రాముని వారము మనము, మనకేల విచారము...

Sivarama Krishna Rao Vankayala.

.తోడబుట్టిన అన్నగారు కాసులు తేలేదని వెలివేసినట్టు వదిలేసినా, ఆ కటికపేద సంసారి ఏమాత్రం బాధ పడలేదు. ఇంకో విషయం, అసలు ఆయనకి ఈ పూట గడవడం ఎలా అన్న చింతే లేదు, 'రాముని వారము మనము, మనకేల విచారము' అన్న గుండె ధైర్యం తప్ప! ఎవరు తనను వదిలేసినా ఆయనకు ఎప్పుడూ గుండె జారలేదు. పైగా తన బలగాన్ని చూసుకొని, తనకు వీరే కదా పరమబాంధవులు అనుకొని ఆనందించడం పరిపాటి అయనకి! ఆయనే సంగీత సద్గురువు త్యాగరాజు గారు. తన బలగాన్నీ, ఆ బలగానికి బలం అయిన తల్లిదండ్రుల్నీ మనకి చూపిస్తున్నారు:

సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడు మా తండ్రి

వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన

ధాత -భరతాదులు సోదరులు మాకు ఓ మనసా || (సీత)

పరమేశ వసిష్ఠ పరాశర నారద శౌనక శుక

సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు

ధర నిజ భాగవతాగ్రేసరులెవరో వారెల్లరు

వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా || (సీత)

"సాక్షాత్తు ఆ సీతమ్మే మా అమ్మ. సీతమ్మ అమ్మ అయితే, శ్రీ రాముడే కదా తండ్రి! 

వాయునందనుడు ఆంజనేయుడు, సుమిత్ర పట్టి లక్ష్మణుడు, వినతా సుతుడు గరుత్మంతుడు, శత్రువులను మర్దించే శత్రుఘ్నుడు, ధాత అనిపిలువబడే బ్రహ్మదేవుడు, భరతుడూ మాకు సోదరులు.

పరమశివుడు, ఇంకా వశిష్టుడు,పరాశరుడు మొదలైన మునులు, నారదుడు, శౌనకుడు,శుకయోగి, దేవేంద్రుడు, గౌతముడు, లంబోదరుడైన గణపతి, గుహుడు (కుమారస్వామి), సనకసనందనాదులూ వీరంతా పరమ భాగవతులు కనుక ఈ త్యాగరాజుకి దగ్గర బంధువులు. కనుక ఓ మనసా, తెలుసుకో!"

ఇలాంటి బలగం, బంధుగణము ఉన్న వ్యక్తికి చింతలు ఎలా ఉంటాయి?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!