"అల్లసాని వాని అల్లిక జిగిబిగి" ! .

"అల్లసాని వాని అల్లిక జిగిబిగి" !

.

"అల్లసాని వాని అల్లిక జిగిబిగి" పేరు గాంచింది. అల్లిక అంటే పద్యమల్లటమే. జిగి అంటే తళుకు. బిగి అంటే బిగువు. మృధుమధురమైన పదప్రయోగం, వ్యర్థ పదాలు లేని దృఢమైన పదబంధం - ఇదే అల్లిక జిగిబిగి.

ఉలుకు పలుకు లేని రాతి ప్రతిమల రమణీమణుల ప్రబంధ నాయికా ప్రపంచంలో మాట పాట నేర్చిన వలపుల వయ్యారి వరూధిని. అవయవాలే తప్ప ఆత్మలు లేని కావ్య నాయికా లోకంలో ఇష్టాలు, కోరికలు, కోపాలు, తాపాలు, ప్రణయాలు, విహారాల అనుభూతులు విరబూసిన విరి మంజరి సజీవ సుందరి వరూధిని. ఆమె ప్రవహించే ఒక యౌవన ఝరి, దహించే ఒక ప్రణయ జ్వాల, మిరుమిట్లు కొలిపే ఒక సౌందర్య హేల, ఒక విరహ రాగం, ఒక వంచిత గీతం, ఒక విషాద గానం. ఆంధ్ర కవితా పితా మహుడు అల్లసాని అంతరంగంలో వికసించిన ఒక అపురూప భావనా మల్లిక.

తెలుగు పంచ మహా కావ్యాలలో ప్రథమ ప్రబంధం మను చరిత్ర. మార్కండ ేయ పురాణంలోని ఒక చిన్న కథను తీసికొని తన అద్భుత కవితా ప్రావీణ్యంతో ఒక రసవత్కావ్యం సృష్టించి తెలుగు కవిత్వ ప్రేమికులకు వెల లేని మధురాతి మధురమైన కానుకనిచ్చాడు పెద్దన. ఒక వరణా తరంగిణిని, ఒక అరుణాస్పద పురాన్ని, ఒక ప్రవరుని ఒక వరూధినిని, ఒక స్వరోచిని, ఒక మనోరమను సృష్టించి పాఠకుల హృదయాలలో ఒక అలౌకిక దివ్య ప్రపంచాన్ని ఆవిష్కరించాడు.

‘అట చని కాంచి’నదేమిటి?

పెద్దన హిమాలయాలను చూడనేలేదు. అల్లసాని పెద్దన కోకటం లేదా పెద్దనపాడు గ్రామాలకు చెందినవాడు. అందువల్ల సమీపంలోని ఇడుపులపాయ, గండి ప్రాంతాల్లోని కొండల్ని, లోయల్ని చూసి హిమాలయాలు ఇంతకన్నా పెద్దగా ఎత్తుగా ఉంటాయని ఊహించి వ్రాశాడు. పద్యంలో వర్ణించిన సెలయేర్లు, నెమళ్ళు వంటివన్నీ వర్షాకాలంలో ఇక్కడ అత్యంత సహజమైన విషయాలు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో నెమళ్ళు, ఏనుగులు చాలా ఎక్కువ. ఆ తర్వాతి పద్యాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తాయి.

వెయ్యేండ్ల తెలుగు సాహిత్య చరిత్రలో ఒకే కవి వ్రాసిన నాలుగు వరుస పద్యాలు చెప్పమంటే చాలా తటపటాయించాల్సిందే! తిక్కన, శ్రీనాథుడు వంటి మహాకవుల గొప్ప పద్యాలు కూడా అలా వరుసగా లేవు. ఒక్క నన్నయ్యకు మాత్రమే ఆ గౌరవం దక్కుతుంది. నన్నయ్య వ్రాసిన ఆంధ్ర మహాభారతం ఆదిపర్వంలోని ఉదంకోపాఖ్యానంలోని నాలుగు నాగస్తుతి పద్యాలు శబ్దార్థ సంధానంలో అపురూపమైనవి. ఉదంకుడు నాగరాజులైన అనంతుడు, వాసుకి, ఐరావతులు, తక్షకుడులను నలుగురిని నాలుగు పద్యాల్లో స్తుతించే సందర్భం! నిజాయితీగా చెప్పాలంటే నాగజాతి ప్రముఖులను స్తుతించే ఈ విధానం ‘నాగప్ప నాగన్న నాగరాజా... మా కష్టమంత బాపు తండ్రి నాగరాజా...!’ అనే జానపదుని హృదయ స్పందనే! అయితే నన్నయ్య నడిపిన చంపకోత్పల వృత్తాలు సాహిత్యంలో ఒక ఒరవడిని సృష్టించాయి.

