తెలుగులో మొదటి నీతి పుస్తకంసుమతి శతకం! (రచన: వెల్చేరు నారాయణరావు.)

తెలుగులో మొదటి నీతి పుస్తకంసుమతి శతకం!

(రచన: వెల్చేరు నారాయణరావు.)

.

1966లో ప్రచురించిన సుమతి శతకానికి పీఠిక రాస్తూ నిడదవోలు వెంకటరావు

సుమతి శతకం మొట్ట మొదటి సారిగా ఆదిసరస్వతి ముద్రణాలయం వారు 

1868 ఏప్రిల్ 20వ తారీకున ప్రచురించారు అని రాశాడు.

తెలుగులో ఏ పుస్తకానికైనా ఇంత నిక్కచ్చిగా అది ప్రచురించబడిన సంవత్సరం, నెల, తేదీతో సహా తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. 

దాదాపు 100 సంవత్సరాల క్రితం ప్రచురించబడిన ఇంత విలువైన సమాచారం వెంకటరావుకి ఎలా దొరికిందో ఆయన వివరించలేదు. 

కానీ ఈ సమాచారాన్ని ఇంకొక ఆలోచన లేకుండా మచ్చా హరిదాసు 

(తథ్యము సుమతి: పరిశోధన వ్యాసాలు, 1984, పే. 67), 

ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం, 2002, సంపుటం 1, పే 224) తిరిగి చెప్పారు.

కాని 1868 సంవత్సరపు ప్రచురణ నాకు ప్రపంచంలో ఏ గ్రంథాలయంలోనూ దొరకలేదు.

ఇలాటి ముద్రణ తాము చూసినట్లు ఏ పరిశోధకుడు నాతో చెప్పలేదు. 

అందుచేత 1870 సంవత్సరపు ప్రచురణనే సుమతి శతకానికి మొదటి ముద్రణగా నేను భావిస్తున్నాను.

.

1930లో ప్రచురింపబడి Director of Public Instruction వారిచే మూడవ తరగతి పాఠ్య పుస్తకముగా ఆమోదించబడిన ‘ఆనంద వాచకము’లో నీతి పద్యములు అనే పేరుతో సుమతి శతకం నుంచి 10 పద్యాలు ఉన్నాయి

.

కందం ఛందస్సు

ఈ రెండు రకాల సుమతి శతకపు పద్యాల నిర్మాణం వివరంగా చర్చించడానికి ముందు కంద పద్యపు ఛందస్సుని గురించి చెప్పడం అవసరం.ఈ వ్యాసం చదివే తెలుగు వాళ్లకి చాలా మందికి తెలిసే వుంటుంది కానీ స్పష్టత కోసం కంద పద్యపు ఛందస్సు స్థూలంగా చెప్తాను. కందంలో చతుర్మాత్రా గణాలే వుంటాయి. నాలుగు పాదాలుంటాయి. రెండో అక్షరం ప్రాస. మొదటి పాదంలోనూ మూడో పాదంలోనూ మూడేసి గణాలుంటాయి. రెండో పాదంలోనూ నాలుగవ పాదంలోనూ అయిదేసి గణాలుంటాయి. రెండవ పాదంలోనూ, నాలుగవ పాదంలోనూ నాలుగవ గణం మొదటి అక్షరంతో యతి చెల్లుతుంది. ప్రస్తుతానికి ఇంతకన్నా వివరాలు అక్కర్లేదు. ఉదాహరణకి ఈ కింది పద్యం చూడండి.

అల్లుని మంచితనంబును

గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్

పొల్లిన దంచిన బియ్యము

తెల్లని కాకులును లేవు తెలియుర సుమతీ

వావిళ్ళ సుమతి శతకంలో మౌఖిక లక్షణాలు

పై పద్యం ఏ పాదానికి ఆ పాదం విడిపోతుంది. అంటే మొదటి పాదం లోని వాక్యం ఆ పాదం చివరితో అయిపోకుండా రెండవ పాదంలోకి ప్రవహించి నడిచే పరిస్థితి ఉండదు. అంతేకాక యతి స్థానం దగ్గర కొత్త మాట మొదలవుతుంది. పద మధ్యస్థంగా యతి పడటం, ప్రాస స్థానం దగ్గర కొత్త మాట ఆరంభం కావడం ఇలాంటి క్లిష్టమైన నిర్మాణాలు వావిళ్ళ సుమతి శతకంలో దొరకవు. అంతే కాకుండా వావిళ్ళ సుమతి శతకంలో యతి కోసం, ప్రాస కోసం వేసుకున్న పూరక పదాలు బోలెడు కనిపిస్తాయి. ఉదాహరణకి ఇందులో ఉన్న 108 పద్యాల్లో 71 పద్యాల్లో పూరక పదాలున్నాయి. అందులో 52 యతి కోసం వచ్చినవి, 19 ప్రాస కోసం వాడినవి.

ఫూరక పదాలు ఎలా వుంటాయో చెప్పడానికి ఒక జాబితా యిస్తున్నాను: ఇలలో, భువిలో, మహిలో, మెదిని, వసుధను, ఎరుగుము, తెలియుర, నయమిది, మరి, నిక్కము, తథ్యము, సిద్ధము, సహజము, గదరా, …ఇత్యాది.

మామూలుగా ఈ కాలపు పండితులు ఈ పూరక పదాల్ని వ్యర్థపదాలంటారు. కానీ మౌఖిక ప్రచారంలో వున్న పద్యానికి ఇవి చాలా విలువైనవి. ఒకటి ఇవి ఎలా వుంటాయో ముందో ఊహించడం చాలా తేలిక. అంచేత పద్యం జ్ఞాపకం పెట్టుకోవడానికి చాలా ఉపకరిస్తాయి. పద్యం తాలూకు అర్థపు బరువును పెంచకుండా నిర్మాణ సౌష్టవాన్ని, శబ్దసుభగత్వాన్ని ఈ పదాలు నిలబెడతాయి.

వావిళ్ళ సుమతి శతకంలో చాలా పద్యాలు నిర్మాణంలో కూడా ఒక రకమైన పునరుక్త వాక్యాలను అనుసరిస్తాయి. అందుచేత వాటిని జ్ఞాపకం పెట్టుకోవడం తేలికవుతుంది. ఉదాహరణకి:

నవ్వకుమీ సభలోపల

నవ్వకుమీ తల్లి దండ్రి నాథుల తోడన్

నవ్వకుమీ పరసతితో

నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ

ఈ పద్యంలో చివరి ముక్క నయమిది అనే పూరక పదంతో ప్రారంభం కావడం గమనించండి. అంటే కవికి ‘నా’తో మొదలయ్యే సార్థకమైన మాట వెతకవలసిన అవసరం తప్పిందన్న మాట.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!