నడుస్తున్న వంటగదిలో ఉపగదులు ! (‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’ )

నడుస్తున్న వంటగదిలో ఉపగదులు !

(‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’ )

-

ఎక్కడో అక్కడ కనిపించే మొల్ల, వెంగమాంబ, ముద్దుపళని, రంగాజమ్మ మొదలైన నలుగురైదుగురు స్ర్తీల పేర్లు తప్ప ఆదికవి నన్నయ దగ్గరనుంచి ఆధునిక యుగం వరకు కవిత్వ ప్రపంచ సర్వస్వం పురుషాధీనమే. వేదయుగంలో మంత్ర ద్రష్టలుగా, స్రష్టలుగా గార్గి, మైత్రేయి వంటి మహిళల పేర్లు వినిపించినా మధ్య యుగంలో మాత్రం సమాజంలో గాని, సాహిత్యంలో గాని పడతుల ప్రాతినిధ్యం, ప్రభావం శూన్యం. 

తాళ్ళపాక తిమ్మక్క, ముద్దుపళని, రంగాజమ్మ, వెంగమాంబ మొదలైనవాళ్ళు కవయిత్రులుగా ప్రసిద్ధి కెక్కినా ఆ తర్వాత ఆడవాళ్ళకు మళ్ళీ అంధకార యుగమే. ఆడవాళ్ళకు చదువు ఎందుకు అన్నారు. ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా అని తర్కించారు. కొన్ని శతాబ్దాలపాటు వెనక్కి నెట్టేశారు. చీకట్లో వేగు చుక్కల్లా స్రీల జీవితాల్లో సంఘ సంస్కర్తలు బయలుదేరి ఆశల నక్షత్రాలు వెలిగించారు. చదువుల చందమామ ఉదయింపచేశారు.

.

19వ శతాబ్దంలో కందుకూరి, గురజాడ మొదలగువారు జన్మించి స్ర్తీ విద్యను ప్రోత్సహించారు. ‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’ అన్నారు. కోడూరి, యద్దనపూడి, మాదిరెడ్డి, లత, రంగనాయకమ్మ మొదలగువారు తమ రచనలతో తెలుగు సాహిత్యాన్ని ముంచెత్తారు. ఆ సమయంలో కొందరు రచయితలు కూడా స్ర్తీల పేర్లలో రచనలు చేశారంటే వారి ప్రభావం ఎంత ప్రగాఢమైనదో ఆలోచించవచ్చు. వీరందరూ కేవలం కథారంగానికీ, నవలా రంగానికీ పరిమితం. కవితా రంగంలో కాలు పెట్టలేదు. 80ల్లో కవిత్వ రంగాన్ని కుదిపివేస్తూ స్ర్తీవాద కవిత్వ ఉద్యమం ప్రారంభమైంది. సమాజంలోని పురుషాహంకార ధోరణిని ప్రటిఘటిస్తూ సంప్రదాయ భావజాలాలపై తిరుగుబాటు చేస్తూ ఒక ప్రభంజనంలా, ఒక విస్ఫోటనంలా, ఒక మహోద్వేగ ప్రవాహంలా తెలుగు కవిత్వాన్ని ఒక్క కుదుపు కుదిపింది స్ర్తీవాద కవిత్వం. 

స్త్రీలు తాము మాత్రమే అనుభవించి అనుభూతించి, తాము మాత్రమే రాయగలిగే భావాలకు అక్షర రూపమిచ్చారు. 

కవయిత్రులుగా కొత్త ప్రపంచపు తలుపులు తెరిచారు. పితృస్వామ్య వ్యవస్థను ధిక్కరిస్తూ తమ కవిత్వపు కొరడా దెబ్బలు ఝుళిపించారు. అక్షరాలను అగ్ని కేతనాలుగా ఎగుర వేశారు. పిడుగులు కురిపించారు. తుఫానులా విజృంభించారు. 

-


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!