పద్యాలలో నవరసాలు - రసపట్టులో తర్కం!

పద్యాలలో నవరసాలు - రసపట్టులో తర్కం!

- భైరవభట్ల కామేశ్వర రావు

ప్రతీ రచనకూ కృత్యాద్యవస్థ అని ఒకటుంటుంది. అంటే ఒక రచనని ఎలా మొదలుపెట్టాలన్న విషయమై పడే జంజాటం. ఒక కావ్యాన్ని గాని, కథను గాని, వ్యాసాన్ని గాని ఎట్లా మొదలుపెడితే చదువరులకు బాగా ఆసక్తి కలుగుతుంది, చక్కగా అర్థమవుతుంది, మొదలైన విషయాల గురించిన ఆలోచన అన్నమాట. ప్రతీ రచయితకూ యీ అవస్థ తప్పదు. ఈ వ్యాసపరంపరకు అలాంటి కృత్యాద్యవస్థను, "కానీవోయ్ రసనిర్దేశం" అంటూ కిందటి నెల వ్యాసంతో దాటేసాం. రసమంటే ఏమిటన్న చిక్కు ప్రశ్నకు, పుల్లెల శ్రీరామచంద్రుడుగారి పుణ్యమా అని, సులువుగా టూకీగా జవాబు దొరికింది. ఇంక విషయం లోతుల్లోకి మరికాస్త వెళ్ళవచ్చు. రసాన్ని గురించి మన ఆలంకారికులు లోతైన వివేచనే చేసారు. రసానుభూతి ప్రేక్షకునికో/పాఠకునికో ఎలా కలుగుతుంది? కావ్యంలో ఎలాంటి లక్షణాలుంటే రసనిష్పత్తి జరుగుతుంది? కావ్య రసం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమిటి? - ఇలాంటి ప్రశ్నలెన్నిటినో వేసారు. వాటికి సమాధానాలను వెతికారు. రసపట్టులోని తర్కాన్ని గురించిన యీ మీమాంస, అనేక సిద్ధాంతాలకు జన్మనిచ్చింది. ఆ సిద్ధాంతాల రాద్ధాంతాలలోకి వెళితే బయటకి రావడం సులువు కాదు. మనకిప్పుడు దాని అవసరమూ లేదు. అయితే వీటి గురించి కొంత కనీస అవగాహన, అటు కవులకీ యిటు పాఠకులకీ కూడా కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి కొన్ని ముఖ్యమైన అంశాలని మాత్రం ఇప్పుడు పరిశీలిద్దాం. 

రసానుభూతి

 

రమ్యాణివీక్ష్య మధురాంశ్చ నిశమ్యశబ్దాన్

పర్యుత్సుకీ భవతి యత్సుఖితోపి జంతుః

తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం

భావ స్థిరాణి జననాంతర సౌహృదాని

 

ఒక రమ్యమైన దృశ్యాన్ని చూసినప్పుడో, మధురమైన సంగీతాన్ని విన్నప్పుడో, మనిషి ఆనందం పొందుతూనే, ఒకోసారి ఏదో తెలియని వేదనకు లోనవుతాడు. అలాంటి సందర్భాలలో, మనసు లోతులలో దాగిన యే పూర్వజన్మ స్మృతులో, అనుభూతులో, తనకి తెలియకుండానే ఉత్తేజితమవుతాయి కాబోలు! కాళిదాసు, దుష్యంతుని నోట పలికించిన శ్లోకమిది. రసానుభూతిని యింతకన్నా రమ్యంగా వర్ణించే పద్యం మరొకటి నాకు తెలీదు!

