గోదారి గట్టుంది…



గోదారి గట్టుంది…

  పండు ముసలిగా ఉన్న గౌరి (జమున)నిక్లోజప్ లో చూపిస్తూ, కథని ప్లాష్ బ్యాక్ లోకి తీసుకువెళతారు మూగమనసులు చిత్రంలో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుగారు. సరిగా అప్పుడే ఓ అద్భుతమైన పాట మొదలవుతుంది. అదే `గోదారి గట్టుంది…’

   ఇదొక అరుదైన ప్రేమకథా చిత్రం. ఇందులో పూర్వజన్మల అనుబంధం ఎంత ఘాటుగా ఉంటుందో తెలియజెప్పే ప్రయత్నం జరిగింది. చావుపుట్టక అనేది శరీరానికే గానీ ఆత్మకు కావన్న నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని అల్లిన కథకు దృశ్యరూపమే మూగమనసులు.

   గోదావరిమీద ఓ పడవపై ఓ పడుచుపిల్ల హుషారుగా పాడుతుంటుంది.  బ్లాక్ అండ్ వైట్ లో కూడా గోదావరి అందాలను కెమేరాలో చక్కగా బంధించారు పి.ఎల్ రాయ్. లాంగ్ షాట్ లో   రాగాలాపన పూర్తికాగానే జమున పాదాలపై కెమెరా ఫోకస్ చేస్తూ  పాటచిత్రీకరణ కొనసాగిస్తారు. ఘళ్లు ఘళ్లున మ్రోగే పాతతరం గజ్జలను వేసుకున్న గౌరి తన పాదాలను చెట్టుమానుకు మోటిస్తూ, వాటిని సుతారంగా ఆడిస్తూ ఉండగా షాట్ ఓకే అనేశారు దర్శకుడు.

  ఇక అక్కడి నుంచి జమున ఈ పాటలో ఎంతో చలాకీగా నటించింది.  అమాయకత్వం ఒకవైపు, చలాకీ తనం మరోవైపు, తన వ్యక్తిత్వం తెలిపే గడుసుతనం మరోవైపు….వెరసి గోదావరి పరవళ్లులా సాగుతుంది జమున నటన.  దాశరధి రచనకు కెవీ మహాదేవన్ గారు చిరకాలం గుర్తుండిపోయే ట్యూన్ కట్టారు. సుశీల చాలా చలాకీగా పాడి పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా చూశారు.

పాట ఇది…

గోదారి గట్టుంది ,గట్టుమీద  సెట్టుంది

సెట్టు కొమ్మన పిట్టుంది ,పిట్ట మనసులొ ఏముంది

ఓ ఓ ఓ ఓ హోయ్

గోదారి గట్టుంది ,గట్టుమీద  సెట్టుంది

సెట్టు కొమ్మన పిట్టుంది ,పిట్ట మనసులొ ఏముంది

ఓ ఓ ఓ ఓ హోయ్

వగరు వగరుగ పొగరుంది, పొగరుకు తగ్గ బిగువుంది

వగరు వగరుగ పొగరుంది,పొగరుకు తగ్గ బిగువుంది

తీయ తీయగ సొగసుంది,సొగసుని మించె మంచుంది

తీయ తీయగ సొగసుంది,సొగసుని మించె మంచుంది ఈ ఈ

గోదారి గట్టుంది ,గట్టుమీన సెట్టుంది

సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ హోయ్

ఎన్నెల వుంది, ఎండ వుంది,పూవు వుంది, ముల్లుంది

ఎన్నెల వుంది, ఎండ వుంది,పూవు వుంది, ముల్లుంది

ఏది ఎవ్వరికి ఇవ్వాలో ,ఇడమరిసే ఆ ఇది వుంది

గోదారి గట్టుంది ,గట్టుమీద  సెట్టుంది

సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ హోయ్

పిట్ట మనసు పిసరంతైనా,పెపంచమంతా దాగుంది

పిట్ట మనసు పిసరంతైనా,పెపంచమంతా దాగుంది

అంతు దొరకని నిండు గుండెలో ,ఎంత తోడితే అంతుంది

అంతు దొరకని నిండు గుండెలో ,ఎంత తోడితే అంతుంది ఈ ఈ ఈ

గోదారి గట్టుంది ,గట్టుమీద  సెట్టుంది

సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులొ ఏముంది 

   గోదావరి గురించి చెప్పుకున్నప్పుడల్లా చటక్కున మదిలో మెదిలే పాట ఇది. ఈ సినిమాకూ గోదావరికీ ఎనలేని అనుబంధంఉంది. చిత్ర నిర్మాణంలో ఎక్కువ భాగం గోదావరి నది ఒడ్డునే చిత్రీకరణ చేశారు.  జమున గురించి మనమిక్కడ చెప్పుకుంటున్నాం కాబట్టి ఓ సంఘటన చెప్పుకోవాలి. ముక్కుమీద కోపం , నీ ముఖానికే అందం – అన్న పాట చిత్రీకరణ జరుగుతున్నప్పుడు జమున కాలికి గాయం అయింది. దర్శకులు విశ్రాంతి తీసుకోమన్నా , వద్దని కాలి కట్టుతోనే బాధను లెక్కచేయకుండా ఆ పాటను పూర్తి చేశారు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!