ఏ సహృదయుణ్ణి అయినా రసప్లావితుణ్ణి చేస్తాయి. ‘సర సర’ మనే సర్పాల చలనాన్ని, ‘బుస్సు బుస్సు’మనే శబ్దాల్ని అవే శబ్దాలతో అర్థాన్ని కూడా సాధించి పాముల పద్యాల్ని వ్రాయడం నన్నయ్య పద్యశిల్పంలోని ప్రత్యేకత. ఊష్మాక్షరాలైన శ, ష, స, హలతో ఖ్ఛిఝజీ గౌఠ్ఛీజూట ఖ్ఛిఝజీ ఇౌట్ఛౌ్టట అయిన అంతస్థాలతో (య ర ల వ) నాలుగు పద్యాలూ బుస్సు బుస్సుమని నాలుగు పాములై కొన తోక మీద నిలబెడతాయి. శబ్దార్థాలు ఆది దంపతులవంటివన్న కాళిదాసు మాటను సార్థకం చేశాయి (వాగర్థావివ... రఘువంశం మొదటి శ్లోకం). అసాధారణమైన ఈ ధారణ ఎంతో ప్రయత్నించినప్పటికీ తమకు సాధ్యం కాలేదని చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి చెప్పారు. నన్నయ్యలోని నిసర్గ ప్రతిభకు నమస్కరించారు. ఎందుకంటే శబ్దాలంకార రచన అక్షర రమ్యత కాదు కదా!

నన్నయ్య తరువాత దాదాపు నాలుగు వందల సంవత్సరాలకు పోతన ఈ శబ్దార్థ సమన్వయాన్ని అందుకున్నాడు. ‘మందార మకరంద మాధుర్యా’న్ని తెలుగుజాతికి అందించారు. పోతన తర్వాత 16వ శతాబ్దంలో అల్లసాని పెద్దన్న ఈ శబ్దార్థ సమన్వయాన్ని సాధించాడు. ఈగొప్ప శైలీ సృజనే అతన్ని ఆంధ్రకవితా పితామహుణ్ణి చేసింది.

మను చరిత్ర కావ్య ప్రపంచంలో అడుగు పెట్టిన వారందరికీ- సిద్ధుని రాక, ప్రవరునికి పాద లేపం ఇవ్వడం, ఆ లేపన ప్రభావంతో ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళడం, మధ్యాహ్నం కావడం, పాద లేపనం కరిగిపోవడం, అతిలోక లావణ్యవతి వరూధినిని చూడడం, వరూధినీ ప్రవరుల సంవాదం, వరూధిని మనసు విప్పి తన కోర్కెను వెల్లడించడం, ప్రవరుడు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించడం, అగ్ని దేవుని ప్రార్ధించి అతడు తన నగరానికి వెళ్ళిపోవడం, మాయా ప్రవరుడు మాయ మాటలతో మరూధినిని నమ్మించి ఆమెతో సంగమించడం, స్వరోచి జననం- ఈ ఘట్టాలన్నీ పాఠక హృదయాలపై గాడమైన ముద్ర వేస్తాయి. మానవుల్లోని ప్రవృత్తి మార్గానికీ, నివృత్తి మార్గానికీ మధ్య పోరాటమే మను చరిత్ర కథా వస్తువు. భోగలాలసతకు, ఇంద్రియ నిగ్రహానికీ జరిగిన సంగ్రామమే ఈ ఇతివృత్తం.

సమర్ధుడైన రాయల పాలనలో సకాలంలో కురిసే వర్షాలతో, కరవు కాటకాలు లేక, చీకు చింత లేక సుఖమయ జీవితాన్ని గడిపారు ఆ నాటి ప్రజలు. ఆనాడు వీధుల్లో రత్నాలు రాశులుగా పోసి అమ్మారంటే ప్రజలెంత సంపన్నులో అర్ధం చేసుకోవచ్చు. ప్రజలు భోగ లాలసులై తృతీయ పురుషార్ధ సాధననే జీవన పరమార్ధమని భావించారు. అలాటి ప్రజలకు ధర్మకార్య నిర్వహణలోని గొప్పతనాన్ని, నియమబద్ధ జీవితంలోని ప్రశాంతతను, ఇంద్రియ నిగ్రహంలోని ధార్మికతను, మానవ జీవన తాత్త్వికతను వివరించి చెప్పడమే పెద్దన కవితా రహస్యం.