 

అసలు ప్రేక్షకునిలో లేదా పాఠకునిలో (వీళ్ళిద్దరినీ కలిపి "సామాజికుడు" అని అంటారు అలంకారశాస్త్రంలో) రసానుభూతి ఎలా కలుగుతుంది? ఆలోచిస్తే యిది చాలా చిత్రంగా అనిపించక మానదు! కల్పన అన్న విషయం తెలిసితెలిసీ, ఆ కల్పనలోని సన్నివేశానికో, సంభాషణకో, వర్ణనకో మనస్సు ఎందుకు స్పందిస్తుంది? అందులో ఎలా లీనమైపోతుంది? ఇది సాధారణ తర్కానికి అంత సులువుగా అందే విషయం కాదు. కొంత తాత్త్వికంగా ఆలోచిస్తే, అసలిది మనిషి స్వభావంలోనే మౌలికాంశమేమో అనిపిస్తుంది. తన బతుకు అశాశ్వతమనీ, మృత్యువు యే క్షణంలోనైనా వచ్చిపడుతుందనీ తెలిసి కూడా, అతనికిన్ని వ్యామోహాలూ పరితాపాలూ ఎట్లా కలుగుతున్నాయి? ఇది మనసుకున్న ఒక రకమైన "తాత్కాలికత" అనే లక్షణం అనవచ్చు. అంటే కేవలం తత్క్షణంలో జరిగే సంఘటనలకు స్పందించడం. దీనికే "మాయ" అనీ, "మోహం" అనీ యింకా రకరకాల పేర్లు పెట్టారు మన తాత్త్వికులు. అంటే అది క్షణికం, అశాశ్వతం అని అర్థం. క్షణికమైనదే అయినా, ఆ స్పందన మనిషికి అత్యంత సహజం. ఉదాహరణకి ఒక కమ్మని లడ్డూ తింటున్నాం అనుకోండి. అది నాలుక మీద ఉండే కొన్ని సెకన్లు మాత్రమే ఆ రుచి మనకి తెలుస్తుంది. ఈ విషయం మన బుద్ధికి తెలుసు. అయినా ఆ క్షణంలో అదిచ్చే తీయని అనుభూతిని మనసు ఆస్వాదిస్తుంది. కావ్యనాటకాదుల విషయంలో కూడా ఇలాంటి ప్రక్రియే జరుగుతుందని అనుకోవచ్చు. నాటకం చూస్తున్నప్పుడు కాని, లేదా కావ్యం చదువుతున్నప్పుడు కాని, ఆ క్షణంలో అది కల్పనా వాస్తవమా, శాశ్వతమా అశాశ్వతమా లాంటి ఆలోచనలు అడ్డం రావు. అందులోని సన్నివేశం మీద మనసు లగ్నమైపోతుంది. అంటే "ఏకాగ్రత" కలుగుతుంది.

 

ఇంతవరకూ బాగానే ఉంది. కాని, మనసు లగ్నమైనంత మాత్రాన రసానుభూతి కలుగుతుందా? కలగదు. రసానుభూతి కలగాలంటే దానితో మనసు "తాదాత్మ్యం" చెందాలి. అంటే, ఆ సన్నివేశంలోని పాత్రలు పొందే అనుభూతిని తాను కూడా పొందాలి. ఉదాహరణకి నాగయ్యగారు త్యాగయ్య సినిమాలో "నను పాలింప తరలి వచ్చితివో" అనో, పోతన సినిమాలో "సర్వమంగళ నామా సీతారామా" అనో పరవశంతో పాడుతూ ఉంటే, అది చూసి కొందరి మనసు భక్తిభావంతో ఉప్పొంగిపోతుంది. తాదాత్మ్యం అంటే అది. అలా తాదాత్మ్యం చెందాలంటే, ఆ చూసే వారి మనసులో, వ్యక్తంగానో అవ్యక్తంగానో భక్తి భావం ఉండి ఉండాలి. దీనినే రససిద్ధాంత పరిభాషలో "వాసన" అంటారు. కావ్యం పైన మనసు లగ్నమైనప్పుడు, అందులో ఉన్న భావాలకి అనుగుణమైన "వాసన"లు ఆ మనసులో కాని ఉంటే, అవి ఉత్తేజితమవుతాయి. అలాంటి భావనలే ఆ మనసులో కూడా జనిస్తాయి. ఈ ప్రక్రియని అలంకారశాస్త్రంలో "సాధారణీకరణం" అన్నారు. అంటే, కావ్యంలో పాత్రలను ఆశ్రయించి ఉన్న భావాలు, ఆ పాత్రల ప్రత్యేక పరిధిని దాటి, స్పందించగల ప్రతి సామాజికుని మనసులోనూ అవే భావాలు ఉత్పన్నం కావడం అన్నమాట. దీని గురించి మరింత లోతుగా ఆలంకారికులు చర్చించారు కాని అందులోకి మనమిప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు.

