అభిమన్యుని అస్తమయంపై అర్జునుని ఆక్రోశం !

అభిమన్యుని అస్తమయంపై అర్జునుని ఆక్రోశం !

(తెలుగువారు తమ పౌరుషాన్ని అభిమన్యునిలో చూసుకుంటారు.)

"చతురంభోధిపరీతమైన ధరణి న్శాసింతు వీ వంచు న

మ్మితి; నీ రీతిగ దిక్కుమాలి రణభూమిం గూలితే! కేశవ

ప్రతిరూపంబగు నీ పరాక్రమము వ్యర్థంబాయెనే! పోర నా

కుతుకం బంతయు నీటఁ బుచ్చినవిగా! కుఱ్ఱా! జగన్మోహనా!"

(పాండవ విజయం నాటకం - తిరుపతివేంకటకవులు)

అర్థములు: చతురంభోధిపరీతమైన = నాలుగు సముద్రములచే చుట్టబడిన; ధరణిన్ = భూమిని; శాసింతువు = పరిపాలించెదవు; అంచు = అని; రణభూమిన్ = యుద్ధరంగములో; కేశవుడు = శ్రీకృష్ణుడు; పోర = పోరాడుటకు, యుద్ధం చేయుటకు; కుతుకంబు = ఉత్సాహము, కుతూహలము; నీటఁ బుచ్చినవిగా = నీటిపాలైనవి కదా!; జగన్మోహనా = జగత్తును మోహింపజేసేటంత అందమైనవాడా!

భావము:

తన పుత్రుడైన అభిమన్యుడు నిహతుడైనాడని తెలిసిన అర్జునుని విలాపము. "హా కుమారా! ముక్కుపచ్చలారని కుఱ్ఱవాడివే! సర్వులనూ మోహింపజేసేటంతటి సుందరాంగునివే! నీకు ఈ గతి పట్టినదా తండ్రీ! చతుస్సముద్రములచే చుట్టబడిన ఈ వసుధను నీవు ప్రజానురంజకముగా పాలించగలవని ఎంతో విశ్వసించాను. ఈవిధంగా దిక్కుమాలినరీతిలో ఈ రణరంగములో కూలిపోయావా! నీ మేనమామయగు అచ్యుతుని రూపం, నీలో అచ్చుగుద్దినట్లుగా ఉంటుందే! నీ శౌర్యపరాక్రమమంతా వ్యర్థమైపోయినదా నాన్నా! నీ నిష్క్రమణముతో, శత్రువులతో పోరాడుటకు నాకు గల ఉత్సాహమంతా గంగలో కలిసిపోయినదిరా!" అని పలవిస్తున్నాడు పార్థుడు.

"పాండవ విజయం" లో వీరం ఎంత పొంగులువారుతుందో.

శోకం అంత శ్రోతస్వినిలా సాగుతుంది. అందులోనూ అభిమన్యువధా ఘట్టం పరమ హృదయవిదారకం. ఎవ్వరినైనా కంటతడి పెట్టించగల కరుణరసాన్విత సన్నివేశం. అర్జునపుత్రుడు అభినవ కేశవుడు, అపరకిరీటి. తండ్రుల పరువును కాపాడుటకై తమ్మిపూవువ్యూహము (పద్మవ్యూహం) లో తలదూర్చాడు.

పెదతండ్రులు కోరడమే తన బ్రతుకునకు పెద్దపండుగ అనుకున్నాడు. అతని అదృష్టానికి సైంధవుడు అడ్డుపడ్డాడు. కురువీరులందరూ కలిసి అధర్మయుద్ధానికి తలపడ్డారు. అభిమన్యుడు సింహములా వీరవిహారం చేసి, వీరస్వర్గమును అలంకరించాడు.

తెలుగువారు తమ పౌరుషాన్ని అభిమన్యునిలో చూసుకుంటారు... 

పుత్రశోకం ధర్మజునిలో నిబ్బరంగా నిండుకుంటుంది; పార్థునిలో కట్టలు త్రెంచుకుని ప్రవహిస్తుంది.... కరుణరస కాసారం అభిమన్యుని సంహార సన్నివేశం!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!