పెద్దన పండితుడు, కవితా మర్మజ్ఞుడు, ధర్మ కర్మ దీక్షా పరతంత్రుడు. వీటన్నిం టినీ మించిన రసికుడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు పెద్దనను ఒక కావ్యం రాయమని అడిగినపుడు- కావ్యం రాయాలంటే రమణీయ స్థలం, తన మనసులో ఊహ తెలుసుకోగలిగే లేఖక పాఠకులు, ఉయ్యాల మంచం, నచ్చిన భోజనం- వీటితో బాటు పరిమళించే కర్పూర తాంబూలమం దించే అందమైన అమ్మాయి కావాలని చెప్పిన రసిక హృదయుడు పెద్దన.

మామూలుగా ప్రబంధాలలో అష్ఠాదశ వర్ణనలుంటాయి. నాయికా నాయకుల వర్ణన, నగర వర్ణన, ఋతు వర్ణన, వేట వర్ణన, చంద్ర వర్ణణ- ఇలా ఎన్నో వర్ణనలుంటాయి. ఈ వర్ణనల మధ్య చక్కని కథా కథన చాతుర్యంతో ప్రాణం తొణికిసలాడే పాత్రల హృదయాంతర్గత అనుభూతులను పనస తొనలు ఒలిచి పెట్టినట్టు పాఠకుల అరచేతుల్లో అందంగా అమర్చి పెట్టాడు పెద్దన.ప్రబంధాల్లో గానీ, పురాణేతిహాసాల్లో గానీ, వాస్తవ ప్రపంచంలో గానీ ఇష్టానై్ననా, ప్రేమనైనా, స్నేహానై్ననా, మోహానై్ననా, ఏ భావానై్ననా ముందుగా ప్రకటించేది పురుషులే. పురుషాధిక్య ప్రపంచంలో స్ర్తీల కెప్పుడు స్వీయాభిరుచులు, అభిప్రాయాలు ఉండవు. ప్రేమలోనైనా, పెళ్ళిలోనైనా మగవారి భావాలకే ప్రాధాన్యం, ఎక్కడో రాజుల్లో, స్వయంవరాల్లో తప్ప.

అక్కడైనా పరాక్రమమో, సాహసమో ఏదో ఒకటి శుల్కంగా నిర్ణయించడం జరుగుతుంది. ఎక్కడో రుక్మిణి వంటి వారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు- తాము వరించిన వారిని చేపట్టిన భాగ్యశాలురను.

అందుకే ఏ ప్రబంధంలోనైనా నాయికలకు కాళ్ళు, చేతులు ఉంటాయి గానీ తన ఇష్టాలను చెప్పే నోరుండదు. కను విందు చేసే అవయవాలుంటాయి గానీ కనిపించని మనసుండదు. అందుకే ప్రబంధ పాత్రలన్నీ చలనం లేని కొయ్య బొమ్మలు, ప్రాణం లేని మట్టి ముద్దలు. కానీ మూస పోసిన ప్రబంధాలకు విరుద్ధంగా పెద్దన మను చరిత్రలో పాత్రలకు రంగు, రూపం, జీవం, జవం, భావం, రాగం అద్ది తన కలం కుంచెతో ఎప్పటికీ వెలిసి పోని చిత్రాలుగా ప్రాణం పోశాడు.

మను చరిత్ర ప్రబంధ నాయకుడు ధర్మకర్మ దీక్షా పరతంత్రుడైతే, నాయిక పల్లవించే ప్రణయ రాగ రాగిణి. ఆధునిక కాలంలో తొలి చూపులోనే ప్రేమ పరిమళించినట్టు అలేఖ్య తనూ విలాసుడు, మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి ప్రవరుని సమ్మోహన రూపాన్ని చూసిన వెంటనే వరూధిని మనసు పారేసుకుంటుంది.

