వివేకచూడామణి (5) .

వివేకచూడామణి (5) .

-

శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.


-

5. బాహ్యప్రపంచ వస్తుతత్త్వం :

ఈ బాహ్యప్రపంచపు వస్తుతత్త్వం ఏంటి? ఈ విషయం ఆలోచించినప్పుడు, మన శరీరం కూడ ఈ బాహ్యప్రపంచానికి సంబంధించినదే అని రెండిటిలో వస్తుతత్త్వం ఒక్కటే అని గ్రహించటం ముఖ్యం.

ఈ దృశ్యప్రపంచాన్ని, మన శరీరాలతో సహా పదార్థం (Matter), శక్తి (Energy), ఆకాశం (Space) అని మనం చెప్పవచ్చు.కాలం (Time) ఈ వస్తుతత్వానికి సంబంధించినది కాదు, కాని వస్తుతత్వమగల నామ రూప సంజ్ఞారూపకమైన (పేరు, రూపం, ‘ఇది’ అని నిర్దేశించి చెప్పగలిగే గుర్తు) విభిన్న వస్తువులలో కలిగే మార్పులను తెలుసుకోటానికి ఉపయోగపడుతుంది.


మన పూర్వులు ఈ ప్రపంచాన్ని (వస్తుతత్త్వం) ఐదు భాగాలుగా నిర్ణయించి, వాటికి ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అని పేర్లు పెట్టారు. సృష్టిక్రమంలో ముందు ఆకాశం, దాని నుంచి వాయువు, తరువాత అగ్ని, ఆ తరువాత నీరు, ఆఖరిలో భూమి వచ్చిందని చెప్తారు. వీటిని పంచభూతాలు (Five Elements) అన్నారు. వీటిలో అన్నిటికన్నా సూక్ష్మమైనది ఆకాశం. అన్నిటికన్నా స్థూలమైనది భూమి.

మన శాస్త్రాల ప్రకారం, ఈ పంచభూతాలు తమ సూక్ష్మరూపంలో (తన్మాత్రలుగా) ఉన్నప్పుడు వాటి నుంచి మన ఇంద్రియాలు కలిగాయని చెప్తారు. ఆకాశం నుంచి శ్రవణేంద్రియం, వాయువు నుంచి స్పర్శేంద్రియం, అగ్ని నుంచి దృగింద్రియం, నీటి నుంచి జిహ్వేంద్రియం, భూమి నుంచి ఘ్రాణేంద్రియం పుట్టాయి. ఈ పంచజ్ఞానేంద్రియాల ద్వారా మనం ఈ ప్రపంచంలోగల ఈ ఐదు గుణాలను తెలుసుకుని (చప్పుడు, స్పర్శ, కాంతి, రుచి, వాసన) ఇదే మన ప్రపంచం అంటున్నాం.

ఈ పంచభూతాలు తమ సూక్ష్మస్థితి నుంచి ఒక దానితో ఒకటి ఒక క్రమపద్ధతిలో కలిసి పంచమహాభూతాలు అయ్యాయి. ఈ ప్రక్రియనే ‘పంచీకరణము’ అంటారు. ఈ పంచభూతాలు సూక్ష్మస్థితిలో (తన్మాత్రలుగా) ఉన్నప్పుడు అవి అవ్యక్తమయ్యాయి. ఇంద్రియాలకు కనిపించనివి. అవి పంచీకరణం చెందిన తరువాతనే దృశ్య ప్రపంచంగా మారాయి.

పంచీకరణం అంటే ఐదు అంచెలలో ఈ ఐదు భూతాలు విడిపోయి, మళ్ళీ కలవటం. ముందుగా ఒక్కొక్క భూతం రెండు భాగాలైంది. అందులోని ఒక సగం ఆ విధంగానే ఉండగా, మిగిలిన సగం నాలుగు భాగాలు అయి ఆ ఒక్కొక్క భాగం మిగిలిన నాలుగు భూతాల అర్ధభాగంతో కలుస్తాయి.


-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!