సిరిదా వచ్చిన వచ్చును

సమాయాతి యదా లక్ష్మీ నారికేళ ఫలాంబువత్

వినిర్యాతి యదా లక్ష్మీః గజభుక్త కపిత్ధవత్

సిరిదా వచ్చిన వచ్చును

సలలితముగ నారికేళ సలిలము భంగిన్

సిరిదా బోయిన బోవును

కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!

లక్ష్మి వచ్చేటప్పుడు లలితంగా అనగా కొబ్బరికాయలోకి నీరు చేరినట్లు వస్తుంది, పోయేటపుడు ఏనుగు తిన్న వెలగపండులా పోతుందన్నారు బద్దెనభూపాలుడు.

ఎంత నిజమెంత నిజం, సిరి, చిన్నమ్మ అంటే లక్ష్మీ దేవి, అన్ని పేర్లూ అమ్మ పేర్లే,అన్నీ అమ్మ రూపాలే, అందుకే సహస్రం అన్నారు, సహస్రమంటే అనంతమని అర్ధం. ఈ చరాచర ప్రపంచంలో కనపడేవన్నీ, కనపడనివీ కూడా అమ్మ వైభవాలే, ఒక్క ధనమే లక్ష్మి కాదు! అనంతాన్నీ కుదించడానికి ప్రయత్నం చేసి చెప్పేరు. అష్ట లక్ష్ములని. ధన,ధాన్య,విద్య…ధైర్య లక్ష్ములని. ఈవిడ కూడా ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇందులో ధైర్యలక్ష్మి కి రెండు అంగాలు సత్యము,ధర్మము. ఇవి పాటించినవాని వద్ద ధైర్య లక్ష్మి స్థిరంగానూ ఉంటుందిట. విజయలక్ష్మి, ఈమెకు రెండు అంగాలు వినయము, సౌశీల్యము, వినయం, సౌశీల్యం లేని విజయ లక్ష్మి, పొగరు, తలబిరుసు, విరుగుబాటు కలగచేస్తుంది. సిరితల్లి వచ్చేటపుడు చప్పుడు చేయదట, వచ్చి చేరేదెలాగో కూడా తెలియక చేరుతుందిట. దానికి మంచి ఉదాహరణ చెప్పేరు, కొబ్బరికాయలో నీరు ఎప్పుడు చేరుతుందో ఎవరికైనా తెలుసా? భగవంతునికే తెలియాలి. అలా చిన్నమ్మ చేరేటపుడు చప్పుడు చేయక చేరినది ఆ తరవాత చప్పుడు మొదలెడుతుంది. కొత్త చుట్టాలు, బంధువులు, మిత్రులు, హంగు, ఆర్భాటం చేరిపోతాయట. దీనికి తోడుగా అధికారం కూడా సంప్రాప్తమవుతుంది. ఇంక చెప్పేదేమి? ఆ చప్పుడు చాలా గొప్పగానూ ఉంటుంది, మంగళకరమూ అవుతుంది. సత్య, ధర్మాలున్న చోట ఎప్పటికీ ఉంటుంది. 

ఎప్పుడు సంపద కలిగిన

అప్పుడు బంధువులు వత్తు రదియెట్లన్నన్

దెప్పలుగ జెరువు నిండిన

కప్పలు పదివేలు జేరు కదరా సుమతీ.

ఒక్కొకప్పుడు సత్యం, ధర్మం లేనిచోటికే చేరుతోంది లక్ష్మి అనచ్చు, అది తాత్కాలికమే, వాపును చూసి బలుపనుకునేవారున్నంత కాలం ఇలాగే ఉంటుంది. తోడు చేరే వారు ఎవరై ఉంటారట? అబద్ధాలకోర్లు,ముఖస్తుతి చేసేవారు, పొగడ్తలరాయుళ్ళు, కోతల రాయుళ్ళు, స్వార్ధపరులు, అవినీతి పరులు, బంధుప్రీతి పెరుగుతుంది, కళ్ళ కి మాయ పొరలు కమ్ముతాయి. అందరూ పిపీలకాలకంటే అన్యాయంగా కనపడతారు. ఇలా నానా జాతి సమితీ చేరడంతో కాలం గడుస్తూ ఉంటుంది.,