తీర్థయాత్రా ప్రేమికుడైన ప్రవరుడు పాదలేపనం మహిమతో హిమాలయాలకు వెళ్ళడం మను చరిత్రలో కీలక ఘట్టం. అతడెంత నిష్టాగరిష్ఠుడైనప్పటికీ వెండి కొండల సౌందర్య వైభవానికి పరవశించి జగము మరచి తనువు మరచి పోవడమే కావ్యంలో రసవద్ఘట్టం.

పాదలేపనం కరగి పోవడంతో అతడు తన ఊరికి వెళ్ళలేక పోతాడు. ఆ ప్రాంతాల్లో ఎవరైనా కనబడతారేమోనని, తన ఊరికి దారి చెబుతారేమోనని అటు, ఇటు తిరుగుతుంటాడు. అలా తిరుగుతున్న ప్రవరుణ్ణి చూడగానే అతని అందానికి వరూధిని కళ్ళు పెద్దవవుతాయి ఆశ్చర్యంతో. ఆమెను చూసిన ప్రవరుడు- ఓ భీత హరితేక్షణ! నీవెవరివి? ఈ వన భూముల్లో ఒక్క దానివే విహరిస్తున్నావు. నన్ను ప్రవరుడంటారు. ఈ పర్వతానికి వచ్చి దారి తప్పాను. మా ఊరికి దారి చెప్పు- నీకు పుణ్యం ఉంటుందని అడుగుతాడు. అప్పుడు వరూధిని- ఇంతింత పెద్ద పెద్ద కళ్ళున్నాయి గదా నీకు ‘మా ఊరికి దారేది?’ అని అడుగుతున్నావు. ఏకాంతంగా ఉన్న నాలాటి యువతులతో ఏదో విధంగా మాటలాడాలని కోరికే గానీ నీవొచ్చిన దారి నీకు తెలియదా? కొంచెం కూడా భయం లేకుండా అడగడానికి మేమింత చులకనయ్యామా?- అని డబాయిస్తుంది.

ఆ తర్వాత వరూధిని తన వంశ ప్రఖ్యాతిని గురించి చెబుతుంది. రంభ మొదలైనవాళ్ళంతా తన చెలికత్తెలని, వాళ్ళంతా ఎప్పుడూ హిమాలయ పరిసర ప్రాంతాల్లోనే విహరిస్తారని చెప్తూ, మిట్టమధ్యాహ్నం ఎండకు బంగారం లాంటి నీ శరీరం కందిపోయింది. మా ఇంటికి వచ్చి బడలిక తీరేంతవరకు విశ్రాంతి తీసుకొనమని బతిమాలుతుంది. అప్పుడు ప్రవరుడు ‘ఇక్కడ నేనుండడానికి వీలు పడదు. మధ్యాహ్నిక కార్యక్రమాలు తీర్చడానికి ఇంటికి వెళ్ళి తీరాలి. దయ చేసి మాయింటికి వెళ్ళే దారి చెప్పి ఉపకారం చేయమని అడుగుతాడు. ఎక్కడి మనిషివయ్యా నీవు? మాటి మాటికి ఇల్లో, ఇల్లో అని కలవరిస్తున్నావు. ఇక్కడున్న ఈ రత్నాల భవనాలు, చందన వనాలు, గంగానది ఇసుక తిన్నెలు, పొదరిళ్ళు అన్నీ మీ కుటీరాలకు సాటి రావా? అని అంటూ- ఆ మాటల్లో అంతరార్ధము గ్రహించలేని అమాయకుడని వ్యాచ్యంగా తన అభిప్రాయాన్ని సూటిగా చెబుతుంది.

‘నిక్కము దాపనేల ధరణీ సర నందన యింక నీపయిన్‌/ జిక్కె మనంబు నాకు నను జిత్తజు బారికి నప్పగించెదో/ చొక్కి మరంద మద్యముల చూఱల బాటల పాడు తేంట్ల సొం/ పెక్కిన యట్టి పూవు బొదరిండ్లను గౌగిట గారవించెదో’ అంటుంది. తెలుగు సాహిత్యంలో వందల కొద్దీ ప్రబంధాలున్నాయి. ఎందరో కవులు కసిదీరా తమ కావ్యనాయకల శరీరాలను వర్ణించారు. కానీ ఏ కవీ కూడా అమెకొక మనసుందని చెప్పలేదు. తన నాయిక నోట ‘మనసు’ అనే మూడక్షరాల పద ప్రయోగం చేసినవాడు పెద్దన ఒక్కడే. అలా తన కావ్యనాయిక చేత ‘మనసు’ అనే ముత్యమంత మాటను తొలిగా ప్రయోగించిన పెద్దన కవీంద్రులకు శతకోటి వందనాలు!

