అనువు కానిచోట….

అనువు కానిచోట….


అనువుకానిచోట అధికులమనరాదు

కొంచముండుటెల్ల కొదువ కాదు

కొండ అద్దమందు కొంచమైయుండదా

విశ్వదాభిరామ వినుర వేమ.హిమాలయాల్లోని మానస సరోవరంలో ఉండే హంసల గుంపునుంచి ఒక రాజహంస దారితప్పి ఒక కాకులగుంపులో దిగింది. ఎప్పుడూ ఊరుదాటి ఎక్కడికీ వెళ్ళని కాకులు ఆ హంస అందాన్ని, ఠీవిని చూసి ఆనందపడ్డాయి. ఇంత అందంగా కూడా ఉంటారా మనజాతివారని. అందరూ చుట్టూ చేరి పలకరించి ఎక్కడనుంచి వస్తున్నావు, ఎవరు నువ్వు అని ప్రశ్నించాయి. తనపేరు రాజహంస అని నివాసం మానస సరోవరమని అది హిమాలయల్లో ఉంటుందని చెప్పేటప్పటికి, హంస గొంతు విని, పలుకు హొయలు విని కాకులు కొద్దిగా ఈర్ష్య పడ్డాయి, తమ రూపంతో, గొంతుతో పోల్చుకుని. ఇది వెళ్ళగక్కేందుకు ఒక కాకి ఇంత అందంగా, తెల్లగా ఉన్నావు రోజూ ఏమితింటావని అడిగితే మానస సరోవరంలోని లేత తామరతూడులు తింటానని చెప్పింది, దానికి కాకి ”ఏం! అక్కడ నత్తలు పీతలు దొరకవా?,” అని అడిగితే హంస ఆశ్చర్యపోయింది. అయ్యో పీతలు నత్తలు ఎంత బాగుంటాయో వాటిని తినకుండా నీ బతుకు వ్యర్ధమని ఎకసెక్కెమాడాయి. కాకి హంసని తెలివితక్కువదానిగా అంచనావేసి, తమరూపంతో, గొంతుతో పోల్చుకుని అసూయపడుతూ నువ్వింత సున్నితంగా, పెద్దగా ఉన్నావు కదా ఎంత ఎత్తు ఎగరగలవంటే ఆకాశమెత్తని, ఎంత దూరమైనా ఎగరగలనని చెప్పింది. కాని కాకికి నమ్మకం కలగకా, అసూయ, ఈర్ష్య, గర్వంతోనూ, ఐతే నాతో ఎగరమని బయలుదేరితే హంసకూడా బయలుదేరి సముద్రం మీదకి వెళితే హంస ఎగురుతూనే ఉంది, కాకికి నీరసమొచ్చింది, వాలుదామంటే కిందనీరు కనపడింది తప్పించి వాలేందుకు ఆసరా దొరకలేదు. ఏమిచేయాలో తోచక వెనక్కి తిరిగొచ్చే సావకాశం లేక కాకి నీటిలో పడి మరణించింది, హంస మానస సరోవరానికి ఎగిరిపోయింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!