వివేకచూడామణి- (3వ భాగం)! -

వివేకచూడామణి- (3వ భాగం)!

-

శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.


-

3. మార్పు – ఆధారం :

మార్పును తెలుసుకోవటానికి ఒక మారని వస్తువు ఆధారంగా, ప్రమాణంగా ఉండాలి. నిన్న ఒక చోట చూసిన చెట్టు, నేడు అక్కడ లేకపోతే ఆ మార్పును గ్రహించగలం. ‘నిన్న అక్కడ చెట్టు ఉండేది, ఇప్పుడు ఏమైంది?’ అని ప్రశ్నిస్తే, ‘ఎక్కడ?’ అనే ప్రశ్న పుడుతుంది. ‘ఇక్కడే ఆ పెద్ద భవనం ముందు, ఈ దారికి ఇటువైపు’ అని చెప్తాం. అట్లా చెప్పటంలో మనం మనకు తెలియకుండానే, కొన్ని మారని వస్తువులను ఆధారంగా తీసుకుని, మారిన పరిస్థితిని గ్రహించాము. ‘ఇక్కడ’ అనే స్థలనిర్ణయానికు, నిన్న, ఈ రోజు మారకుండ ఉన్న ఆ భవనం, ఆ దారి ఆధారంగా చేసుకున్నాం అన్నమాట.


ఇట్లా కాక, తెల్లవారిన తరువాత, ఆ భవనం, ఆ దారి కూడా లేకపోతే? అప్పుడు ‘ఇక్కడ’ అని నిర్దేశించటానికి ఏమి ఉంటుంది? దేనితో పోల్చి ఏది మారిందని నిర్ణయిస్తాం?

ప్రత్యేకమైన స్థలాన్ని నిర్ణయించటానికి, ఏదో ఒక ఆధారరేఖ, స్థిరంగా ఉండేది – (Fixed Base Line) ఉండాలి. ఈ విధంగానే, ఒక ప్రత్యేక సమయాన్ని నిర్ణయించటానికి, ఒక నిర్దిష్టమైన సన్నివేశం ఆధారంగా తీసుకోవాలి. మనం తీసుకునే ఆధారాలు ఎప్పటికీ మారనివిగా ఉండాలి.

స్థలానికి (Space) అది ఎక్కడ?

కాలానికి (Time) అది ఎక్కడ?

కారణానికి – మూలకారణమేది?

ఒక వస్తువుకు మరొక వస్తువుకు మధ్య అంతరం స్థలం (దేశం) కాని, వస్తువులే లేని చోట స్థలనిర్ణయం ఎట్లా చేయగలం? ఎట్లాంటి సంకేతాలు (Distinguishable points) లేని మహా ఎడారిలో మనం దూరాన్ని ఎలా కొలవగలం? ఒక చోట బయలుదేరి 100 అడుగులు వేసి ‘నేను 100 అడుగుల దూరంలో ఉన్నాను’ అని మనం అనవచ్చు. కాని ‘ఎక్కడ నుంచి’ అని ప్రశ్నించేసరికి, మనం బయలుదేరిన బిందువు ఎక్కడున్నదో చెప్పలేం. మనం ఎక్కడున్నా చుట్టూ కనుచూపు మేర వరకు ఎడారే – ఎంత దూరం నడిచినా ఎడారిలోనే ఉంటాం. ఆకాశం మేఘావృతమై, సూర్యుడుగాని, చంద్రుడుగాని నక్షత్రాలుగాని కనిపించనప్పుడు మనం దిక్కులు కూడా మరచిపోతాం. తూర్పుకు పోవటానికి బదులు ఉత్తరానికి వెళ్తాం. (ఈ విధంగా దారి మరచిపోటానికి ఎడారులే అక్కరలేదు. పెద్ద పెద్ద పట్టణాలలో కూడా, ఒకేరకమైన భవనాలున్న ప్రాంతాలలో కూడా మనం స్థలనిర్ణయం చేయలేం). ఎందుకంటే అంతా ఒకే వస్తువు. విభిన్నత్వం లేని ఒకే వస్తువు. విభిన్నత్వం లేని చోట ‘స్థలం’ అన్న మాటకు అర్థం లేదు.

-

ఇక కాలం – రెండు సంఘటనల మధ్య అంతరాన్ని కాలం అంటున్నాం. ఈ రోజు సూర్యోదయం మొదలుకుని, మరునాడు సూర్యోదయం వరకు మధ్య గల అంతరాన్ని ‘ఒక రోజు’ అంటున్నాం. దానినే గంటలలో,నిముషాలలో, సెకనులలో భాగించాం. ఆ రోజును ఆధారంగా చేసుకునే నెలలు, సంవత్సరాలు, యుగాలు మొదలైనవి నిర్ణయిస్తున్నాం. కాని సంఘటనలతో ప్రమేయంలేని ‘శుద్ధకాలము’ (Independent Absolute Time) అన్నది ఉన్నదా? అని ప్రశ్నిస్తే, అలాంటి కాలం లేదనే చెప్పాలి. సంఘటనలు ఈ దృశ్యప్రపంచంలోనే వీలవుతాయి. దీనికి వేరైన, విభిన్నత్వం లేని, సంఘటనలు లేని చోట కాలం ఉంటుందా? గాఢనిద్రలో విభిన్నత్వం లేదు, సంఘటనలు లేవు, కాలం లేదు. ఎదో ఒక దాన్ని గురించి దీర్ఘంగా ఏకాగ్రతతో ఆలోచించే వారికి కూడ, భిన్నత్వం లేకుండటం వల్ల కాలగతి తెలియదు. అంటే కాలం నిలిచిపోతుంది. మనం కాలాన్ని గంటలు, నిమిషాలు అని విభజించాం కాని, కాలపరిమితి అందరికీ ఒక్కలాగ ఉండదు. ఎన్నో రోజుల తరువాత కలుసుకున్న ప్రేమికులకు గంటలు నిమిషాలలాగా గడిచిపోతాయి. ప్రియుడిని బాసిన ప్రేయసికి, ప్రతి నిముషం ఒక యుగంగా అనిపిస్తంది. చలన చిత్రాన్ని చూసేటప్పుడు కాలానికి ఉన్న వేగం పాఠ్య పుస్తకాలు చదివేటప్పుడు ఉండదు. ఏకాగ్రతలో, ఆనందానుభవంలో గడియారాలు చూపించే కాలం పరుగెత్తినట్లు అనిపిస్తుంది, నిరీక్షణలో, దుఃఖానుభవంలో గడియారాలు చూపించే కాలం కదలనట్లు అనిపిస్తుంది. కాలం ఊహ మాత్రం, మనోకల్పితం. దానికి స్థిరత్వంగాని, అస్థిరత్వంగాని లేదు.