 

ఏతావాతా తేలేదేమిటంటే, రసానుభూతి కలగడానికి, స్పందించే హృదయం అవసరం. అలాంటి మనసున్న వాళ్ళనే "సహృదయులు" అంటారు. ఈ సహృదయత అనేది సాధారణంగా మన చేతుల్లో ఉండే విషయం కాదు. కొంతమందికి చిన్ననాటినుంచే డిటెక్టివ్ నవలలు చదవడం ఇష్టం కావచ్చు. మరొకనికి హాస్య నవలలు మాత్రమే నచ్చుతూ ఉండవచ్చు. ఇవి పుట్టుకతోనే వచ్చే వాసనలనే అనుకోవాలి. ఇలాంటి వాసనలనే మనవాళ్ళు "పూర్వజన్మ" వాసనలు అన్నారు. పుట్టుకతోపాటు, పుట్టి పెరిగిన వాతావరణం, మానసిక స్థితిగతులూ మొదలైనవి కూడా ప్రభావం చూపిస్తాయి. రుచిభేదాన్ని బట్టి కొందరికి కొన్ని రసాలు రుచిస్తే మరికొందరికి మరికొన్ని రుచిస్తాయి. ఒకే సన్నివేశం అనేకమందికి అనేకరకాలైన అనుభూతిని కలిగించవచ్చు కూడా! ఈ విషయాన్నే చమత్కారంగా సూచించే శ్లోకమొకటి రాజశేఖరుడు తన కావ్యమీమాంసలో ఉదాహరించాడు. కాని మనం మాట్లాడుకోవలసింది తెలుగు పద్యాల గురించి కదా! అంచేత అలాంటిదే ఒక తెలుగు పద్యాన్ని ఉదాహరిస్తాను. శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు ఒక భువనవిజయ సభలో చెప్పిన పద్యమిది. ఒక అందమైన అమ్మాయిని చూస్తే, ఒక వేదాంతికి, ఒక నవయువకునికి, ఒక పిల్లవానికీ, అలాగే మీలాంటి ఒక కవికీ, ఎలాంటి అనుభూతులు కలుగుతాయో - ఒక పద్యంలో వర్ణించమన్నారతన్ని. అప్పుడతను ఆశువుగా చెప్పిన పద్యమిది:

 

ఒకనికి మట్టిదిమ్మవు, మరొక్కనికీ వపరంజిబొమ్మ, విం

కొకనికి నమ్మవౌదు, మధురోహల ఊయలలూగునట్టి యీ

సుకవికి యేమియయ్యెదవు సుందరి! యీ కవితాకళామయా

త్మికజగతిన్ రసజ్ఝరుల దేల్చెడి ముద్దులగుమ్మవౌదువా!

 

వేదాంతికి మట్టిదిమ్మ, నవయువకునికి అపరంజిబొమ్మ, పిల్లవానికి అమ్మ. ఎవరి మానసిక స్థితికి తగ్గట్టువారు స్పందిస్తారు. ఈ పద్యంలో కవి స్పందనకున్న ప్రత్యేకత గమనించారా! తక్కిన ముగ్గురికీ ఆమె ఒక వ్యక్తిగా నేరుగా ఒకో రకమైన అనుభూతిని కలిగిస్తోంది. కానీ కవికి ఆమె భౌతిక వ్యక్తిత్వంతో పనిలేదు. కవితాలోకంలో రసజ్ఝరుల తేల్చే ఒక ప్రేరణ. అది శృంగార రసమైనా కావొచ్చు, వాత్సల్యమైనా కావచ్చు, మరేదైనా కావచ్చు!

