అ=అక్కినేని, ఆ=ఆదుర్తి .!


అ=అక్కినేని, ఆ=ఆదుర్తి .!
సరే....అ ఆ లు,గుణింతాలు గుర్తున్నాయి కదా ..ఇవాళ మీకు వైవిధ్యంగా ఉండేలా నేర్పుతా...వింటారా?’

‘ఓ....వింటాం మాస్టారూ... చెప్పండి...’

‘అ అంటే అక్కినేని, ఆ అంటే ఆదుర్తి’

‘అవి ఇంటిపేర్లు కదండీ’

‘అవునర్రా...అక్కినేని నటన, ఆదుర్తి దర్శకత్వం వెరసి తెలుగు సినీ కళామతల్లి జన్మ ధన్యమైంది. కాబట్టి ఈ అఆల గురించి అనుకోవడంలో తప్పేమీ లేదు’
‘ఆదుర్తి వారి పేరేమిటండీ మాస్టారూ?’

‘సుబ్బారావు గారు. తెలుగు కుటుంబాల్లో పదిమందిలో ఒకడికి సుబ్బారావనే పేరు ఇదివరలో ఉండేది. ఫారినర్లు సుబ్రేవ్ అనేవారు, బాగా త్రేంచమన్నట్టు... సుబ్బారావులంతా మంచి వాళ్ళే. ప్రతి సుబ్బారావులోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఉదాహరణకి యల్లాప్రగడ సుబ్బారావు గారు....’

‘యాంటీ బయోటిక్ సృష్టించింది వీరే కదండీ...’

‘అవును. ఒక పట్టాన లొంగని రోగాల నివారణ కోసం ఈ సుబ్బారావు గారు మాత్రలు సృష్టించినట్టు ఆదుర్తి సుబ్బారావు గారు మానవతా విలువల ప్రోత్సాహం కోసం సినిమా పాత్రలు సృష్టించారు.’

‘ఆదుర్తి వారు అన్ని సినిమాల్లో అక్కినేని వారినే హీరో చేశారా?’

‘అక్కినేని వారు, దుక్కిపాటి మధుసూదన రావు గారు కలిసి అన్నపూర్ణా పిక్చర్స్ బ్యానర్ పెట్టి చాలా మాంచి సినిమాలు తీశారు. వాటిలో తొంభై శాతం ఆదుర్తి వారి దర్శకత్వం లోనివే.’

‘దొంగరాముడు ..అని విన్నాం సినిమా పేరు. అది అన్నపూర్ణా వారిదే అని కంప్యూటర్ చెబుతోందండీ’

‘కంప్యూటర్ ఎవడ్రా చూడమన్నది? నేనున్నాగా ...నాకు ఊ కొడుతూ వినండి చాలు. దొంగరాముడు ఆదుర్తి వారి దర్శకత్వం లో కాదు..కెవి రెడ్డి గారి డైరెక్షన్ లో వచ్చింది. ఏం?’

‘ఊ(..’

‘ఆదుర్తి వారు ముంబై వెళ్లిపోయి ఎడిటింగ్ శాఖలోనూ, ఫోటోగ్రఫీ లోనూ తర్ఫీదు పొంది చెన్నై వచ్చి తన ప్రతిభని చూపించారు..’

‘ప్రతిభ అనే అమ్మాయా అండీ?’

‘ఇంతలేసి లేరు...మీకు అమ్మాయిల గోల ఎందుకర్రా ఇప్పటినుంచే’

‘సార్ ...వీడు మూడు సార్లు ఫెయిలై ఇంకా ఈ క్లాసులోనే ఉన్నాడు. వీడే అమ్మాయల గురించి వాకబు చేస్తుంటాడు’

‘నోరు ముయ్యండర్రా....చదువుకున్న అమ్మాయిలు సినిమాకి ఆదుర్తి వారే దర్శకులు. తెలిసిందా? మాట్లాడరేం?’

‘మీరే కదండీ మాస్టారూ నోరు ముయ్యమన్నది!’

‘మీరే నయంరా. ఇంతకు ముందు బ్యాచు వాళ్ళు నోరు ముయ్యండి అంటే తిన్నగా నా మీదికొచ్చి నా నోరు మూసేసే వారు. ‘

‘హి హి హి’

‘సైలెన్స్ ... మూగ మనసులు సినిమా ఆయనే డైరెక్ట్ చేశారు’

‘అందులో గోదారి గట్టుంది కదండీ..’

‘గోదారి గట్టు రాజమండ్రిలో ఉంది. పాట మూగ మనసులు సినిమాలో ఉంది.’

‘అయితే సార్ ..అక్కినేని, ఆదుర్తి ఇద్దరు మిత్రులు అన్నమాట’

‘కాబట్టే ఇద్దరు మిత్రులు సినిమా అంత బాగా వచ్చింది. అందులో ఫారిన్ ట్యూన్ కి తెలుగు కోటింగ్ ఇచ్చి సంగీత దర్శకులు రాజేశ్వర రావు గారు భలే పాట చేశారు..హలో హలో ఓ అమ్మాయీ’

‘పిలిచారా సార్...’

‘నిన్నా తల్లీ? లేదులే ..పాట గొణిగా...అంతేలే ..’

https://www.youtube.com/watch?v=AByC6blUAUs


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!