అశ్వత్థామ కావించిన మారణహోమం .. సౌప్తికపర్వం (నిద్రాపర్వం)! .


అశ్వత్థామ కావించిన మారణహోమం .. సౌప్తికపర్వం (నిద్రాపర్వం)!

.

ఏ మానవునకైనను మితిమీరిన ఆవేశము మంచిది కాదు. ఆవేశము వివేకమును చంపుటేగాక నీచతకు పాల్పడజేయును. అందునూ, క్రోధస్వభావుని ఆవేశము మహాక్రూరము
అశ్వత్థామ ద్రోణాచార్యుని ఏకైక ప్రియపుత్రుడు. తన తండ్రి విద్యాధనము అన్యుల కంటే తనకెక్కువ చెందవలెనని ఆశించుటే గాని, యోగ్యతవిషయ మాతని యోచనకు రాదు. గురు పుత్రుడనను అహంకారమే అతని ఆధిక్యభావనకు ప్రబలహేతువు.
అయోగ్యుడని తెలిసియు పుత్రప్రేమకు వశుడై ఆచార్యుడు అశ్వత్థామకు బ్రహ్మాస్త్రప్రయోగము బోధించాడు. ఉపసంహారము బోధించలేదు. దాని ప్రయోగము ఎట్టి పరిస్థితులలోనూ మానవులపై జరగకూడదన్నాడు.
అయోగ్యుని విద్య అహంకారము పెంచును. ఆవేశపూరితుడు, క్రోధస్వభావుడు, అసహనపరుడైన అశ్వత్థామ అహంకారమును బ్రహ్మాస్త్రము పెంచినది. అతడొకనాడు ద్వారక కేగి శ్రీకృష్ణుని చక్రాయుధ మిమ్మన్నాడు. చక్రాయుధ మెందుకని శ్రీకృష్ణుడు అడుగగా, నీతో యుద్ధము చేసి నిన్ను గెలిచితినన్న కీర్తి గడించుటకన్నాడు. ఆశ్చర్యచకితుడై చిరునవ్వుతో శ్రీకృష్ణుడు చక్రాయుధమును చూపి తీసికొమ్మన్నాడు. అశ్వత్థామ దాని నెత్తలేక- ఈ చక్రంబు నీక ధరియింపం దగియుండు గాన నా కిది లేకున్న నేమి యగు? నెట్లును నీ తోడ సంగరంబు సేయంగలవాడ- నని పొగరుగా పలికి వెళ్లినాడు. అశ్వత్థా
ఇంత దారుణానికి ఈయన ఎందుకు ఒడిగట్టాల్సి వచ్చిందో తెలుసుకుందాం..
అశ్వత్థామకు పాంచాలురన్న గిట్టదు. కారణం, తండ్రి దారుణావమానానికి గురి కావటమే. దానికి తోడు ధృష్టద్యుమ్నుడు తండ్రి గొంతు కోసినాడు. అది చూచిన అశ్వత్థామ కడుపు తరుగుకొనిపోయి, దుర్యోధనునితో నా బాహుబలం, దివ్యాస్త్రాలు ఎందుకు? కాల్చటానికా? అన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. మహానుభావుడైన మా తండ్రి ఏ దిక్కూ లేక యుద్ధంలో శత్రువు చేతిలో దీనంగా మృతి చెందాడు. తలచుకుంటే నన్ను గూర్చి నాకే ఏహ్యభావం గలుగుతున్నది. దీనికంతటికి కారణం ఆ ధర్మరాజే. కపటంతో సత్యభ్రాంతిని కలుగజేసి నా తండ్రిని హత్యగావించాడు.
అస్త్రగురుడైన మా తండ్రి, ద్రోణాచార్యుడు నన్ను కన్నది శత్రువు చేతిలో తాను ఏ దిక్కూ లేక నరికివేయబడి మరణించటానికి అన్నట్లయింది. ఇక చెప్పటానికి ఏముంది? అని తండ్రి దుర్గతి దలచి వాపోయాడు. వెంటనే ఆగ్రహావేశపరవశుడై ఇలా ప్రతిజ్ఞ చేశాడు.