స్పందించే హృదయంతో పాటుగా, కావ్యాన్ని తగిన విధంగా చదవగలిగే ప్రజ్ఞ కూడా సహృదయునికి అవసరం. ఇది అనేక కావ్యాలనూ, వాటి వ్యాఖ్యానాలనూ చదవడం ద్వారా పెంపొందించుకోవచ్చు. ప్రాచీన పద్యకావ్యాలను చదివే అలాంటి ప్రజ్ఞ యీనాటి చాలామందిలో కొరవడింది. అందుకే వాటిలోని రసం నేటి పాఠకులకు అందని ద్రాక్షయిపోయింది! ప్రస్తుత వ్యాసాలు యీ మేరుకు కొంత ఉపయోగపడుతాయని ఆశిస్తాను.

 

 

రసనిష్పత్తి 

బాగుందయ్యా! రసానుభూతి కలగాలంటే పాఠకుడు సహృదయుడై ఉండాలన్నావు సరే. రససృష్టి జరగాలంటే కావ్యంలో ఎలాంటి ప్రత్యేక లక్షణాలూ ఉండనక్కర లేదా? మొత్తం బాధ్యతంతా పాఠకునిదేనా, కవికేమీ లేదా? - అంటూ ఆవేశపడకండి. అక్కడికే వస్తున్నా. దీని గురించి కూడా మన అలంకారశాస్త్రంలో చాలానే ఉంది. ఈ విషయమై, రససిద్ధాంతానికంతకీ ప్రాణభూతమని చెప్పదగ్గ సూత్రాన్ని భరతుడు తన నాట్యశాస్త్రంలో చెప్పాడు:

 

"విభావ అనుభావ వ్యభిచారి సంయోగాత్ రసనిష్పత్తిః"

 

రసోత్పత్తికి ముఖ్యమైనవి మూడు దినుసులని చెప్పాడు భరతుడు. విభావములు, అనుభావములు, వ్యభిచారి భావములు. వాటి సంయోగంలో రస నిష్పత్తి జరుగుతుంది. రసాన్ని నిర్వహించడానికి ముందుగా ఒక ఆలంబన కావాలి కదా. అంటే ఉదాహరణకి శృంగారరసం ఉందనుకోండి. దానికి స్థాయీభావం "రతి", అంటే కోరిక. కోరిక అనే భావం ఎవరిలో కలుగుతుంది? యౌవనంలో ఉన్న నాయికా నాయకలకు పరస్పరం కలుగుతుంది. వారిరువురూ ఆ భావానికి ఆలంబన అన్నమాట. వారినే ఆలంబన విభావములు అంటారు. ఆలంబన ఉన్నంత మాత్రాన భావం రసస్థాయిని చేరలేదు. ఆ భావాన్ని పెంపొందించే పరిస్థితులు కూడా ఉండాలి. ఉదాహరణకి పున్నమి వెన్నెల రేయి, ఉద్యానవనం, ఏకాంతం - యివన్నీ నాయికానాయకుల మధ్యనున్న కోర్కెని ఉద్దీపింపజేస్తాయి. అందుకే వీటిని ఉద్దీపన విభావాలు అంటారు. అంటే, స్థాయీభావం పుట్టి పెరగడానికి కారణమైన వాటిని విభావములు అంటారన్న మాట. అవి ఆలంబన, ఉద్దీపన విభావాలని రెండు రకాలు.

 

స్టేజి మీద ఒక నాటకం జరుగుతోందనుకోండి. ఏకాంతంలో నాయికానాయకులు కలుసుకున్నారు. వారి మధ్య పరస్పరం ఉన్న కోరిక ఎలా వ్యక్తమవుతుంది? చూస్తున్న ప్రేక్షకులకి వారి భావతీవ్రత ఎలా తెలుస్తుంది? లోకంలో సహజంగా యిద్దరు యువతీయువకుల మధ్య ప్రేమ (ఇప్పటి భాషలో "ప్రేమ" అంటున్నాం కాని పూర్వం దీనికున్న పేరు రతి లేదా కోరికే)  ఉదయించినప్పుడు వారు దాన్ని క్రీగంటి చూపులతోనూ, చిలిపి నవ్వులతోనూ, సరస సంభాషణలతోనూ వ్యక్తపరుస్తారు కదా. మరి నాటకంలో కూడా అవి అభినయించినప్పుడే ప్రేక్షకుల హృదయాన్ని ఆ భావం తాకే అవకాశం ఉంటుంది. అంతే కాని ఏదో ఎక్కాలు అప్పచెబుతున్నట్టు, నువ్వు నాకు నచ్చావంటే నువ్వునాకు నచ్చావని డైలాగులు చెప్పేస్తే సరిపోదు. ఇలా భావాన్ని వ్యక్తం చేసే చేష్టలనూ, హావభావాలనే "అనుభావాలు" అంటారు. అంటే భావాన్ని అనుసరించి వచ్చేవన్న మాట (మనసులో భావాన్ని బయట అనుభవంలోకి తెచ్చేవని కూడా అర్థం). భయం కలిగినప్పుడు వణుకు, శోకం పుట్టినప్పుడు కన్నీళ్ళు మొదలైనవి ఆయా భావాలను అనుసరించి వచ్చే అనుభావాలు.