ఇలా చేరినవారిలో నానా రకాలవారూ ఉంటారనుకున్నాం కదా! వారితో స్వార్ధం పెరుగుతుంది, అన్యాయం పెరుగుతుంది, అధర్మం పెరుగుతుంది, ధర్మం అధర్మంలా కనపడుతుంది, అధర్మ కార్యాలమీద మనసుపోతుంది. అవినీతి, బంధుప్రీతి పెరుగుతాయి. నారాయణా అంటే బూతు మాటలా వినపడుతుంది, అంతే వాసులు, తమకోసం చేసిన అక్రమాలన్నీ దేశసేవలా కనపడతాయి. అమ్మయ్య! అమ్మకి కావలసినదిదే, ఇది ఎక్కడ పెరిగిపోతుందో అక్కడ నుంచి అమ్మ చల్లగా చప్పుడు చేయక వెళిపోతుందిట. ఎలా వెళుతుందన్నారు? కరిమ్రింగిన వెలగపండు కరణిని, అంటే ఏనుగు తిన్న వెలగపండును, అలాగే విసర్జిస్తే అందులో ఏమీ ఉండనట్టు, ఈ కరి అనేమాటకి మరో అర్ధం చెప్పుకోవచ్చు. కరి అంటే నలుపు అని అర్ధం. నలుపు తిన్నట్లని కూడా చెప్పచ్చు, వెలగపండు చూడటానికి పైకి బాగున్నా బద్దలు కొడితే అందులో బూజులా ఉన్న నల్లని పదార్ధం పండులో గుజ్జును తినేయడం చూస్తుంటాం. పైకంతా బాగున్నట్టు కనపడినా లోపలేం లేకపోవడం జరుగుతుంది, ఇదే కరిమింగడమంటే. ఇలా గుజ్జు మాయమైన వెలగపండులా చిన్నమ్మ బయటికి వెళిపోతుంది. అప్పుడు చప్పుడు ఉండదు, అమ్మ వెళ్ళిన తరవాత వైభవ చిహ్నాలేమీ మిగలవు, ఈడుపు కాళ్ళు ఏడుపు ముఖం మిగులుతుంది. ఒకరిని అనవసరంగా దూషిస్తే, అబద్ధాలు ప్రచారం చేస్తే మిగిలేది ఇంతే. అప్పుడు పలకరించేవారే కరవౌతారు.

ఈ రెండు ఒక సారి చూడగలగడం కష్టం, మన దేశంలో జరిగిన ఎన్నికలు, ఆ తరవాత సంఘటనలు, అధికారం పోయిన వారు ఎందుకుపోయిందో తెలుసుకో లేనంతగా కళ్ళు మూతలు పడేలా చేసిన అమ్మ వైభం ఏమని చెప్పను?అసలు కారణం వదిలేసి కొసరు కారణా లు వెతుక్కునేలా.

ఇది వ్యక్తులలోనూ ఇంతే!!!

ఆరోగ్యం లక్ష్మి, ఎన్ని ఉండి ఉపయోగం? ఆరోగ్యo లేనపుడు, ఆనందం లక్ష్మి, ఈ ఆనందం కలిగినదానిలో అనుభవించి తృప్తి చెంది, ఆనందపడి ఇతరులను ఆనందింపచేయడం లోనే మానవ జన్మ సార్ధకత. కలిగినదానిలో వితరణ చేయి, చేయగల దగ్గర వెనకతీయకు, కూడా ఏమీ రాదు. ఎదిటి వారికి ఆనందం మాటతోనైనా సరే ఇవ్వగలమనుకుంటే, ఎందుకు వెనకాడటం, మాట మాటాడటానికి కూడా వెనకతీసేవారున్నారు.. ఇవ్వడంలో ఉన్న ఆనందం అనుభవిస్తే కాని తెలియదు, ఆనంద లక్ష్మిని అనుభవిద్దాం, సంతృప్తితో జీవిద్దాం. మాయలో పడిపోవద్దు.

తస్మాత్ జాగ్రత!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!