ద్రౌపది దేవి మొదటిమహిళా న్యాయవాది!

ద్రౌపది దేవి మొదటిమహిళా న్యాయవాది!


నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా?"

మహాభారతం, సభాపర్వం, ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో..... జూదంలో ద్రౌపదీ దేవిని ధర్మరాజు ఓడిపోయాక, దుర్యోధనుడు రాణీ వాసపు అంతఃపురంలో ఉన్న ద్రౌపదీ దేవిని, సభకు తోడ్కొని రమ్మని ప్రాతికామిని పంపుతాడు.

అంతటి అనుచిత కార్యానికి ఒణికిపోతూ, ప్రభు ఆజ్ఞను పాటిస్తూ అతడు వెళ్ళి ద్రౌపదికి రాజాజ్ఞ వినిపిస్తాడు. అప్పటికే సభలో నడుస్తున్న జూదం గురించీ, విపరీతాల గురించి వినీ ఉన్న ద్రౌపది, సభాప్రాంగణంలోనికి అడుగు పెట్టవలసి రావటమే అవమానంగా భావిస్తూ, అదే గొప్ప ఉపద్రవమనుకొంటుంది. దాన్ని నివారించేందుకు ఓ ప్రశ్నను సభకు పంపుతుంది.

"నా స్వామి .... నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా?" అని! అంటే - ముందుగా తనను తాను ఓడిపోయాక, ధర్మరాజు, నన్ను ఓడిపోయాడా? అలాగైతే ఆ ఫణం చెల్లదు. ధర్మరాజు కిక ద్రౌపదిని పందెం ఒడ్డే అర్హత ఉండదు. తనను ఓడాక ధర్మరాజు దుర్యోధనుడి బానిస! ధర్మరాజుతో పాటు ద్రౌపదీ దుర్యోధనుడికి బానిస కావచ్చుగాక! కానీ దుర్యోధనుడికి ధర్మరాజు ప్రత్యక్ష బానిస అయితే, ధర్మరాజుకి ఇల్లాలయిన ద్రౌపది దుర్యోధనుడికి పరోక్ష బానిస అవుతుంది. ద్రౌపది మాత్రం ధర్మరాజు అధీనంలో ఉన్నట్లే! అప్పుడు ఏ అజ్ఞనైనా ద్రౌపది పాటించాలంటే - అది దుర్యోధనుడైనా సరే, ధర్మరాజు చేత ద్రౌపదికి అజ్ఞాపింప చేయాల్సిందే!

అలాగ్గాక.... ధర్మరాజు, ముందు ద్రౌపదిని పందెం ఒడ్డి ఓడిపోయి, తర్వాత తనను తాను ఫణంగా పెట్టుకొని ఓడిపోయాడా? అలాగైతే అప్పుడు ద్రౌపది దుర్యోధనుడికి ప్రత్యక్ష బానిస. నేరుగా దుర్యోధనుడు ద్రౌపదిని ఏం చెయ్యమనైనా ఆజ్ఞాపింపవచ్చు.

ఈ ధర్మసందేహాన్ని ద్రౌపది సభకు పంపిస్తుంది. అందుకు కోపంతో భగ్గుమన్న దుర్యోధనుడు, దుశ్శాసనుడికి ద్రౌపదిని జుట్టుపట్టి సభకు ఈడ్చుకు రమ్మని చెబుతాడు. అతడలాగే.... వదినను, అంతఃపుర మహిళని అవమానిస్తూ లాక్కొస్తాడు.

ఆమెను వివస్త్రను చేసి అవమానించాలని ప్రయత్నిస్తారు. సభలోకి రాగానే ద్రౌపది, తన ప్రశ్నను మళ్ళీ వినిపిస్తుంది. వికర్ణుడూ, యుయుత్సుడూ, అశ్వత్ధామ మొదలైన వాళ్ళు చర్చకు సిద్దమైనా.... అందరూ మౌనంగా చూస్తుంటారే తప్ప ద్రౌపదీదేవి కి జరిగే అవమానాన్ని ఆపే ప్రయత్నం ఎవరూ చేయరు. అంతటి సంకట స్థితిలో కూడా ఆమె, జరుగుతున్న అవమానాన్ని తనదైన పద్దతిలో నిలువరించేందుకు, ఒక్క మాటలో చెప్పాలంటే స్వీయమాన రక్షణకు, అదే ధర్మ సందేహాన్ని పదేపదే రెట్టిస్తుంది.