 

ఇక, స్థాయీభావంతో పాటుగా సందర్భాన్ని బట్టి మరికొన్ని భావాలు కూడా మనస్సులో పుడుతూ ఉంటాయి. ఉదాహరణకు ప్రియురాలికి ప్రియుని చూసినప్పుడు గానీ లేదా అతని గురించి విన్నప్పుడు గానీ సిగ్గు కలగవచ్చు. ఒకరి సన్నిధిలో మరొకరికి హర్షోద్వేగం కలగవచ్చు. వియోగంలో పరితాపం కలగవచ్చు. ఈ భావాలన్నిటి వెనకా ఉన్నది కోరికే. ఇలా మూలభావంతో (స్థాయీభావంతో) పాటుగా కలిగే భావాలను వ్యభిచారి లేదా సంచారి భావాలని అంటారు. సన్నివేశాన్ని బట్టి ఆయా వ్యభిచారి భావాలను కూడా నాటకంలో అభినయించాలి. అప్పుడు ప్రేక్షకుని మనసు మరింతగా అందులో లీనమవుతుంది. తద్వారా రసోత్పత్తికి జరుగుతుంది.

 

భరతుడు చెప్పిన ఈ సూత్రం ప్రధానంగా నాటకాలను, అంటే దృశ్యకావ్యాలను దృష్టిలో పెట్టుకొని చెప్పినది. తర్వాతి కాలంలో ఆలంకారికులు దీన్ని శ్రవ్యకావ్యాలకు (అంటే కేవలం వినే/చదివే కావ్యాలన్న మాట) కూడా అన్వయించారు. ఇలాంటి కావ్యాలలో రస నిర్వహణ ఎలా జరగాలన్న విషయాన్ని గురించి కొన్ని సూచనలిచ్చారు. వాటిలో ముఖ్యమైన రెండిటిని మాత్రం ఇప్పుడు ప్రస్తావిస్తాను.

 

