Saturday, December 30, 2017

భట్టుమూ ర్తి వ్రాసిన "వసుచరిత్రలో ఒక పద్యము.

భట్టుమూ ర్తి వ్రాసిన "వసుచరిత్రలో ఒక పద్యము.

-

వాసు రాజు వ్యాహ్యాళి కై వచ్చి ఒక చోట విశ్రమించినాడు.

అప్పుడు ఎక్కడి నుండియో మధుర గానము వినపడెను.

ఎవరో ఒకయువతి మధురముగా పాడుతూ వుంది.

అప్పుడు ఆ రాజు తన వెంట వచ్చిన వయస్యుని (మిత్రుడిని)ఎవరిదీ గంధర్వగానము?పోయి చూచిరా అనిపంపించాడు.

ఆ మిత్రుడు వెళ్లి చూసి వచ్చి ఆమె సౌందర్యమును యిలా వర్ణించాడు.

-

"కమనీయాకృతి యోగ్య కీర్తనలం గన్పట్టు నా శ్యామ, యా 

సుమబాణాంబక, యా యమూల్య మణి, యా చొక్కంపు పూబంతి యా 

సుమనోవల్లరి,ఆ సుధా సరసి యా సొంపొందు డాల్దీవి యా 

కొమరు బ్రాయంపు రంభ, ఆ చిగురుటాకుంబోడి నీకేతగున్ !

-


అర్థము:--ఆమె కమనీయ రమణీయ అవయవ సౌందర్య యౌవ్వనము,ఆమె మన్మధ బాణముల వంటి కన్నులు గలది.(అరవింద,మశోకంచ,చూతంచ,నవమల్లికా, నీలోత్పలంచ పంచైతేపంచ బాణస్యసాయికా ఈ 

ఐదూ మన్మధుని బాణాలు)పద్మరాగ మణి వంటి పెదవులు కలది.పూదీగేల వంటి చేతులు గలది,అమృత సరస్సు వంటి నాభి గలది,చొక్కమైన పూబంతుల వంటి కుచములు గలది,చిగురుటాకుల వంటి పాదములు గలది,అంతేకాక సన్నని దేహము గల్గి మన్మథ బాణము,అమూల్యమైన మణి పూబంతి 

వంటి యింతి ;పూలతీగే అమృత సరస్సు,కాంతి,దేవి యౌవనవతి,రంభ వంటిది చిగురు శరీరము గలది,

ఆ అపురూప సౌందర్యవతి నీకే తగును.నీవు తప్ప ఆమె కెవరూ సరిపోరు.

అనిన మిత్రుడిని జూచి ఆత్రుతగా నీవు ఆమెను కలిసితివా?అని రాజు అడిగాడు.అప్పుడు ఆ మిత్రుడు 

ఆమె తన చెలికత్తెలతో ఒక పొద వద్ద కూర్చునివాళ్ళల్లో వాళ్ళుపాటలు పాడుకుంటూ సరసాలాడు కుంటున్నారు అటువంటి సమయములో అక్కడికి నేను పోరాదు.అని

-

"స్వైర విహార ధీరలగు సారసలోచనలున్న చోటికిన్ 

భోరున లాతివారు చొరబూనినచో రసభంగమంచు,నే 

జేరక పువ్వు తీవెల చెంతనె నిల్చి లతాంగి రూపు క 

న్నారగ జూచి వచ్చితి నవాంబు రుహాంబక నీకు దెల్పగన్!


అర్థము:-రసభంగము చేయని మరొక పద్యము.ఆ వయస్యుడు మరియాద తెలిసినవాడు.యువతులను 

జూచుటకు వెళ్ళినాడు.వారు సంగీతమున నిమగ్నులై యున్నారు.వారు తనను గమనించిన పని చెడిపోతుంది.అందుకని అతను వసు రాజుతో యిట్లనుచున్నాడు.

స్వేచ్చావిహారులైన యువతులు, ప్రౌఢ లైన సారసలోచనలు (తామర రేకులవంటి కన్నులు గలవారు)

వున్నచోటికి హఠాత్తుగా పరాయి మగవారు ప్రవేశించిన యేమగును?రసభంగ మగును.అని నేను వెళ్ల లేదు.

వారి సరస సంభాషణలకు భంగ మగును అని ఒక అర్థము.."సారసలోచనలు" అను పదములో 'రస' అను అక్షర భంగ మయినచో వారు సాలోచనలగుదురు.అదొక చమత్కారము..అసలే పెద్ద కన్నులున్నవారు,నన్ను చూచిన

యింకా కళ్ళు విప్పార్చుకొని వీడెవడు?పానకంలో పుడక లాగ వచ్చినాడు అని సాలోచనలగుదురు.(కన్నులు యింకా పెద్దగా జేసి చూచెదరు)కనుక పూతీగేల నడుమ నుండి ఆ యువతినికన్నుల నిండుగా జూసి నీకు చెప్పవలెనని వచ్చినాను తమ్మికంటీ (తామర రేకుల వంటి కన్నులు కలవాడా!)ఆమె సారసలోచన మరి నీవు సారసలోచనుడవు.(నీవు పోవచ్చును అను అంతరార్థము).

భట్టుమూర్తి ఎంత అద్భుత మైన వర్ణన చేసినాడు కదా!"వసు చరిత్ర" లో వర్ణనలకే అధిక ప్రాధాన్యము యిచ్చినాడు కవి.

No comments:

Post a Comment