-

మార్పులు జరుగుతున్నా ఈ ప్రపంచంలో ఆ మార్పులను గ్రహించి, నిర్దేశించగల మారని ఆధారం ఒకటి ఉండాలని చెప్పుకున్నాం. అట్లా కాక మారుతున్న ఆధారం మీద ఉండి, మరొక మారుతున్న వస్తువును చూస్తుంటే కలిగే జ్ఞానం నిజమైనది కాదు – అది మిథ్యా జ్ఞానం.


మనం కదులుతున్న ఒక రైలుబండిలో కూర్చుని, అదే వేగంతో మన పక్క లైనుమీద మనం వెళ్తున్నవైపే వెళ్తున్న మరొక రైలుబండిని చూస్తే, అది కదులుతున్నట్లే ఉండదు. అందులోని ప్రయాణీకులతో మాట్లాడవచ్చు, చేతులు కలపవచ్చు. ఒక బండినుంచి మరొక బండిలోకి మారవచ్చు. ఏ కారణం వల్లనైనా మన బండి ఒకేసారి ఆగిపోతే, మన పక్కనున్న బండి మహావేగంతో ముందుకు వెళ్తున్నట్లు కనబడుతుంది, లేదా మనం కూర్చున్న బండి మహావేగంతో వెనకకు పోతున్నట్లు కనబడవచ్చు.


మన బండి వేగంగా ముందుకు వెళ్తున్నా, మన పక్క లైనుమీద ఉన్న బండి మనకన్నా వేగంగా మనం వెళ్తున్న వైపుకు వెళ్తుంటే, ఆ బండినే చూస్తున్న మనకు, మన బండి వేగంగా ముందుకు పోయే బదులు నెమ్మదిగా వెనుకకు పోతున్నట్లు అనిపిస్తుంది. ఈ అనుభూతి ఎంత సహజంగా ఉంటుందంటే, మన బండిలోని ప్రయాణీకులందరూ, ముందుకు పోవలసిన బండి వెనుకకు ఎందుకు పోతున్నదని భ్రాంతి చెందుతారు. ఇంతలో మన ప్రక్కన ఉన్న బండి మన బండిని దాటుకుంటూ ముందుకు పోయి ఆఖరి పెట్టె కూడా మనని దాటిపోయి, లైను పక్కన ఉన్న చెట్లు కనిపించగానే, అప్పటి వరకు వెనుకకు పోతున్నట్లు అనుభూతి కలిగించిన బండి ఒక్క కుదుపుతో ముందుకు మహావేగంగా పోతున్నట్లు తెలుస్తుంది. మన మనసులో ఆ ‘కుదుపు’ కూడా అనుభవానికి వస్తుంది.

రెండు లైన్ల పక్కన భూమి మీద కదలకుండా నిలబడి రెండు బండ్లను చూస్తున్న వ్యక్తికి, ఈ రెండు షరా వేగంతో ఒక దానిని ఒకటి దాటుకుంటూ వెళ్ళిపోవటం కనిపిస్తుంది. ఇందులో ఏది సత్యం? ఎవరి అబుభవం నిజమైనది? భూమిమీద కదలకుండా నిలబడి రెండు బండ్లను చూసినవాడి అనుభవమే నిజమని మనం చెప్పగలం. కాని, బండిలోనే కూర్చుని, మన కళ్ళతో మనం చూసి, ఏర్పరచుకున్న అనుభవం? అది అసత్యమా!

తాము చూసినదే నిజమని నమ్మేవారికి, అది నిజంగానే తోచుతుంది. వారి అనుభవానికి వేరైన నిజం ఇంకొకటి ఉన్నదని చెప్పినా వారు గ్రహించలేరు, గ్రహించటానికి ప్రయత్నించరు. కాని ఆ విధంగా ప్రయత్నించి, ఏది నిజమో తెలుసుకునేవారికి, తార్కికంగా ఆలోచించటం వల్ల అందులోని నిజానిజాలు తెలుసుకోగలరు. నిజం తెలిసిన తరువాత తన అనుభూతి వెనుకకు పోతున్నట్లు చెప్తున్నా, తన విచక్షణా జ్ఞానం తాను ముందుకే వేగంగా పోతున్న సత్యం చెప్తుంటుంది. అందువల్ల నిజం తెలుసుకోలేని మిగిలిన ప్రయాణీకులు ఆందోళనపడినట్లు, తాను ఆందోళన చెందక నిశ్చితంగా ఉంటారు. మిగిలినవారి అజ్ఞానానికి తనలో తానే నవ్వుకుంటారు.

(ఇంకావుంది)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!