నా ఈ బాహుబలపరాక్రమాలతో దివ్యాస్త్రప్రయోగంతో తల్లడిల్లి మిక్కిలి బాధతో ఆ శ్రీకృష్ణుడు, పాండవులు రణరంగంలో తట్టుకోలేక తొలగిపోయేటట్లు చేస్తాను. మా తండ్రి నారాయణుడిని ఉపాసించి పొందిన దివ్యాస్త్రం నాకిచ్చాడు. ఆ దివ్యాస్త్రం వీరు వధ్యులు, వీరు అవధ్యులు అనే భేదం లేక శత్రునిర్మూలనం క్షణంలో చేసి వేస్తుందని పాండవబలంపై ప్రయోగించాడు. శ్రీకృష్ణుని నేర్పుచే అది వృథా కాగా, ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుని మీద వదిలినాడు. అది బ్రహ్మాస్త్రముచే అణచివేయబడగా అశ్వత్థామ అవమానంతో క్రుంగి విల్లు పారవైచి, రథము దిగి యుద్ధభూమి నుండి తొలగినాడు.
తొడలు విరిగి నేలబడి నెత్తుటి బురదలో పొరలుచున్న సుయోధనుని దుఃస్థితి చూచినప్పుడు, అశ్వత్థామ ఆవేశము మిన్ను ముట్టినది. తండ్రి దుర్మరణము, పాంచాలుర మీది పగ, ద్రుష్టద్యుమ్నుని సంహరింపలేదన్న కసి, అన్నింటిని మించి సుయోధనుని దుఃస్థితి అశ్వత్థామ క్రోధమును లెస్సగ రెచ్చగొట్టినది.
వెంటనే ఓ దుర్యోధన సార్వభౌమా, నేను నిజం చెప్తున్నాను వినుము. విజృంభించి పాంచాలురు మొదలుగా ఉన్నట్టి బంధుమిత్ర సమూహమును శ్రీకృష్ణుడు చూస్తుండగా ఇదిగో నేడు హతమారుస్తానన్నాడు.
దీనికి సంతోషించిన సుయోధనుని ఆజ్ఞపై, కృపాచార్యుడు, గంగాజలంతో అశ్వత్థామను సేనాధిపతిగా అభిషేకం చేశాడు.
అశ్వత్థామ చేసినది శక్తికి మించిన ప్రతిజ్ఞ. కార్యసాధనకు తనకు తోడున్న వీరులు ఇరువురే- కృతవర్మ, కృపాచార్యుడు.
దానిని సాధించుటకు వ్యవధి కూడా లేదు. కౌరవేశ్వరుడా కొన ఊపిరితో ఉన్నాడు. ఆయన కన్ను మూయకముందే విజయవార్త ఆయన చెవిలో వేయవలెను. అప్పుడు గాని అతని ప్రతిజ్ఞకు, పరిశ్రమకు సార్థకత లభించదు. జీవితములో ఇట్టి పరిస్థితులే వ్యక్తి శీలమునకు అగ్నిపరీక్షలు. పెక్కుమంది ఇట్టి పరిష్టితిలో మోసము వైపు మొగ్గుదురు. అడ్డత్రోవలు తొక్కుదురు. మానవస్వభావ మట్టిది.
ఆ రాత్రి అశ్వత్థామకు నిద్ర పట్టలేదు. అతనిది తీరని ఆవేదన, తరుగని ఆవేశము. దిక్కు తెలియని ఆందోళన. ఇంతలో గుడ్లగూబ నిద్రపోవు కాకముల గొంతు కొరికి సద్దు లేకుండ చంపి తిను దృశ్యమాతనికి కంటబడినది. ఆ గుడ్లగూబ తన కొక మహోపదేశమిచ్చినట్లు భావించినాడు.
పాండవులను నేడు చంపక, తరువాత ఎప్పుడో చంపితే ఈ లోగా దుర్యోధనుడు కన్ను మూస్తే నేను చేసిన పనిని ఎవరు మెచ్చుకొంటారు? ధర్మయుద్ధంలో ఆ మహావీరులను చంపటం అశక్యం. శత్రువులను చంపేటప్పుడు అధర్మం అనకుండా లభించిన ఉపాయంతో ఉత్సహించాలనటం శాస్త్రసమ్మతమే కదా?
