కీచక వధ- మొదటి భాగం - (విరాట పర్వము ద్వితీయాశ్వాసము)

కీచక వధ- మొదటి భాగం -

(విరాట పర్వము ద్వితీయాశ్వాసము)

-

ధర్మరాజు విరాటరాజు కొలువులో ధర్మప్రసంగములు చేస్తూ, జూదక్రీడతో కాలం గడుపుతూ అందులో అర్జించిన ధనం తమ్ములకిస్తూ కాలం గడుపుతున్నాడు.

భీముడు రాజుకు రుచిగా వండిపెడుతూ మిగిలిన ఆహార పదార్ధములను అన్నదమ్ములకిస్తూ కాలం గడుపుతున్నాడు. 

అర్జునుడు తన కళాప్రదర్శనలలో గడించిన బహుమతులు అన్నదమ్ములకిస్తూ కాలం గడుపుతున్నాడు. 

నకులసహదేవులు తమ విధి నిర్వహణలో అర్జించిన

ధనాన్ని అన్నదమ్ములకిస్తూ కాలం గడుపుతున్నారు.

ఆ విధంగా నాలుగు నెలలలు గడిచాయి.


కీచకుడు ద్రౌపదిని చూచుట!


అజ్ఞాతవాసం ప్రశాంతంగా కొన్నిరోజులలో ముగుస్తున్న సమయంలో విరాటుని బావమరిది కీచకుడు అంతఃపురంలో అక్కను చూడటానికి వచ్చి యాదృచ్ఛికంగా ద్రౌపదిని చూసాడు.

కీచకుడు మంచి అందగాడు, బలవంతుడు, కాని వివేక హీనుడు. అతడికి బలగర్వం, సౌందర్య గర్వం ఎక్కువ. అతడు విరాటరాజు కొలువులో దండనాయకుడు.

కీచకుడు ద్రౌపది అందానికి ఆశ్చర్యపోయి ఆమె నుండి చూపులు మరల్చుకోలేక పోయాడు. అతడు మనసులో " అహా! మానవులు ఎవరైనా ఇంతటి అందగత్తెను చూసి ఉండరు. ఇంతటి అందగత్తె మన్మధుని వద్ద ఉంటే ఆనాడు అతడు శివుని కూడా జయించే వాడు కదా. బ్రహ్మదేవుడు మన్మధుని అయిదు బాణాలు కలిపి ఈమెను సృష్టిండో ఏమో. మన్మధుడు కూడా విరహతాపంలో వేగిపోతాడేమో. ఈ సుందరాంగి తల్లితండ్రులు ఎవరో, అదృష్టవంతుడైన భర్త ఎవరో, పేరు ఏమో, ఈమెను పొందే మార్గమేమిటో, ఈ పనికి ఎవరు నాకు సాయపడగరు " అని పరిపరి విధాల ఆలోచించాడు. 

మాసిన చీర ధరించిన ద్రౌపది అతని వికారపు చూపులకు అసహ్యించుకుంది. ఆమె మనసులో " ఇతడు ఏమిటి ఇలా చూస్తున్నాడు. 

ఇప్పుడు నన్ను ఇతని నుండి రక్షించే దిక్కెవరో " అనుకున్నది. కీచకుడు అదేమి పట్టించు కోకుండా ఆమె చూపులను చూసి శృంగార చేష్టలని అపోహ పడ్డాడు. పక్కనే సుధేష్ణ, పరిచారికలు చూస్తున్నా పట్టించుకోకుండా ఆమె వైపు మోహంతో తధేకంగా చూసాడు. తరువాత తేరుకుని అక్క సుధేష్ణకు నమస్కరించాడు. ఆమె అతనికి ఉచితాసనం చూపించింది.

కీచకునికి సుధేష్ణ బుద్ధిమతి చెప్పుట

కీచకుని మాటలు విన్న సుధేష్ణ " నేను అనుకున్నంత అయింది. ఈ సైరంధ్రిని చూసి కీచకుడు మోహావేశంలో పడ్డాడు. వీడికి ఏమి కీడు మూడుతుందో? వద్దన్నా వినే వాడు కాదు. నేనేమి చేసేది? నా శక్తి వంచన లేకుండా చెప్పి చూస్తాను " అనుకున్నది. . 

" తమ్ముడా కీచకా! పరస్త్రీ సాంగత్యం వలన నీ ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి హరింపబడతాయని తెలియదా? ధర్మాత్ములు దీనిని హర్షించరు. భర్తకు తెలిస్తే ప్రాణం మీదకు వస్తుందని, ఇతరులు చూస్తే పరువు పోతుందని, సాటి ఆడువారికి తెలిస్తే గౌరవం పోతుందని, బంధువులకు తెలిస్తే వంశనాశనం ఔతుందని క్షణ క్షణం భయపడుతూ, భయపడుతూ, వ్యధతో ఉండే పరస్త్రీతో ఏమి సుఖపడతావు. జారిణితో పొందు సుఖం కాదని అందరూ దూరంగా ఉంటారు. ఆమె భర్తలు గంధర్వులు వాళ్ళ చేతిలో నీవు మరణించవచ్చు. దానిని మర్చిపోరా తమ్ముడూ. చెడు మార్గలో చరించే వారికి వినాశనం తప్పదు నీ లాంటి బుద్ధి మంతులకు ఇది తగదు " అన్నది సుధేష్ణ. అక్క చెప్పిన మాటలు కీచకుని చెవికెక్క లేదు. 