వరూధిని ఇలా తన అభిప్రాయాన్ని ఏ డొంకతిరుగుడు లేకుండా స్పష్టంగా చెప్పినా, నిశ్చల మనస్కుడైన ప్రవరుడు - తల్లీ! వ్రతులై రోజుల్ని గడిపే విప్రులను కామించవచ్చునా? నా తల్లిదండ్రులు వృద్ధులు. ఆకలికి ఆగలేరు. నా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. దేవ కాంతలు మీకు అసాధ్యాలు లేవు గదా! నేనిల్లు చేరే ఉపాయం చెప్పమంటాడు.‘ఓ ప్రవరుడా! ఓ మానవుడు తన జీవితంలో అనుభవించ దగిన సకల సామగ్రి ఇక్కడే ఉన్నాయి. భోగివై నన్ననుభవించు.

వెన్నలాగా కరగిపోయే స్ర్తీల పరిష్వంగం లో సుఖ పడే అదృష్టం ఎప్పుడు వస్తుంది’ అని ప్రలోభపెడుతుంది. అయినా ప్రవరుడు నిశ్చల మనస్కుడై ‘బ్రాహ్మణుడు ఇంద్రియ వశుడవకూడదు. అలా ఐతే బ్రహ్మానందాది రాజ్యంనుంచి భ్రష్ఠుడౌతాడు’ అని తన మాటమీదే నిలబడతాడు. అప్పుడు వరూధిని ‘చిమ్మీలో ఉన్న దీపంలా ఇంద్రియాలన్నీ ఏ విషయంలో సుఖ పారవశ్య స్థితి పొందుతాయో అదే బ్రహ్మానందమని విజ్ఞులు చెప్పలేదా’? అని ఆనందానికి తన నిర్వచనం చెప్తే, ప్రవరుడు ‘వ్రతులైన భూసురులను కామించవచ్చా! తక్షణం నేనింటికి వెళ్ళాలి’ అని అదే మాట మీద పట్టుదలగా నున్నప్పుడు- ‘నీ యవ్వనమంతా కర్మలు చేసినట్లైతే భోగాలనుభవించేదెప్పుడు? ఎన్ని క్రతువులు చేసినా మా పరిష్వంగ సుఖం అందుకోవడానికే గదా! గంధర్వాంగనల పొందు అందరికీ లభించదు. స శరీర స్వర్గ సుఖాలు కోరి వరిస్తుంటే వ్రతాలు చేసి ఇంద్రియాలను బాధ పెట్టడం న్యాయమా’? అని వాదిస్తుది.

‘నీవు చెప్పిన విషయం కాముకునికి వర్తిస్తుంది. బ్రహ్మ జ్ఞానికి కాదు. మాకు అరణులు, దర్భలు, అగ్ని- ఇవే ఇష్టం. ఈ తుచ్ఛ సుఖాలన్నీ మీసాల మీద తేనెలే’ అని తన నిరాసక్తతను వెల్లడిస్తాడు.

ఎన్ని రకాల మాటల ఆయుధాలను ప్రయోగించినా తాను ఓడిపోయే సరికి ఉక్రోషంతో వరూధిని ప్రవరుని పరిష్వంగించి ముద్దు పెట్టుకోబోగా ప్రవరుడామె భుజాలను పట్టి తోసేస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక రోషంతో ‘చేసితి జన్నముల్‌ తపము చేసితి నంటి దయా విహీనతన్‌/ జేసిన పుణ్యముల్‌ ఫలము సెందునె? పుణ్యము లెన్నియేనియున్‌/ జేసిన వాని పద్ధతియె చేకుఱు భూత దయార్ద్ర బుద్ధికో/ భూసుర వర్య యింత తల పొయవు నీ చదువేల చెప్పుమా’? అని బాధపడుతూ ఎన్నో మాటలంటుంది.