దండెత్తినప్పుడూ, విడిది చేసినప్పుడూ, ఇరుకైన దారిలోను, గతి లేక తిరుగబడినప్పుడూ, నిద్రించేటప్పుడూ శత్రువులను క్రూరంగా మీదపడి చంపాలి. ఏ పద్ధతి అనుసరించి అయినా శత్రువులను చంపవచ్చును- అనే నీతివాక్యాలు విన్నాను. క్షత్రియధర్మం అవలంబించిన వాడికి ఇట్లాంటి పనులు చేయదగినవి. అదీ కాక పాండవులు తాత అయిన భీష్ముడిని (శిఖండిని ముందుగా పెట్టుకుని), గురువైన తన తండ్రిని (అస్త్రత్యాగం చేసినవాడిని) చంపేటప్పుడు, న్యాయమార్గంలో యుద్ధం చేయలేదు. కాబట్టి దుష్టమైన ఉపాయాలు గల పాండవులను నిద్రించేటప్పుడు ఆకస్మికంగా చంపటం నీతే గాని నిందించదగింది కాదని నిర్ణయించుకొన్నాడు.
బలమూ, ఉపాయము తెలిసిన యోధానుయోధులు 18 రోజులు సుయోధనుని పక్షాన ధార్మికంగా పోరాడి కూడా అతనికి విజయం చేకూర్చలేకపోయారని వాపోయాడు. అశ్వత్థామ క్రూరపుపూనికను కృపాచార్యుని నీతివాక్యములు మరల్చలేకపోయినవి. చివరి యత్నంగా నిద్ర చావు వంటిదని, శవాల వలె పడి ఉన్నవాళ్లను చంపి, పాపం మూటకట్టుకుని నరకంలో పడటం మంచిది కాదని చాలాదూరం చెప్పిచూచాడు మామ కృపాచార్యుడు.
నా తండ్రిని చంపి సంతోషించే ద్రుష్టద్యుమ్నుడూ మొదలైన ఆ దురాత్ములను అధర్మమార్గంలోనే (పాపాత్ములు కావున పాపంబు తెరవున) చంపుతాను. దానివలన నాకు పురుగు పుట్టువు కలిగినా మంచిదే అంటూ కృతవర్మ, కృపాచార్యులను బలవంతంగా వెంటకొని నిద్రావివశంబైన పాండవ శిబిరంబునకు వెళ్లాడు.
అశ్వత్థామ స్థిరసంకల్పాన్ని పరీక్షించటానికి ఒక భయంకర భూతరూపంలో అతడి మార్గాన్ని ఈశ్వరుడు నిరోధించాడు. అశ్వత్థామ ఆ పెనుభూతంపై ప్రయోగించిన బాణాలన్నీ వ్యర్థమయ్యాయి. చివరకు తీవ్రస్వభావుడై ఆ అశ్వత్థామ ఆత్మోపహారానికి సంసిద్ధుడు కాగా, శివుడు ప్రత్యక్షమై అతడికొక మహనీయమైన ఖడ్గాన్ని ప్రసాదించాడు. అశ్వత్థామ సంతోషించి అప్రతిహతమైన ఆ ఖడ్గం సహాయంతో పాండవసంహారానికి ఉద్యమించాడు. ఆ స్కంధావారం గుట్టూ మట్టూ అంతకుముందే తెలిసికొన్న వాడవటం చేత, ముందుగా తన తండ్రిని చంపిన ద్రుష్టద్యుమ్నుడి శిబిరం ప్రవేశించి నిద్రిస్తున్నవాడిని తన్ని లేపి, మదగజాన్ని చంపేసింహాన్ని పోలుతూ విజృంభించి, కాలితోనూ, చేతితోనూ చితుకగొట్టి, వింటి అల్లెత్రాడు అతడి కంఠానికి బిగించి ఉరిపోసి చంపాడు. పిశాచోన్మత్తుడైన ఆ వీరుడు క్రమంగా పాంచాలురను అందరినీ, ద్రౌపదేయులనూ, అసంఖ్యాక యోధులను నిద్రపోతుండగా నిర్దయుడై వధించాడు. మేలుకొని పారిపోవటానికి ప్రయత్నించే అభాగ్యులను, శిబిరద్వారం దగ్గర ఉన్న కృపాచార్యకృతవర్మలు అడ్డగించి చంపివేశారు. అతడి రాక్షసావేశానికి, నీచపరాక్రమానికి విచారిస్తూ వారు తలలు వంచుకుని ఊరకున్నారు. పాండవులైదుగురూ, కృష్ణసాత్యకులు మాత్రం ఆ శిబిరంలో కనబడనందుకు అశ్వత్థామ విచారించాడు.
