటా! నన్ను ఆంటీ అని పిలిచేవాళ్ళెవరూ మా ఆయన్ని 'అంకుల్ ' అని పిలవగా నేను చూళ్ళేదు. పోయిన వేసవి లో నాలుగేళ్ళ మా అమ్మాయిని స్విమ్మింగ్ క్లాసులకి తీసుకెళ్ళినపుడు ఒక ప్రబుద్ధుడు ఒడ్డున ఉన్న నాతో 'your daughter is an excellent swimmer aunty, where is her dad? అనడిగాడు. అతని పదేళ్ల కొడుకు దున్నపోతులా ఈదుతున్నాడో పక్క!పళ్ళు నూరుతూ 'అదిగో అక్కడున్నార 'ని చూపించాను. ' పేరేంటీ అనడిగి మరీ వెళ్ళి 'మిస్టర్ ...(పేరు పెట్టి పిలిచిమరీ), యువర్ డాటరీజ్ గోయింగ్ టు బి ఏ చాంపియన్ ' అని అభినందిస్తుంటే నాకు నిజంగా మండిపోయింది.(సచ్చినోడు) ఇలా సింపుల్ గా ఉంటే లాభం లేదు, మా బిల్డింగ్ నిండా లుక లుక లాడుతూ ఉండే నార్త్ ఇండియన్స్ లాగే మనమూ ఫాషన్ గా ఉండాలని నిశ్చయించుకుని VLCC కి వెళ్ళి, బ్యూటి 'ఫుల్లు 'గా మారిపోయి (మారిపోయాననుకుని) ఇంటికొచ్చి బెల్లు కొట్టాను.మా ఆయనఒచ్చి తలుపు తీసి "ఓహ్, సారీ అండి , మా ఆవిడ ఇంట్లో లేదు, తర్వాత రండి! sorry for the inconvenience అని తలుపేశాడు..! తర్వాత విషయం తెల్సుకుని విసుగ్గా 'అబ్బ, ఎవరేమని పిలుస్తే ఏముందిలెద్దూ!నువ్వెంచక్కా ఎప్పటి లాగా హాండ్లూం చీరెలూ, డ్రెస్సులూ వేసుకో"అన్నాడు. మనకు ఇంట్లోనే ప్రోత్సాహం లేకపోతే బయటివాళ్లననుకుని ప్రయోజనం ఏముందని నిరాశగా సర్దిచెప్పుకున్నాను! ఇలా ఉండగా వినాయక చవితి కి మా కమ్యూనిటీలోనే ఒక మండపం పెట్టి కనీసం 5 రోజులు పూజ జరపాలని కాలనీవాళ్ళు నిర్ణయించారు! అందుకని వినాయకుడు పుట్టినప్పటి నుంచి (అదేలెండి తయారైనప్పటినుంచి) చంద్రుడు పగలబడి నవ్వేంత వరకు పదిహేను సీన్లతో ఒక నాటకం తయారు చేసి పిల్లలతో ప్రాక్టీస్ చేయించి విజయవంతంగా ప్రదర్శించాము! పైగా నాటకం హిందీలో! (ఇక్కడంతా వాళ్ళే ఎక్కువ! మేమేదో సొంత ఇళ్ళల్లోనే చత్రపతి సినిమాలో శరణార్ధుల్లా బతికేస్తున్నాం) తెలుగులో రాసి, దాన్ని ఒక గుజరాతీ అమ్మాయికి ఇంగ్లీషులో వివరించగా ఆవిడ హిందీలో తిరగ రాసింది. నాకు హిందీలో ఇరవై వరకు నెంబర్లే మధ్యలో ఎవరన్నా అందించాలి. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న లలిత్ చోప్రా కి ఇంకా పెళ్ళి కాలేదు.ఎందుకు చెప్పానంటే నన్ను ఆంటీ అనడానికి చోప్రాకి సర్వ హక్కులూ ఉన్నాయన్నమాట!రోజూ సాయంత్రం mind space నుంచి డైరెక్టుగా ప్రాక్టీస్ కి వచ్చి కావాలని ఒకటికి పది సార్లు 'బలే ఉందాంటీ నాటకం ' అనేవాడు. ' 'ఇదిగో చోప్రా, నన్ను ఆంటీ అని పిలిచావంటే నిన్ను చంపుతాను ' అని బెదిరించి చూసాను. చివరి రోజున నాటకం పూర్తయ్యాక, పిల్లలందరికీ బహుమతులు ఇచ్చి, 'మేకప్ చేసిన రాధాంటీ కి, లైట్లు పోకుండా చూసిన సుమన్ ఆంటీకి....అంటూ పిలిచి ఏవో మెమెంటోలు ఇచ్చాడు. నేను స్టేజీ కిందనుంచే 'నన్ను ఆంటీ అని పిలిచావో.....చూడు" అని సైలెంట్ గా తర్జని చూపించాను. లలిత్ గాడు నవ్వుతూ.."చివరగా ఈ కార్యక్రమం విజయవంతంగా నడిపించిన బేబీ అమ్ము ని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను " అన్నాడు. 'పార్వతిగా వేసినమ్మాయి వల్ల నాటకం రక్తి గట్టిందనుకున్నాం గానీ ఆ పాప పేరు అది కాదే ' అని ఆలోచిస్తుండగా , మా వారు నన్ను చూసి నవ్వుతూ "లలిత్ నిన్నే పిలుస్తున్నాడు ,నువ్వు ఆంటీ అనొద్దన్నావుగా ' అని ముందుకు నెట్టారు. ఈలోపుగా లలిత్ నాలుగైదు సార్లు 'బేబీ .... , ఎక్కడున్నా స్టేజీ మీదికి రావలెను ' అని అనౌన్స్ చేసాడు. ఆడాళ్లంతా వాడిని కొట్టినంత పని చేసారు. 'మేమంతా ఆంటీలా,తనేమో బేబీనా ' అని! నేనేమో 'ఓరి దొంగ చచ్చినాడా " అనుకుంటూ లేచాను. ఆ దెబ్బతో ఒక నాలుగైదు నెల్ల పాటు నేను 'బేబీ' గానే చెలామణి అయ్యాను. సో, మొత్తానికి పెళ్ళై పిల్ల(లు) పుట్టాక ఎంతటివారలైనా ఆంటీలు అయిపోతారనడానికి ఎంతమాత్రమూ సందేహం లేదు. మీ వయసెంతైనా సరే! మీలో ఎంతమంది ఆంటీలున్నారో, లేక 'ఆంటీ' అని పెళ్లైన ఆడవాళ్లని పిలిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులెత్తండి! (దొంగ సచ్చినోళ్ళు..బాగుందాంటీ అనికూడా కామెంటుతారేమో..).

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!