" ఓ సుధేష్ణా! ఒక్క మాట చెప్తున్నాను విను. ఈ భూలోకంలో నన్ను ఎదిరించి నిలువగల వీరుడు లేడు. నా బాహుబలంతో గంధర్వాదులను సంహరించగలను. కనుక నాకు బుద్ధి చెప్పుట మాని నా కోరిక మార్గం సుగమం చెయ్యి " అని వంగి అక్క పాదాలకు నమస్కరించాడు. సుధేష్ణ " ఇక వీడు ఏమి చెప్పినా వినడు. వీడికి ఆమెను జతచేస్తే సరి. ఆమె భర్తలైన గంధర్వుల చేతిలో చస్తాడు. లేకున్న మన్మధుడి చేతిలో చస్తాడు. ఎలాగైనా వీడికిక చావు తధ్యం " అనుకున్నది సుధేష్ణ.


సుధేష్ణ మాలినిని కీచకుని ఇంటికి పంపుట!


సుధేష్ణ కీచకుని మంకుపట్టు గ్రహించి " తమ్ముడా కీచకా! ఎందుకు ఆరాట పడతావు. ఆమెను నీ వద్దకు పంపుట కష్టం కాదులే నీవు వెళ్ళు సైరంధ్రిని నీ వద్దకు పంపుతాను ఆ తరువాత నీ ఇష్టం " అన్నది. అక్క మాటలు విన్న కీచకుడు సంతోషంతో తన మందిరానికి వెళ్ళాడు. విందు భోజనం సిద్ధం చేసాడు, మధుర రసాలు ఏర్పాటు చేసాడు, పని వారందరిని పంపివేసాడు చేసాడు. తన మందిరంలో ఎవరూ లేకుండా చూసుకుని అందమైన ప్రదేశంలో కూర్చుని సైరంధ్రి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు.

సుధేష్ణ సైరంధ్రిని పిలిచి " మాలినీ! నాకు చాలా దాహంగా ఉంది. నా తమ్ముని కీచకుని ఇంట్లో రుచికరమైన మధ్యం ఉంది తీసుకురా " అన్నది 

ఈ మాటలు విన్న ద్రౌపది మనసు తల్లడిల్లింది. ఆమెకు శరీరం నిండా చెమట పట్టింది. ఈ ఆపద నుండి ఎలా గట్టెక్కాలా అని భగవంతుని ప్రార్థించింది. ద్రౌపది 

" అమ్మా! నన్ను వదిలి పెట్టు. మధిరను తీసుకురావటానికి వేరొకరిని పంపు. నేను మీకు నీచపు పనులు చేయనని చెప్పాను. మీ గృహం అతి నిర్మలమయినదని నా భర్తలు దూరంగా ఉన్నా మిమ్ము నమ్మి మీ ఇంట ఉన్నాను. మిమ్ము నమ్మిన నా వంటి అనాధను ఇలాంటి నీచపు పనులకు పంపడం భావ్యమా " అన్నది. 

సుధేష్ణ " మాలినీ! నేను మనసు పడి త్రాగాలని మధ్యం తేవడానికి నిన్ను పంపుతున్నాను. ఇందుకు నీచజాతి వారిని పంపగలనా.

మన స్నేహం ఇంతేనా అని తెలియకుంది " అని నిష్టూరంగా మాట్లాడింది. దేవుని మీద భారం వేసి ద్రౌపది కీచకుని ఇంటికి బయలుదేరింది. 

దారిలో ఆమె సూర్యునికి నమస్కరించి 

" ఓ సూర్య భగవానుడా! నేను పాండు పుత్రులను తప్ప అన్యులను మనసునైనా తలపనేని నాకు ఈ కీచకుని వలన ఎటువంటి ఆపద కలగ కుండా కాపాడు " అని ప్రార్థించింది.

సూర్యుడు కరుణించి ద్రౌపదికి రక్షణగా ఒక రాక్షసుని పంపాడు. 

అతడు అదృశ్య రూపంలో ద్రౌపదిని వెన్నంటి వస్తున్నాడు.

ద్రౌపది తడబడే అడుగులతో కీచకుని ఇంట ప్రవేశించింది. 

కీచకుడు ఆమె రాకకోసమే ఎదురు చూస్తున్నాడు.!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!