ఇందాక చెప్పుకున్నాం కదా సిగ్గు అనేది ఒక వ్యభిచారిభావం అని. అది నాయికలో కలిగిందనుకోండి. నాటకమైతే దాన్ని నటి అభినయించి చూపగలదు. మరి చదువుకునే కావ్యంలో అయితే? "ఆమెకు సిగ్గు కలిగెను" అని వ్రాస్తే అది న్యూస్ పేపర్లో వార్త అవుతుంది కాని రసాన్ని పుట్టించదు. భాషకి ఎంత శక్తి ఉందో అన్ని పరిమితులున్నాయి. మనిషి మనసులో జనించే అనేకానేక అనుభూతులను వ్యక్తం చేసేందుకు భాష సరిపోదు. "సిగ్గు" అనే పదం కేవలం ఒక అనుభూతికి ఒక "సూచన" లేదా "ప్రతీక" మాత్రమే. ఆ అనుభూతిని అది పూర్తిగా వ్యక్తం చెయ్యలేదు. అందుకే "ఆమె సిగ్గుపడింది" అనే వాక్యం కేవలం సమాచారాన్ని యివ్వగలదే కానీ ఆ అనుభూతి పాఠకుని హృదయాన్ని తాకేలా చేయలేదు. అదే, "అమ్మాయి తల దించుకుని, కంటి కొసలతో మెల్లగా ఓరచూపులు చూస్తోంది. చేతినున్న చున్నీ కొసని మాటి మాటికీ చేతి వేలికి చుట్టుకుంటోంది." అని వర్ణిస్తే, అలా సిగ్గుపడుతున్న అమ్మాయి రూపం పాఠకుని మనసులో రూపుకడుతుంది. ఆడపిల్లలకైతే ఇంతకుముందు తామే అలా సిగ్గుపడ్డ సందర్భం గుర్తుకు రావచ్చు. అబ్బాయిలకైతే, అలా ఇంతకుముందు చూసిన (కనీసం సినిమాలోనైనా) అమ్మాయి గుర్తుకు రావచ్చు. ఆ గతంలో జరిగిన సన్నివేశం తిరిగి మనసులో మెదిలి, అప్పుడు తాము పొందిన అనుభూతి తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఒక విషయాన్ని గురించి నేరుగా వాచ్యంగా చెప్పకుండా, యిలా దానికి సంబంధించిన స్ఫురణను, అనుభూతిని, పాఠకుల్లో కలిగించడాన్ని "ధ్వని" అంటారు. ఇలా ఒక భావాన్ని మాత్రమే ధనింపజేస్తే అది "భావధ్వని". ఇలాగే ఒక స్థాయీభావానికి సంబంధించిన యితర అనుభావాలను, సంచారీభావాలనూ కూడా ధ్వనింప జేస్తే, అప్పుడు రసనిష్పత్తి జరుగుతుంది. అప్పుడది "రసధ్వని" అవుతుంది. "ధ్వని" సంప్రదాయం ప్రకారం కావ్యాన్ని ఉత్తమ కావ్యంగా మార్చేది యీ రసధ్వనే.

 

భాష ద్వారా ఒక భావాన్ని లేదా అనుభూతిని ఉద్దీపింప చెయ్యడానికి (అంటే ఆ భావాన్ని మరింత ప్రకాశవంతంగా వ్యక్తీకరించడం) మరొక ఉపాయం కూడా ఉంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒకడు ఒక మునిని మోసం చేసి అతని దగ్గర దొంగతనంగా ఒక విద్య నేర్చుకుంటాడు. నేర్చుకున్నవాడు నేర్చుకున్నట్టు ఉండకుండా, ఆ ముని దగ్గరకు వచ్చి, "చూస్కో నీ దగ్గరే నీకు తెలీకుండా ఎలా విద్య నేర్చుకున్నానో. నువ్వే పేద్ద తెలివైనవాడివనుకోకు" అంటూ విఱ్ఱవీగుతాడు. అప్పుడా మునికి పట్టరాని కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఎలా వర్ణించాలి? పైన చెప్పినట్టు, "మునికి కోపం వచ్చింది" అని ఊరుకుంటే, అది వట్టి వార్త మాత్రమే అవుతుంది. దాన్ని వర్ణన ద్వారా స్ఫురింపజేయాలి. ఇలా వర్ణించారనుకుందాం:

 

"అలా అనగానే అతని కనులు ఎఱ్ఱబడ్డాయి. క్రింద పెదవి కంపించింది. మాటిమాటికీ చలించే కనుబొమలనే పాములజంట బుస్సుమని చిమ్మే విషంలాగా నిట్టూర్పులు వస్తున్నాయి. నుదుటి మీద అక్కడక్కడా చెమట చినుకులు ఏర్పడ్డాయి. మన్మథుణ్ణి తన కంటి చూపుతో కాల్చేటప్పుడు ఈశ్వరుడు చేసిన భయంకర ధ్వనిలాంటి అరుపు వినిపించింది."

 

ఈ వర్ణన ఆ ముని చిత్రాన్ని మనసులో రూపుకడుతుంది. బహుశా ఆ రూపాన్ని స్థిరంగా నిలుపుకుంటే, క్రోధరస స్పర్శ హృదయాన్ని తాకవచ్చు. కాని దీనికి కొంత సమయం పడుతుంది. పాఠకుడు కొంత పరిశ్రమ చేయ్యాలి. ఇదే నాటకంలో అయితే, నటుడు అభినయం ద్వారా దీన్ని చూపించగలిగితే, అది తక్షణమే సూటిగా ప్రేక్షకుని హృదయాన్ని తాకి సద్యఃస్ఫూర్తి కలిగిస్తుంది. రసోత్పత్తి సులువుగా జరుగుతుంది. అలాంటిది చదువుకొనే కావ్యంలో సాధ్యమా? కొంతవరకూ సాధ్యమే. ఇప్పుడీ పద్యం చదవండి:

