అట్లా తద్దోయ్ ...ఆరట్లో ముద్ద పప్పోయి.. ముడుఅట్ట్లోయి

అట్లా తద్దోయ్ ...ఆరట్లో ముద్ద పప్పోయి.. ముడుఅట్ట్లోయి

అని ఆడపిల్లలు... 

అట్లా తద్దోయ్..ఆడపిల్లలోయి..అనిపల్లెరుకాయలు వారికంటే లేచే 

అల్లరి మగపిల్లలు... అక్కలువెంటమేము ఎంతో సరదాగాఉండేది.

విశాలి పేరి గారి చక్కని స్కెచ్ మీకోసం..

.

కరివేపాకు, ఇంగువ పోపు లేకుండా కూరలు రుచించవు కదా! ఇలాగే వేస్తూ ఉంటే ఎదురింటి 'కెలీ ' ఇంటి చుట్టూరా రూమ్ స్ప్రే కొట్టేసేది. మా వంటిల్లు ఆవిడ హాలు పక్క పక్కనే. నేను వండుతుంటే అగర్బత్తిలాంటిది వెలిగించి ఇంటి ముందు పెట్టేది. "సమ్ స్టింకీ స్మెల్ " అనేది ఇంగువ పోపు వేస్తే.. సూర్యేకాంతం లా " అప్రాచ్యపు దానా ఇది ఇంగువే " అనాలనిపించేది. వారాంతరాలలో ఆవిడ వండే బీఫ్, పోర్కు భరించలేక మేము తలుపులు ముసుకునే వాళ్ళమే కానీ ఏమి అనలేకపోయాము.

ఒకసారి అట్లతద్దికి తెల్లవారుఝామునే లేచి నేను ఉట్టివెన్న ముద్ద తింటుంటే ఆ 'కెలీ ' కాలం ప్రతికూలించి అదే టైం కి లేచింది. లేచింది ఊరుకోకా మా కిచెన్ లో లైట్ వెలుగుతోందని బయటకు వచ్చి కిటికీలోంచి చిన్నగా చూసింది. ఆవిడ చూడడం నేనూ చూశా, కానీ ఆ టైం లో పలకరింపులు ఎందుకనీ చూడనట్టే ఉన్నా. అంతే.. 'కీలుగుర్రం ' సినిమాలో అర్ధరాత్రి చిన్నరాణి లేచి ఏనుగులశాలలో తింటోంటే చిన్నప్పుడు మనము భయపడినట్టు భయపడింది. అంతే ఆ రోజు నుంచి అగర్బత్తులు లేవు, రూమ్ స్ప్రేలు కొట్టడాలు లేవు.

ఏ మాటకా మాటే చెప్పుకోవాలి... ఆ దేశం లో అదేమి చిత్రమో కానీ చందమామ చాలా దగ్గరగా కనపడుతాడు... స్కూల్ కి వచ్చే పిల్లాడిలా త్వరగా వచ్చేస్తాడు. ఈ దేశంలో కాలేజీ కుర్రాడిలా ఎప్పుడూ లేటే! దానికి తోడు స్నానం చేశాక నక్షత్రాలు లెక్కపెట్టే వరకు మాట్లాడకూడదట! నాలాంటి వాళ్ళకి అదెంత పెద్ద కష్టమో! అందుకే నక్షత్రాలు వచ్చాకే స్నానం చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయ్యిపోతుంది!

చిన్నప్పుడు 'ఉట్టివెన్న ముద్ద " అంటే అదేదో రంగురంగుల వెన్నల ముద్ద... కొత్త కొత్త రుచులతో ఉంటుందన్న అపోహతో ఆ రుచి ఎలా ఉంటుందో అన్న కుతూహలంతో తెల్లవారుఝామునే లేచి కొన్నేళ్ళ పాటు తిన్నా.. ఎన్నేళ్ళు తిన్నా అదే గోంగూర పచ్చడి, అదే ఉల్లిపాయల పులుసు, అదే కందిపొడి!

గోరింటాకు ఎవరిది ఎంత బాగా పండిందో చూసుకొని ఆనందించేవాళ్ళము. మా మామ్మ, అమ్మమ్మ, చినమామ్మ మాతో పాటుగా ఉట్టివెన్న ముద్ద తినేవారు... అలా చేస్తే కడుపు చలవని!! మా మామ్మ ఉయ్యాలలూగాలని ముందు రోజే మావిడి చెట్టుకి ఉయ్యాల కట్టించేది. మా అమ్మమ్మ మాత్రం ఆటలు గీటలూ లేవు కూర్చొని చదువుకో అనేది. ఇక అట్లు మా చినమామ్మ దొంతర్ల కొద్ది కాల్చేది. పల్చగా, తెల్లగా అచ్చు చందమామలా ఉండేవి. దానిలోకి తిమ్మనం, దోసకాయ చింతకాయ పచ్చడి. తిమ్మనానికి బియ్యం రోట్లో రుబ్బేవారు. కొబ్బరి వేస్తే భలే ఉండేది. కానీ కొబ్బరి వేస్తే మరునాటికి పాడైపోతుందని వేసేవారు కాదు. నోము నోచిన వాళ్ళు మరునాడు కొన్ని పాచి అట్లు తినాలనే వారు. ఉపవాసం, పైగా వర్షాకాలమూ.. చంద్రుడు ఓ పట్టాన వచ్చేవాడు కాదు, వచ్చినా మబ్బులు ఉండేవి. అందరూ తినేసేవారు, ఈ నోము నోచుకునేవారు మాత్రం ఓ పక్కన నీరసానికి పడుకుంటే చంద్రుడు వచ్చాడని ఎవరో చెబితే అప్పుడు చంద్రున్ని చూసి ఆ నైవేద్యం పెట్టిన చిన్న చిన్న అట్లు తినేవారు.

ఆ ఉయ్యాలలూ, ఆ అరుపులు, ఆ అట్ల దొంతరలు, ఆ హడావిడిలు ఇప్పుడు లేవు.. కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ తాజాగానే ఉంటాయి!!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!