తరువాత ఆ ముగ్గురు యోధులూ, తాము జరిపిన సంహారవృత్తాంతాన్ని వినిపించటానికి దుర్యోధనుడి వద్దకు పరుగెత్తారు. అతడు చనిపోవటానికి సిద్ధంగా ఉండి తీవ్రవేదన పొందుతూ క్షణాలు లెక్కిస్తున్నాడు. అతడి దీనస్థితి చూచి వాళ్లు చాలా బాధపడ్డారు. అశ్వత్థామ, దుర్యోధనుడికి ఎంతో కీర్తి సంపాదించి పెట్టిన అతడి గదాకౌశల్యాన్ని ప్రశంసించి, నీ కొరకు బాధ పడకుము. నీవు పుణ్యలోకానికి పోయినప్పుడు నా తండ్రి అయిన ద్రోణుడిని చూచి, ద్రోహి అయిన ద్రుష్టద్యుమ్నుడిని నీ కొడుకు అశ్వత్థామ చంపాడని చెప్పుము అని విన్నవించాడు. ఉపపాండవ, పాంచాలాదుల మరణం విని దుర్యోధనుడు సంతోషించి, భీష్మద్రోణులు కాని, కర్ణశల్యులు కాని, మీవలె మేలు చేయలేదు. సుఖంగా ఉండండి, మనకు పునర్దర్శనం స్వర్గలోకంలో అవుతుంది, వెళ్లండి అని పలికి ప్రాణం విడిచాడు. రథికులు ముగ్గురూ దుఃఖంతో అతడికి ప్రదక్షిణం చేసి, తిరిగి చూస్తూ, రథారూఢులై వెళ్లిపోయారు.
మర్నాడు సూర్యోదయసమయంతో ధర్మరాజాదులకు విషయం తెలియగా విలపించి మూరి్ఛల్లారు. ధర్మరాజు నకులుడిని పాంచాలదేశానికి పంపి ద్రౌపదికి వార్త చేరవేశాడు. ఆత్మపుత్ర వినాశనానికి ద్రౌపది తీవ్రదుఃఖితురాలైంది. క్షత్రియ కాంత సంతానం యుద్ధంలో వీరమరణం పొందుట సముచితమే కదా అని ధర్మరాజు ఆమెను ఊరడించాడు. అశ్వత్థామకు సహజమైన శిరోరత్నాన్ని తెచ్చి చూపితే తప్ప జీవించనని ద్రౌపది చెప్పింది. వెంటనే భీముడు, నకులసహాయుడై అశ్వత్థామను అన్వేషింప బయలుదేరాడు. క్రూరుడైన అశ్వత్థామ వద్ద బ్రహ్మశిరోనామకాస్త్రం ఉందని చెప్పగా, శ్రీకృష్ణార్జున సహితుడై ధర్మరాజు, అశ్వత్థామను వ్యాసుడి ఆశ్రమ సమీపాన తపస్సు చేస్తుండగా పట్టుకొన్నాడు. పాండవవీరులను చూచి అశ్వత్థామ భయక్రోధాదులతో బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఒక గడ్డిపరక యందు ఆవహింపజేసి ప్రయోగించాడు. అది భయంకరజ్వాలలతో పాండవులను ఆక్రమింపబోయింది. అర్జునుడు కూడ శ్రీకృష్ణ ప్రేరితుడై ఆత్మరక్షణ కొరకు అదే అస్త్రాన్ని ప్రయోగించాడు. నారదవేదవ్యాసులు ఆ మహాస్త్రాల చేత లోకసంక్షోభం కాకుండా, ఎవరి అస్త్రాన్ని వారు ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. సత్త్వస్వభావుడు, గురుభక్తి తత్పరుడైన అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకొన్నాడు. కాని, తామసప్రవృత్తి గల అశ్వత్థామ అట్లా