వివేకచూడామణి (13 వ, 14వ భాగాలు ) !

వివేకచూడామణి (13 వ, 14వ భాగాలు ) !.

-

శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.

-

13.ప్రత్యగాత్మ – సర్వాత్మ – పరమాత్మ :

క్రిందటి మాట జీవుడి వెనుక ఉన్న ఆధారం ఆత్మతత్త్వమని, అది జ్ఞానస్వరూపమైనదని, ఆ ఆత్మజ్ఞానం చిత్తంలో ప్రతిబింబించటం వల్లనే జీవభావం కలుగుతున్నదని చెప్పుకున్నాం. ప్రతి జీవిలో ఉన్న ఆత్మతత్త్వం ప్రత్యగాత్మ అని, జీవాత్మ అని అంటారు. ఈ ఆత్మతత్త్వం ప్రత్యేకమైన శరీరంతో కూడి, ఆ శరీర మనోబుద్ధులను ప్రకాశింపచేస్తూ, వాటితో తాదాత్మ్యం పొందటం వల్ల దానికి ప్రత్యగాత్మ అని పేరు వచ్చింది. ఆ ఆత్మతత్త్వం ఆ శరీర మనోబుద్ధులవల్ల కప్పబడినదై తన నిజతత్వాన్ని మరిచిపోయి, మహాసముద్రంలో ఒక ప్రత్యేక అలలా ‘తను వేరు’ అనే భావంతో ఉంటుంది. పరమాత్మ సర్వవ్యాపకమై మహాసముద్రంలాగ ఉంటాడు. వస్తుతత్త్వంలో సముద్రానికి, దానిపై కదిలే అలకు భేదం లేనట్లు, ప్రత్యగాత్మకు, పరమాత్మకు వస్తుతత్త్వంలో భేదంలేదు. ప్రత్యగాత్మ ఒక ఉపాధితో (శరీరంతో) కూడుకున్నది. పరమాత్మ ఆ శరీరమైంది. అన్ని ఉపాధులలో (శరీరాలలో) ఉండే ఆత్మతత్వాన్ని సర్వాత్మతత్త్వం అంటారు, వస్తుతత్త్వంలో మూడు ఒక్కటే. అప్పుడప్పుడు పరమాత్మను, సర్వాత్మ అని కూడ అంటారు.

14. బ్రహ్మతత్త్వం :

బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పేటప్పుడు, అది అనాది అని, అంతం లేనిదని, సర్వవ్యాపకమైనదని, సర్వాత్మతత్త్వమని, నిరాకారమైనదని, నిర్వికారమైనదని, నిర్వికల్పమైనదని, ఇంద్రియ మనోబుద్ధులకు అతీతమైనదని, సత్-చిత్-ఆనంద స్వరూపమైనదని, ఆకాశంలాగఅనంతమైనది, అవిచ్ఛిన్నమైనది, నిరంజనమైనది, అలలులేని మహాసముద్రంలాగ నిశ్చలమైనది, చంద్రకాంతిలాగ మధురానుభూతి కలుగచేసేదని – ఈ విధంగా కొన్ని విధాలుగా చెప్తుంటారు. అది అనిర్వచనీయమైనది, అనుభవ గ్రాహ్యమైనది. బ్రహ్మంలో నిలిచినవారికి ఈ దృశ్యప్రపంచం కనిపించకనే కనిపించదని, కనిపించినా స్వప్నంలాగ కనిపిస్తుందని చెప్తారు.

అంతా బ్రహ్మమే అయినా, ఈ దృశ్య ప్రపంచమేమిటి? జీవుడు ఎవరు? నేను బ్రహ్మం అయితే, ఆ అనుభవం నాకెందుకు కలగటం లేదు? అన్నీ అద్వయమైన బ్రహ్మతత్త్వమే. అందులో నువ్వు, నేను, వాడు అనే విభేదం లేదు. ఈ దృశ్యప్రపంచం లేదు. ఈ వివిధతత్త్వం లేదు. ఈ విభిన్నత్వం లేదు. కాని మన భ్రమ వల్ల ఈ వివిధత్వం, విభిన్నత్వం కనిపిస్తుంది. నువ్వు, నేను, వాడు, అది అనే భేదభావం కలుగుతుంటుంది. ఆ భ్రమ తొలగిపోగానే నీ నిజతత్త్వమైన అఖండ బ్రహ్మతత్త్వం అవగతమవుతుంది. ఇది అద్వైతవేదాంత సిద్ధాంత సారాంశం.

కాని పైన చెప్పినంత సులభంగా దీనిని అర్థంచేసుకోలేం. దీనిని తెలుసుకోటానికి ఎంతో విచక్షణాజ్ఞానం అవసరం.

ముందుగా బ్రహ్మం గురించి చెప్తున్నప్పుడు అది సత్-చిత్-ఆనంద స్వరూపుడని చెప్తుంటారు.

మనకు కనిపించే దృశ్యప్రపంచం వెనుక ఒక సత్పదార్థం, ఈ విశ్వానికంతా ఆధారభూతమైనది ఉన్నది. అది నిత్యమైనది, శాశ్వతమైనది, మార్పులు చెందినది. దేశ, కాల, కారణ నియమాలు లేనిది (ఈ మూడు మార్పులు చెందే వాటిలో మాత్రమే ఉంటుంది).

ఆ విధమైన సత్పదార్థం ఉన్నదని ఎవరు తెలుసుకుంటున్నారు? ఆ సత్పదార్థం తననుతాను తెలుసుకునే జ్ఞానం కూడ అందులోనే ఉన్నది. ‘నేను ఉన్నాను’ అనే భావంతో ఆ సత్-పదార్థం నిండి ఉన్నది. ఆ ఉండటం, ఈ తెలుసుకోవటం ఎందుకు? ఆనందం అనుభవించటానికి. ఆ సత్ పదార్థం ‘నేను ఉన్నాను’ అనే జ్ఞానంలో ఆనందం అనుభవిస్తూ ఉంటుంది.


ఆ ఉనికికి, ఆ జ్ఞానానికి, ఆ ఆనందానికి దేశ, కాల, కారణ నిమిత్తం లేదు. అది సర్వదా ఆ విధంగనే ఉంటుంది. అలాంటి సచ్చిదానంద స్వరూపమే నువ్వు, ఈ సమస్త జీవరాసులు కూడ బ్రహ్మమే. ఈ చరాచరప్రపంచమంతా సత్-పదార్థమే. చైతన్యవంతాలైన జీవరాసులన్నిటిలో చిత్-శక్తి ప్రకాశిస్తుంటుంది. అన్ని జీవరాసులలో ప్రధానమైన (ప్రగాఢమైన) వాంఛ ఆనందమే.

-

-ఇంకా వుంది-

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!