ఆ తర్వాత ప్రవరుడు అగ్ని దేవుణ్ణి ఆరాధించి వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. ఎన్ని విధాలుగా వాదించినా తన కోరిక నెరవేరలేదని ఆమె దుఃఖగీతిక అవుతుంది. అంతకు ముందు వరూధిని తిరస్కారానికి గురైన గంధర్వుడు ప్రవరుని వేషం ధరించి అక్కడే తిరుగుతుంటాడు. ఎప్పటినుంచో కోరుకున్న వరం దక్కినట్టు వరూధిని సంతోషంతో అతని చెంతకు చేరుతుంది. ఒక షరతు పెట్టి గంధర్వుడు ఆమె కోరికకు ఒప్పుకుంటాడు. ప్రవరుడు అంగీకరించాలే గానీ దేనికైనా సిద్ధమే గదా ఆమె. కానీ ఆ సందర్భంలో మాయా ప్రవరుడు వరూధినితో- ‘నీ పరిష్వంగంలో పొందే పారవశ్యాన్ని తిరస్కరించడానికి నేనేమైనా సన్యాసినా? కానీ ఎందుకో ఆ విషయంలో నాకు కోరిక లేదు. ఒక అనాశ్వాసితమైన దుఃఖం ఆ సుఖాన్ని దుర్భరం చేస్తుంది’ అని అంటాడు. తాను వలచిన స్ర్తీని మరొకరి రూపం ధరించి మోసం చేసినవాడు ఇలా అనడమే గొప్ప ఆశ్చర్యం. మాయా ప్రవరునితో కొన్ని ప్రవర లక్షణాలు, ప్రవరునిలో కొన్ని మాయా ప్రవర లక్షణాలు సృష్టించాడు కవి.

మొదట హిమాలయానికి వచ్చిన ప్రవరుడు ఆ వైపు వచ్చిన తాంబూల పరిమళ సమ్మిళిత వాయువును బట్టి ఇక్కడెవరో జనమున్నారని అనుకుంటాడు. అది మామూలు తాంబూలం కాదు. కస్తూరి ఒక వంతు, కర్పూరం రెండింతలు ఉన్న తాంబూలం. అలాంటి తాంబూలాన్ని స్ర్తీలు మాత్రమే వేసుకుంటారు. ప్రవరుడు కేవలం నైష్టికుడైతే ఈ విషయం తెలియదు. నిత్యం తాంబూల సేవానురక్తులకే ఈ విషయం తెలుస్తుంది. ప్రవరుడు కేవలం నైష్టికుడే కాదని, అతని అంతరంగం లోలోపలి పొరల్లో ఒకింత రసికత ఉందని ఈ పద్యం వలన తెలుస్తుంది.

ఈ వరూధిని కేవలం మను చరిత్రకే, ఒక పుస్తకానికే పరిమితం కాదు. ఈ వంచిత కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు. వాస్తవ ప్రపంచంలో ప్రవరుల కన్నా మాయా ప్రవరులు కూడా ఎక్కువే. పెళ్ళి చూపుల్లో వరుడు సకల సద్గుణవంతుడు అని చెప్తారు. కానీ, పెళ్ళయిన మర్నాడే అతని విశ్వ రూపం ప్రదర్శితమవుతుంది. పాపం! వరూధిని, సుర గరుడ గంధర్వులే మోహించిన సౌందర్యవతి ఐనా కోరుకున్నవాణ్ణి వరునిగా పొందలేకపోగా అతనిచే ఘోర తిరస్కారానికి, అవమానానికి గురైన ఒక పరాభవ గీతిక. మాయా గంధర్వుని చేతిలో మోసపోయిన ఒక అమాయక ప్రాణి. పెద్దన కేవలం కవే గాదు. చేయి తిరిగిన చిత్రకారుడు కూడా. కను రెప్పలు కూడా ఆర్పలేని ఎన్నో రంగుల చిత్రాలను చిత్రించాడు తన ప్రబంధంలో. దానిలో వరూధిని చిత్రాలే ఎక్కువ.

అల్లసాని పెద్దన ఊరేగుతోంటే విద్యానగర ప్రభువు శ్రీకృష్ణ దేవరాయలు...పల్లకీ మోసాడు లాంఛనంగా... అల్లసాని వారి పాదాలు కడిగీ - స్వయంగా గండ పెండేరం తొడిగాడు!

ఈ పద్యం తెలియని తెలుగు వాడు ఉండడనడంలో అతిశయోక్తి లేదేమో...

అటఁ జని కాంచె భూమిసురుఁ డంబర చుంబి శిరస్సర్ఝజరీ

పటల ముహుర్ముహు ర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన

స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్

గటక చరత్కరేణు కర కంపిత సాలము, శీతశైలమున్.........

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!