Friday, February 9, 2018

వివేకచూడామణి (15వ, 16వ భాగాలు ) !.

వివేకచూడామణి (15వ, 16వ భాగాలు ) !.

-

శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.

-

15.మాయ :

అలా అయితే మన నిజతత్త్వమైన ఆ బ్రహ్మాన్ని మనమెందుకు తెలుసుకోలేకపోతున్నాం? దానికి కారణం ‘మాయ’ అంటారు. అప్పుడప్పుడు తనను తాను మరిచిపోయే శక్తి కూడ బ్రహ్మంలో ఉన్నది. అదే మాయాశక్తి. దానిని ‘అవిద్య’ అని కూడ అంటారు.

ఆ ‘మాయ’ తామసం, రాజసం, సాత్వికం అనే మూడు గుణాలతో కూడుకుని ఉన్నది. తామసానికి నిజాన్ని మరగుపరచే గుణం ఉన్నది. ఆ గుణంవల్ల మన నిజతత్త్వమేమిటో మనం మరచిపోతాం. ఆ గుణాన్ని ‘ఆవరణ శక్తి’ అంటారు, మన నిజతత్త్వాన్ని మరిచిపోగానే రజోగుణంలోగల ‘విక్షేపశక్తి’ మన నిజతత్త్వం మరిచిపోయిన మనలో ‘నేను అనంతమైన బ్రహ్మతత్త్వాన్ని కాను, పరిమితమైన జీవుడను’ అనే భావం ప్రతివారిలో కలుగచేస్తుంది. తాను పరిమితమైనవాడని, ఈ ప్రపంచమంతా తనకు భిన్నమైనదని ఊహ ఎప్పుడు జన్మించిందో, అప్పుడే భయాలు, ఆందోళనలు, అలజడులతో కూడిన మనసు జన్మిస్తుంది. ఆ ‘మనసు’ ద్వారా బయటకు చూసినప్పుడు ఏకరసంతో కూడుకున్న విశ్వమంతా, విభిన్నత్వంతో కనిపిస్తుంది. అప్పుడు ‘నేను వేరు’ అనే భావం స్థిరపడి కొన్నిటిలో ‘ఇవి నావి’ అనే భావం కూడ కలిగిస్తుంది. ఈ అహంకార, మమకారాలు ఈ విశ్వాన్ని మరికొంత భిన్నం చేశాయి. మన నిజతత్త్వంలో లేని వాంఛ, భయ, మోహాలను సృష్టించింది. ద్వంద్వ భావాలను కలుగచేసింది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను మనోవృత్తులను కలుగచేసింది. ఇవన్నీ మనసు చేసిన సృష్టి. ఈ మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ మాయ వల్ల కలిగినవే.

ఈ మాయవల్ల కల్పించబడ్డ మూడుగుణాల ప్రోద్బలం వల్ల మనిషి ఈ ప్రపంచంలో ప్రవర్తిస్తుంటాడు. మంచిచెడ్డలను అనుభవిస్తుంటాడు.

సుఖ దుఃఖాలను అనుభవిస్తుంటాడు. చనిపోయిన తరువాత, కర్మఫలవశాన తిరిగి పుడుతుంటాడు.

‘వ్యక్తి’స్థాయిలో ఈవిధంగ జరుగుతుండగా, జగత్తుస్థాయిలో కూడ మాయాప్రభావం వల్ల బ్రహ్మంలోని ఒక ‘అంశ’ (తన నిజతత్త్వాన్ని మరిచిపోయి), ఈ జగత్తుకు కారణరూపుడైన ‘హిరణ్య గర్భుడి’గా (విశ్వమనసుగా) తరువాత ‘విరాట్ స్వరూపుడిగా’ (దృశ్య జగత్తుకు) మారుతుంది. జీవుడికి, శరీరం, మనసు, బుద్ధి ఎటువంటివో, ఈశ్వరుడికి విరాట్ స్వరూపం, తైజసం, ప్రాజ్ఞం అటువంటివి. ఆ మూడు కలిసిన మహాపురుషుడు ఈశ్వరుడు.