 

 

అనినన్ గన్నులు జేవురింప నధరం బల్లాడ వ్రేల్లత్ పునః

పునరుద్యద్భృకుటీ భుజంగయుగళీ ఫూత్కార ఘోరానిలం

బన నూర్పుల్ నిగుడన్ లలాటఫలకం బందంద ఘర్మాంబువుల్

జినుకన్ గంతు దిదృక్ష రూక్ష నయన క్ష్వేళా కరాళ ధ్వనిన్ 

 

ఇంతకుముందీ పద్యాన్ని చదివి ఉండకపోతే, వెంటనే ఆగకుండా చదవడం సాధ్యపడకపోవచ్చు. రెండు మూడుసార్లు చదవండి. అప్పుడు ఆగకుండా కాస్త తీవ్రస్వరంలో మళ్ళీ పద్యాన్ని చదివి చూడండి. ఆ ముని కోపతీవ్రత మీకు స్ఫురించిందా లేదా? ఈ పద్య తాత్పర్యమే అచ్చంగా పై వచనం. ఆ వచనం కన్నా యీ పద్యం ఎందుకు అధికస్ఫూర్తిని యిస్తోంది? ఎందుకో మీకూ తెలుసు, నేను పెద్దగా వివరించనక్కర లేదు. మనకి కోపం వస్తే సాధారణంగా మన గొంతు పెరుగుతంది. కాని వ్రాసే/చదివే భాషకి "గొంతు" లేదా "స్వరం" ఉండదు కదా. మరి దాన్నెలా వ్యక్తపరచడం? కఠినమైన పదాలూ సమాసాలూ కొంతవరకూ సాయపడతాయి. అదే సుకుమారమైన భావాన్ని వ్యక్తం చేయడానికి యిలాంటి శైలి ఉపయోగిస్తే భావం చెడిపోయే అవకాశముంది. దీనినే అలంకారశాస్త్ర పరిభాషలో "రీతి" అంటారు. ప్రత్యేకమైన పదరచన లేదా పదాల కూర్పు - "రీతి". కావ్య రచనలో రసానికి తగ్గ రీతి ఉంటే రసనిష్పత్తి సులువుగా జరుగుతుంది.

 

 

ఇదీ రసనిష్పత్తి కథాక్రమం. అయితే, మనసులో కలిగే ప్రతి భావమూ రసస్థాయిని చేరుకోలేదు. ఆ స్థాయికి చేరి ఏర్పడే రసాలను ప్రధానంగా తొమ్మిదింటిని గుర్తించారు ఆలంకారికులు. అవి శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం. వీటినే నవరసాలు అంటారు. మొట్టమొదట నాట్యశాస్త్రంలో భరతుడు చెప్పినవి మొదటి ఎనిమిది రసాలే. చివరిదైన శాంతాన్ని తర్వాతి ఆలంకారికులు చేర్చారు. కొంతమంది, భక్తి, వాత్సల్యం మొదలైన మరికొన్ని రసాలను కూడా చెప్పారు కాని ఎక్కువగా పరిసిద్ధి పొందినవి నవరసాలే. ఒకో రసానికి స్థాయీభావం ఏమిటి, పద్య కవిత్వంలో ఆయా రసాలు ఎలా నిర్వహించబడ్డాయి అన్న దాని గురించి, కొన్ని ఉదాహరణలతో, రాబోయే వ్యాసాలలో చూద్దాం. రాబోయే ఋతువు వసంతం. వసంతుడు మన్మథుని చెలికాడు. అంచేత వచ్చే నెల శృంగారరసంతో వసంతానికి స్వాగతం పలుకుదాం.

 

అందాకా, ఒకో రసానికీ మీకు తెలుసున్న పద్యాలనో, కావ్య సన్నివేశాలనో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోడానికి ప్రయత్నించండి.

 

 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!