అప్పుడు భీష్ముడు "అమ్మాయీ! ధర్మం బహు సూక్ష్మమైనది. నీ భర్త యుధిష్థిరుడు ధర్మజ్ఞుడు. నీ సందేహాన్ని అతడు మాత్రమే తీర్చగలడు" అంటాడు.

సాభిప్రాయంగా ధర్మజుని వైపు చూసిన ద్రౌపది చూపుల నెదుర్కోలేక ధర్మరాజు తలదించుకుంటాడు. అందులో నిస్సహాయత ఉంది. క్షమనర్దిస్తున్న వేడుకోలు ఉంది. అప్పటికి.... భయ విహ్వలతతో, నిస్సహాయతతో కుప్పకూలిన ద్రౌపదీ దేవిని, ఆ అవమానం నుండి వాసుదేవుడు కాపాడినట్లు మనం భారతంలో చదువుతాము.

వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది లేవనెత్తిన ద్వంద్వం లేదా ధర్మ సందేహానికి సమాధానం అరణ్యపర్వంలో చెప్పబడుతుంది. అరణ్యవాసంలో ఉండగా.... ధర్మరాజు కీ - భీమార్జున నకుల సహదేవులుకీ, ధర్మరాజుకీ - ద్రౌపదీ దేవికీ మధ్య నడిచిన సంభాషణల్లో.... ద్రౌపది ‘మనిషికి అవసరమైనంత మేరకు క్రోధం, రజోగుణం ఉండాల్సిందేననీ, అలా లేకపోవటం దోషభూయిష్టమేననీ’ అంటుంది. ధర్మరాజు ‘అలాగని శాంత గుణాన్ని విడిచి పెట్టకూడ’దంటాడు. ఆ సందర్భంలో ద్రౌపది, నిర్మొహమాటంగా ధర్మరాజులోని లోపాలని ఎత్తి చూపుతుంది.

ధర్మరాజు ‘జూదానికీ, యుద్దానికీ పిలిచినప్పుడు క్షత్రియుడు వెనుకంజ వేయకూడదని’ అంటూనే ‘జూద క్రీడ వినోదం అనే పరిధిని దాటి వ్యసన పూరితంగా పరిణమించటం తప్పేనని’ పరోక్షంగా అంగీకరిస్తాడు. ద్యూత క్రీడలో తనను మించిన వారు లేరనే తన అతిశయించిన ఆత్మవిశ్వాసాన్ని తలుచుకొని ధర్మరాజు ఆత్మనిందకు పాల్పడకుండా, నివారిస్తూ.... భీమార్జున నకుల సహదేవులు.... శకుని మాయాద్యూతాన్ని పసిగట్టలేక పోయిన తామందరూ విధి వంచితులమంటారు.

ఆ విధంగా.... ఇంద్రప్రస్థ నగర నిర్మాణం నాడూ, రాజసూయ యాగ నిర్వహణ నాడూ, తాము ధర్మజుని అగ్రజ నాయకత్వాన్నీ, సమిష్టి విజయాన్ని అంగీకరించినట్లే.... నేడు సమిష్టిగా అపజయాన్ని పంచుకుంటారు.

నిజంగా భీముడు - ద్రౌపది - ధర్మరాజు ల సంవాదం, ధర్మ సమీక్ష భారతంలో కీలకమైనది. ఈ సన్నివేశం చివరిలో, కథలో ప్రవేశించిన వేద వ్యాసుడు, పాశుపతాస్త్రం సంపాదించమని పాండవులను ఆదేశిస్తాడు. ఆ విధంగా సభాపర్వంలో ద్రౌపది లేవనెత్తిన ధర్మ సందేహం, అరణ్యపర్వంలో పరిష్కరింపబడుతుంది. దేనినైనా కాలమే పరిష్కరిస్తుంది అన్నట్లు!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!