ఈ మాయాకల్పిత సృష్టికార్యం, బ్రహ్మతత్త్వం అంతా ఆక్రమించి ఉండనక్కరలేదు. మహాసముద్రంలోని ఒక అలలాగ, ఎక్కడో ఒకచోట ఉండవచ్చు. మిగిలిన బ్రహ్మతత్త్వమంతా నిర్వికారంగా ఉండవచ్చు. లేక, సముద్రంలోని కొన్ని అలలలాగ, ఇటువంటి జగత్తులు ఎన్నైనా ఉండవచ్చు. ఎన్ని ఉన్నా బ్రహ్మతత్త్వం అనంతం, కాబట్టి దానిలో ఎటువంటి మార్పు రాదు.

అంతకుముందు చెప్పుకున్న ఆత్మతత్త్వానికి, బ్రహ్మతత్త్వానికి భేదం లేదు. మాయకు లోనై ఒక ఉపాధిని (ఒక శరీరాన్ని) ఆశ్రయించుకుని ఉన్న (బ్రహ్మతత్త్వం) ఆత్మతత్త్వమే ప్రత్యగాత్మ. ఈ విశ్వమే ఉపాధిగాగల ఈశ్వరుడు సర్వాత్మ, ఎటువంటి ఉపాధి లేనిది పరమాత్మ. పరమాత్మకు, పరబ్రహ్మానికి భేదం లేదు.

దీనిని బట్టి ఈ సృష్టి అంతా బ్రహ్మతత్త్వమే అయినా, మాయవల్ల నిజం మరుగుపడి, వేరే విధంగా కనపడుతున్నదని చెప్పవచ్చు. అంతేకాక ఈశ్వరుడు, జీవుడు ఇద్దరు బ్రహ్మతత్త్వం కలవారే, ఇద్దరు కూడా మాయకులోనై ఉన్నవారే అని, వారి వారి ఉపాధుల తరతమ భేదాల వల్ల అల్ప, అధిక రూపాలలో కనిపిస్తున్నారని కూడా చెప్పవచ్చు.

-

16.సృష్టి – మాయావాదం :


ఈ మాయావాదం వల్ల సృష్టి అనే పదానికి నిర్వచనమే మారిపోయింది.

వివిధ మతసిద్ధాంతాల ప్రకారం, సృష్టి భగవంతుడి ఇష్టపూర్వక కార్యం. ఈ లోకాలను సృష్టిస్తానని అనుకుని, భగవంతుడు తనలోనుంచే – సాలె పురుగు తననుంచి వచ్చే పదార్థంతోనే సాలెపట్టును నిర్మిస్తున్నట్లు, ఈ సమస్త జగత్తును సృష్టించాడు. మళ్ళీ కల్పాంతరంలో ఈ సర్వం తనలో లయపరచుకుంటాడు. ఈ మధ్యకాలంలో ఈ జగత్తంతటికి తానే అధిపతి, నియంత, ప్రభువు. ఈ మతాలవారు మాయ ఉన్నదని ఒప్పుకున్నా, మాయ కూడ భగవత్కల్పితమే. దాని వల్ల భగవంతుడు లోకాలనుంచి తన నిజతత్వాన్ని మరగుపరుస్తాడని, ఎవరు తనను అనన్యభక్తితో సేవిస్తారో, వారిని మాత్రం ఈ మాయ నుంచి తరింపచేసి, తనవద్దకు చేర్చుకుంటాడని భావిస్తారు.

మరొక సిద్ధాంతం ప్రకారం సృష్టికి ముందుగల ఆదిశక్తి (శివ శక్తి) సృష్టికార్యం ఆరంభమవటానికి ముందు ప్రకృతి (స్త్రీ శక్తి)గా, పురుషుడు (పురుష శక్తి)గా విడిపోయి, ఆ రెండిటి సంయోగంవల్ల ఈ విశ్వమంతా, అందులోని జీవరాసులన్నీ, పుట్టాయని, తిరిగి కల్పాంతంలో ఇవన్నీ ఆదిశక్తిగా మారిపోతాయని చెప్తారు.

కొందరు నిరీశ్వరవాదులు, మూలప్రకృతి కొన్ని అంతర్గత శక్తులవల్ల విభిన్న రూపాలుగా మారినదని, ఈ మార్పు ప్రకృతికి సహజమని, ఇందులో ఎప్పుడు ఏమి జరుగుతుంటుందో చెప్పటం కష్టమని, ఈ నిరంతర పరిణామ స్థితికి ఆది, అంతం లేదని చెప్తుంటారు.

