సమిష్టి !

సమిష్టి !

(కొడవటిగంటి కుటుంబరావు గారి నవల "అనుభవం"నుండి సేకరణ )

-

నేను అన్నది అన్ని భ్రమల లోకీ గొప్ప భ్రమ, 

అసలు వ్యక్తి అనేది సృష్టి లోనే లేదు ఒక పేరు పెట్టటానికి వీలైన సమిష్టికి మనం వ్యక్తిత్వం అంట గట్టుతున్నాము .

-

ఒక మనిషి ని తీసుకోండి. వాడిలో వ్యక్తిత్వం ఎక్కడున్నది ?

వాడి శరీరం లో ఎన్ని ధాతువులు ! ఎన్ని కోట్ల జీవకణాలు ! 

తమ పని తాము చేసుకుంటూ పోయే గుండెకాయ, ఊపిరితిత్తులు, గ్రంథులు, రక్త ప్రవాహం, మెదడు, నరాలు ! 

వారి జీవితాలు వాటికున్నాయి.. 

శరీరం ఓ పెద్ద ప్రపంచం, అందులో ఎన్నో జీవరాసులు, వాటివాటి ప్రత్యేక జీవితాలు. కొన్ని కొద్ది క్షణాలు మాత్రమే బతుకుతాయి.కొన్ని ఈ ప్రపంచం ఉన్నంత కాలమూ ఉంటాయి. మాటవరస కు చెబుతా.. భూదేవి అంటూ ఒకతె నిజం గా ఉన్నదే మో ! ఉండి తానొక వ్యక్తి ననుకుంటున్నదేమో …! 

ఉంటే మనకు కనిపించదా అనకండి . మన శరీరంలో ఉండే రక్త కణాలకు మనం కనిపించం. అవి నివసించే ప్రపంచం ఒక వ్యక్తి అన్నది వాటికి ఊహించరాని విషయం.


ఇంకో విషయం చూసారో లేదో.

మన లోపల ఉన్న సమిష్టత్వం మనకు చాలడం లేదు. బయటి నించి సమిష్టిత్వాన్ని వెతుక్కుంటున్నాం. 

పది మంది చేరి తమ వ్యక్తిత్వాలను కలగలుపుకున్నప్పుడే మనకు ఆనందమూ, ప్రయోజనమూ ఉంటున్నది. 

వ్యక్తిత్వాన్ని సమిష్టి లో లీనం చెయ్యటానికి నా చిన్నతనంలో భజనలు చేసేవాళ్ళు. పురాణాలు వినేవాళ్ళు. తోలు బొమ్మలాటలు చూసేవాళ్ళు. ఉత్సవాలు చేసేవాళ్ళు. 

తరవాత ఉద్యమాలు వచ్చాయి. 

ఈనాడు ఈ సినిమాలు అవీ అందుకే ఉపయోగ పడుతున్నాయి. కళలకున్న ప్రయోజనం కూడా అదే - వ్యక్తులను సమిష్టి గా రూపొందించడం …. నన్నడిగితే నిజమైన వ్యక్తిత్వం అనేది పరమాత్మ కి మాత్రమే. 

ఆ పరమాత్మ కూడా వ్యక్తిత్వం లో తృప్తి చెందలేక సమిష్టిత్వాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. ఆ కారణం చేతనే ఈ సృష్టి అంతా నడుస్తున్నది. " .

*

(ఈ చివరి వాక్యాలలో సృష్టి పుట్టుక గురించి ఆధునిక భౌతిక శాస్త్రం చేస్తున్న భావనలు ప్రతి ధ్వనిస్తున్నాయి. ఈ నవల యువ లో 1968-69 సంవత్సరాలలో ప్రచురింపబడింది.

దీన్ని ("పరమాత్మ కూడా వ్యక్తిత్వం లో తృప్తి చెందలేక సమిష్టితత్వాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. ఆ కారణం చేతనే ఈ సృష్టి అంతా…")ముఖ్య భావనగా కొన్నేళ్ళ క్రితం (2004 -5) స్కాట్ ఆడమ్స్ అనే ఆయన ఒక నవలే వ్రాసారు. (గాడ్స్ డెబ్రి - GOD’S DEBRIS అనే పేరుతో - దివ్య రేణువులు అనే అర్థం వచ్చేట్లు గా)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!