బమ్మెర పోతన!

బమ్మెర పోతన!

-


బమ్మెర పోతన సహజ పాండిత్యుడు, సద్గుణ సంపన్నుడు, వినయ విద్యా వివేక వినిర్మల త్రివేణీ సంగమ స్నాతుడు, శ్రీ రామ పాద సేవార్చనా దురంధరుడు ఐన బమ్మెర పోతన మహానుభావుడు సంస్కృతం లోని భాగవతమును తెలుగులోకి అనువదించినవాడు మాత్రమే కాదు..శ్రీ కృష్ణ లీలామృత భాగవతంను సంస్కృతం తరవాత దేశ భాషలలోనికి అనువదించడం ఈయనతోనే ప్రారంభం ఐంది. సంస్కృత భాగవతం తొలిగా తెలుగులోకి అనువదింప బడిన తర్వాతనే ఇతరదేశ భాషలలోకి అనువదించడం మహానుభావులు ఎందరో మొదలు బెట్టారు.


భక్తి వేదాంత తత్త్వంలో ప్రసిద్ధుడు అగ్రగణ్యుడు అని భావింప బడేకృష్ణ చైతన్యులు వంగ దేశంలో క్రీ.శ.1485 నుండి 1533 వరకూ జీవించినవాడు.ఆసేతు హిమాచలం పర్యటించిన కృష్ణ చైతన్యుడు పోతన వారి భాగవతంచేత ముగ్దుడైనాడు. చైతన్యుడు తెలుగు దేశానికి వచ్చినట్లుగా గుర్తుగా మంగళగిరి లో ఆయన పాదుకలు చెక్కబడి వున్నాయి. ఆతర్వాతి వాడైన మరొక మహానుభావుడు వల్లభాచార్యుల వారు తెలుగు బ్రాహ్మణుడు, ప్రత్యక్షంగా పోతన భాగవతం చేత ప్రభావితుడుఐన వాడు. చత్ర పతి శివాజీ మహారాజు గురువు, శ్రీ రామ, ఆంజనేయ సాక్షాత్కారం పొందినమహా ఉపాసకుడు, సమర్ధ రామదాసు మహారాష్ట్ర నుండి ప్రత్యేకంగా వచ్చి మరీ పోతనఆంధ్ర మహాభాగవతాన్ని విన్నాడు, పులకించి పోయాడు, ఈ విషయాలను ఆయనతన 'దాస బోధ' అనే గ్రంధం లో పేర్కొన్నాడు.


కౌండిన్య గోత్రము, అపస్తంభ సూత్రము నకు చెందిన వాడనని, కేసన, లక్కమాంబల పుత్రుడనని, తిప్పన తమ్ముడనని పోతన గారు తన ఆంధ్ర మహా భాగవత అవతారికలో చెప్పుకున్నారు.పురాణం హయగ్రీవ శాస్త్రి గారు, వావిలికొలను సుబ్బా రావు గారు, కందుకూరి వీరేశ లింగం పంతులు గారు ప్రభ్రుతులు పోతన రాయల సీమ లోని వొంటి మిట్ట వాడని భావించినా తర్వాత తమ అభిప్రాయములను మార్చుకున్నారు. ఆ తర్వాత మరికొందరు చారిత్రక పరిశోధకులు, సాహిత్యపరిశోధకులు, ప్రసిద్ధులు ఐన కొమర్రాజు లక్ష్మణ రావు గారు, శేషాద్రి రమణ కవులు, అనుముల సుబ్రమణ్య శాస్త్రి గారు, నిడదవోలు వేంకట రావు ప్రభ్రుతులు సాహిత్య, చారిత్రక, శాసనముల ఆధారములతో గుముదూరు శాసనంలో పేర్కొన బడిన వరంగల్ సమీపంలోని బమ్మెర గ్రామమే పోతన గారి జన్మ స్థలం అని నిర్ధారించి ఈ చర్చకు ఆంధ్ర దేశంలోని పండితులందరూ ముగింపు పలికారు. అంతే కాదు పోతన గారి ఆంధ్ర మహాభాగవతం లోని మిగిలిన భాగాలను పూరించిన వెలిగందల నారయ, ఏర్చూరి సింగన, గంగనలు కూడా వరంగల్ చుట్టు ప్రక్కలి ప్రాంతములకు చెందిన వారే అని నిరూపించారు. పోతనకు ప్రౌఢ సరస్వతి అని బిరుదు పొందిన కుమారుడు, అతని కుమారులైన కేసన, మల్లన సోదరులు (వీరు దాక్షాయణీ పరిణయం అనే గ్రంధ రచన చేశారు). బమ్మెర వారి యింటి ఆడ పడుచును పెండ్లి చేసుకున్న అజ్జరపు పేరయ లింగ కవి(ఇతను ఒడ నంబి విలాసం అనే వైష్ణవ భక్త శిఖామణిగురించిన గొప్ప గ్రంధం వ్రాశాడు)..ఇలా పోతన అనంతరం కూడా ఆ భక్తి, పాండిత్య విశేషాలు ఆయన వంశీకులకు సంప్రాప్తించాయి..వీరందరూ కూడా వరంగల్ ప్రాంతం వారే కావడం గమనార్హం.