కాని అద్వైతవేదాంత సిద్ధాంతం ప్రకారం, పూర్వం, ఇప్పుడు, ఇక ముందు కూడ ఉండేది మార్పులేని అఖండమైన బ్రహ్మతత్త్వమే అని, సృష్టి అన్నది జరగనే లేదని, ఈ బ్రహ్మతత్వమే అయిన మనం, మాయవల్ల కల్పించబడిన ఒక భ్రాంతిలో పడి, మన నిజతత్త్వం మరచిపోయి, ‘నేను వేరు’ అనుభవంతో, ఆ బ్రహ్మతత్త్వాన్ని చూస్తుండటం వల్ల, ఆ అఖండ బ్రహ్మతత్త్వమే, విభిన్నమైన బ్రహ్మాన్ని తెలుసుకున్నంతనే, మాయవల్ల కలిగిన ప్రపంచమనే భ్రమ తొలగిపోయి, అంతటా అఖండ అద్వైత బ్రహ్మతత్వమే అనుభవానికి పస్తుందని చెప్తారు.

ఇది సంభవమని చెప్పటానికి దృష్టాంతంగా తాడును చూసి పామనుకోవటం, చెట్టు మొద్దును చూసి దయ్యమనుకోవటం, ఎండమావులను నీరనుకోవటం, స్వప్నప్రపంచాన్ని యదార్థమనుకోవటం, ఈ విధంగా ఎన్నో భ్రాంతి జనిత సన్నివేశాలను (దృష్టాంతాలుగా) చూపిస్తారు.

పై ఉదాహరణలన్నిటిలో, అసలు వస్తువు నిజతత్త్వం తెలియకపోవటంవల్ల, దానిని వేరొక వస్తువుగా ఊహించి, అదే నిజమని భావించటం జరుగుతున్నది. ఈ ప్రక్రియను ‘అధ్యాసము’ అంటారు. ఒక వస్తువుపై ఇంకొక వస్తువు అనే భావాన్ని ఆరోపించటం ‘అధ్యాస’ అనబడుతుంది. ఆ అధ్యాసభావం తొలగిపోగానే, వస్తువు నిజతత్త్వం తనంతటతానే మేఘాలు తొలగిపోయిన తరువాత సూర్యుడిలాగ తెలుస్తుంది. ఆ విధంగనే, ‘నేను పరిమితమైన జీవుడను’ అనే భ్రమ తొలగిపోగానే, తన నిజతత్త్వమైన బ్రహ్మభావం తనంతట తానే అనుభవానికి వస్తుంది. అ అనుభవంలో జీవుడు లేడు. శరీర మనోబుద్దులు ఉండవు. ఈ బహుళ ప్రపంచం ఉండదు. అంతా అవిచ్ఛిన్న, అఖండ, అద్వైత బ్రహ్మమే. ఆ అనుభవం పరమానందకరమైనది.

ఈ సిద్ధాంతానికి ఎన్నో శ్రుతులను (ఉపనిషత్తులను) ప్రమాణంగా చూపిస్తారు. అంతేకాక, గాఢనిద్రలో అందరి అనుభవం ఒక్కలాగే ఉంటుంది. ఆ అనుభవంలో జాతి, కుల, ధర్మ, ఆశ్రమ, వయో భేదాలు లేవు. అది ఒక అనిర్వచనీయమైన దుఃఖరహితమైన పరిస్థితి. కాని ఆ సమయంలో మన జ్ఞానం మరుగుపడి ఉండటమువల్ల, ఆ అనుభవాన్ని మనం చెప్పలేకపోతున్నాం. ఆ విధంగనే, ఏ మతంలోనైనా, మహాత్ములు అనుభవించే సమాధిస్థితిలో అనుభవం ఒక్కలాగే ఉంటుందని, వారి మాటలవల్ల తెలుసుకోగలం. ఆ స్థితిలో వివిధత్వం ఉండదని, అది ఒక పరమశాంతమైన, అనిర్వచనీయమైన ఆనందానుభవమని, అక్కడ కాల, స్థల, కారణాలు లేవని కూడ చెప్తుంటారు.

-

-ఇంకావుంది -

-

No comments:

Post a Comment