చేయలేకపోయాడు. తన అస్త్రం పాండవేయగర్భాలకు హాని కలిగించి ఉపశమిస్తుందని చెప్పాడు. ఉత్తరాగర్భాన్ని మాత్రం శ్రీకృష్ణుడు రక్షించాడు. ఆమెకు పుట్టే కుమారునకు సుదీర్ఘమైన ఆయువు నిస్తానని మాటిచ్చాడు. శ్రీకృష్ణుడు, పిల్లలను చంపిన నీవు ఆహారం లేక, నిస్సహాయుడవై దుర్గంధ భూయిష్ఠమైన రక్తం చేత శరీరం దగ్ధమవుతూ ఉండగా 3000 సంవత్సరాలు తిరుగమని శపించాడు. దీనికి వ్యాసుడు ఆమోదం తెల్పాడు. వ్యాసునికి కూడా అశ్వత్థామ 'నీవు మనుష్యులలోనే ఉంటావని' ప్రతిశాపమిచ్చి తన శిరోమణిని పాండవులకిచ్చి తపోవనానికి వెళ్లాడు.గురుపుత్రుడవటం చేత, అర్జునుడు అశ్వత్థామను చంపటానికి పూనుకోక, అవమానించి, ఆయుధాలతో పాటు సిగ్గును కూడా విడిచి పెట్టేటట్లు చేశాడు. ధర్మరాజు శిరోమణిని గ్రహించి ద్రౌపదికివ్వగా ఆమె తిరిగి ధర్మరాజునకే ఇచ్చింది. శిరోమణిని పోగొట్టుకొనటం చేత అశ్వత్థామ కీర్తి, శరీరం పతనం చెంది, కలుషితమైనవి. ధర్మరాజు ప్రకాశిస్తూ ఉన్న ఆ మణిని అందం అతిశయించగా శిరస్సుపై ధరించి, ఉదయకాలపు ఎరుపుతో అధికంగా ప్రకాశించే చంద్రబింబంతో ఒప్పే తూర్పు కొండవలె ప్రకాశించాడు.
యుద్ధషట్కము లోని సౌప్తిక (నిద్రా) పర్వానికి సైన్యాధ్యక్షుడుగా అభిషిక్తుడైన అశ్వత్థామ సాధించిన విజయం సుయోధనుని పట్ల కృతజ్ఞతాభావంగా గోచరిస్తుంది.
"కుడువగ, గట్ట బంధులకు కోటివిధంబుల బెట్ట జన్నము
ల్నడప, ననేక ధర్మ విధులం బొగ డొందగ జాలునట్టి యె
క్కుడు సిరి యిచ్చి పేర్మినొక కొండగ మన్చిన నీవుసావగా
నొడలిటు లోమితిం గురుకులోత్తమ యేనొక సేవకుండనే ?"
తినటానికీ, కట్టుకొనటానికీ, బంధువులకు అనేక విధాల పెట్టటానికీ, యజ్ఞాలు చేయటానికీ, పెక్కు ధర్మకార్యాలలో పేరు గాంచటానికీ సరిపడేటంత అధికమైన సంపదనిచ్చి ప్రేమతో ఒక కొండవలె నన్ను సాకిన నీవు చచ్చిపోతూ ఉంటే నేనెట్లా బ్రతికి ఉన్నాను? కురువంశ శ్రేషా్ఠ! నేనూ ఒక సేవకుడనేనా? అంటూ అశ్వత్థామ వాపోతాడు.
పక్క ఇంటి పగవానిని ప్రత్యక్షముగ ఎదిరించలేక అతడింట లేనప్పుడు రాత్రివేళ అతని కొంపకో లేక పంటకుప్పకో నిప్పంటించి లేదా అతని పండ్ల పూలతోటలనో చాటుమాటుగా ధ్వంసం చేసి నీచపరాక్రమమును, రాక్షసావేశమును ప్రదర్శించిన అశ్వత్థామలను ఎందరినో లోకమున నేడు చూస్తున్నాము- అను అప్పజోడు వేంకటసుబ్బయ్య గారి వాక్కు అక్షరసత్యం!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!