పోతన కాలం గురించి రక రకాల పరిశోధనలు, వ్యాసాలూ వెలువరించిన ఈ వ్యాసంలో పైన పేర్కొనబడిన వారు అందరూ పోతన పదిహేనవ శతాబ్దమునకు చెందిన వాడని అంగీకరించారు. ఈ చిన్ని వ్యాసంలో పోతన ఆంధ్ర మహాభాగవత విమర్శ సాధ్యం కాదు గనుక క్లుప్తంగా చెప్పడం కోసం ఒక ఆధ్యాత్మిక, వేదాంత గ్రంధాన్ని సర్వ జనరంజకంగా, అద్భుతమైన పద గుంభనతో, లలితమైన పద విన్యాసంతో, భక్తి, పాండిత్యం, చమత్కృతి, భావుకత్వం నిండిన సంగీత మాధుర్యం పండిన కవన శైలితో తీర్చి దిద్దిన మహానుభావుడు పోతన.


తెలుగు పద్యానికి అత్యున్నత ఉదాహరణపోతన కవిత్వం. సంస్కృతంలో ఆది శంకరుడు తెలుగులో బమ్మెర పోతనలకు మాత్రమే సాధ్యమైన శైలి ఇది. మహానుభావులైన నన్నయ, తిక్కన, ఎర్రనలు, శ్రీనాధ మహాకవి, పెద్దన, రాయలు,భట్టు మూర్తి, తెనాలి రామ కృష్ణుడు, పింగళి సూరన, చేమకూర వేంకటకవి.. ఎందరున్నారు..ఎంతని పొగడ గలము..


ఆంధ్ర సాహిత్య సరస్వతీ పద నూపుర ధ్వనులెంత మధురిమలు? ఐనా..వచన రచనకు పోతనకు మించిన వారు ఎవరూ లేరు..నైమిశారణ్య వర్ణనం, నృసింహ ఆవిర్భావ ఘట్టం, వైకుంఠ వర్ణనం, రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణి వర్ణనం, ద్వారకా పురి వర్ణనం, ఇలా ఆంధ్ర మహా భాగవతం మొత్తం అద్భుతమైన వచన రచనా విలాసంతో నిండి వున్నది.ఇక పద్య రచనా విధానం పొగడడానికి ఉద్గ్రంథా లౌతాయి. పద్యాలతో వర్ణ చిత్రాలు, భావ చిత్రాలు, చలన చిత్రాలు,నిశ్చలన చిత్రాలు, కుడ్య చిత్రాలు, మణిమయ సువర్ణ సౌధాలు..నిర్మించిన వాడు పోతన! భీష్మ ఘట్టం మొత్తం అద్భుతమైన వర్ణ చిత్రం. దశమ స్కంధం సాంతం నిరుపమానమైన భావ చిత్రం. వామన ఘట్టం లో ఎదుగుతున్న వామనుడిని 'ట్రెంచ్' షాట్లో చూపించాడు. గజేంద్ర మోక్షణం లో వైకుంఠ పురిని జూమ్ లెన్స్ లో చూపించాడు !


అద్భుతమైన కుడ్య చిత్రాలుగా, నిశ్చలన చిత్రాలుగా తమ ప్రణయ, దాస్య భక్తిలో నిశ్చేష్టులైన రుక్మిణి, ప్రహ్లాదుడు, నారదుడు, కుంతీ, కుచేలుడు,ఉద్ధవుడు, అర్జునుడు, గోపికలు..వీరందరి నవరస భావ ప్రకటనలతో కూడిన వర్ణ చిత్రాలుగా ఆయా ఘట్టాలను ఆవిష్కరించాడు! తెలుగు కవులలో భక్తికి గానీ,పాండిత్యానికి గానీ, వేదాంతానికి గానీ, నిజాయితీ తో కూడిన అత్మాభిమానానికి గానీ, వినయంలో గానీ,విచక్షణ లో గానీ, మృదువైన, మెత్తనైన, సంగీతమయమైన. ఆర్ద్రమైన, ఆనందాంబుధిలో ముంచెత్తే అమర భాగీరధీ ప్రవాహ సమాన పవిత్రతలో గానీ.. పోతన ను మించిన వారు లేరు, రారు!

Comments

  1. అయ్యా, పోతన గారి పద్యాలు చదవడానికి ఓ మంచి పుస్తకం చెప్తారా

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!