నివేదిక

నివేదిక 

స్కూల్ లో క్లాస్ జరుగుతుంటుంది .. స్కూల్ తనిఖీ ( Inspection )చెయ్యడం కోసం ఒక పెద్దాయన స్కూల్ కి వస్తారు. 

ఒక తరగతి గదికి వెళ్తారు .. అక్కడ టీచర్ ఏదో పాఠం చెప్తూ ఉంటారు. 

తనిఖీ చెయ్యడం కోసం వచ్చిన పెద్దాయన ఆ తరగతిలోని ఒక విద్యార్థిని ఒక ప్రశ్న అడుగుతారు.

తనిఖీ అధికారి : బాబూ నువ్వు లేచి నిలబడు ! 

విద్యార్థి లేచి నిలబడతాడు.

తనిఖీ అధికారి : రామాయణం ఎవరయ్యా రాసింది ?

విద్యార్థి : నాకు తెలియదు సార్ , నేనైతే రాయలేదు !!.

తనిఖీ అధికారి ఎవరో ఒకర్ని ప్రత్యేకించి అడగడం దేనికని .. విద్యార్థులనందరినీ ఉద్దేశ్యించి ... 

' రామాయణం ఎవరు రాసారో మీలో ఎవరైనా చెప్తారా ' అని అడుగుతారు.

విద్యార్థులెవ్వరూ సమాధానం చెప్పరు .. అంతా మౌనంగా ఉంటారు. 

అప్పుడు ఆ అధికారి ఉపాధ్యాయులవారిని అడుగుతారు ..

'ఏంటి మాస్టారు .. రామాయణం ఎవరు రాశారంటే ఎవరూ చెప్పట్లేదు '

దానికి ఆ ఉపాధ్యాయుని సమాధానం : 'ఏమో సార్ ..ఎవరు రాశారో నేను చూడలేదు '.

ఆ సమాధానం విన్న అధికారికి చిర్రెత్తుకొస్తుంది

పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారిని పిలిచి జరిగినదంతా చెప్తారు.

దానికి ఆ హెడ్ మాస్టర్ గారు :: 'అయ్యో మీతో అలా చెప్పారా !! .. ఐతే మీకు అబద్దం చెప్పారు !! 

(ఒక కుర్రాడిని చూపిస్తూ ) ఆ రామాయణం రాసింది ఈ కుర్రాడే .. అది చెప్పింది మా మాస్టారే .. ఆయన చెప్తుండగా వీడు రాయడం నేను కళ్ళారా చూశానండి '. 

(నివేదిక చివర్లో తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తనిఖీ అధికారి చేసిన సూచన ఇలా ఉంది.) 

ఆ పాఠశాలలో చదివే విద్యార్థులకు గానీ , పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడికి గానీ , ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి గానీ ఎవ్వరికి .. 

రామాయణం రాసింది రాముడనీ , మహాభారతం రాసింది భీముడనీ తెలియదు.

ఇలాంటి సిబ్బంది ఉండడం వల్లనే మన విద్యావ్యవస్థ ఇలా తయారయింది. 

వీలైనంత త్వరలో ఆ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!