వివేకచూడామణి (8 వ,9వ భాగాలు ) !.

వివేకచూడామణి (8 వ,9వ భాగాలు ) !.

-

శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.

-

8. చిత్తం :

సూక్ష్మశరీరాన్ని చిత్తమని, అంతరంగమని కూడ వ్యవహరిస్తారు. మన వేదాంతంలో ఈ ‘చిత్తా’నికి ముఖ్యమైన పాత్ర ఉన్నది.

ఈ ‘చిత్తా’న్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు. 1. మనసు 2. బుద్ధి 3. అహంకారం 4. చిత్తం.

మనసు : దీనిగురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం. స్పందనలు, ప్రతిస్పందనలు, కామక్రోధాది భావాలు, సుఖదుఃఖాది అనుభూతులు, రాగద్వేషాది ద్వంద్వాలు అన్ని కూడ ఈ మనసుకు సంబంధించినవే. ఆందోళనలు, అలజడులు, భయాలు ఇవి కూడ మనసుకు సంబంధించినవే. ఇవన్నీ భావనారూపకమైన మనోవృత్తులు.

బుద్ధి : దీనిగురించి కూడ ఇంతకు ముందే చెప్పుకున్నాం. వివేకం, విచక్షణాజ్ఞానం; క్రొత్త సంగతుల గురించి ఆలోచించటం ఇవన్నీ బుద్ధికి సంబంధించినవే. ‘వాంఛలు’ కొందరు బుద్ధికి చెందినవిని, కొందరు మనసుకు చెందినవని అంటారు. అసలు మనసుకు, బుద్ధికి మధ్యలో ఉన్న రేఖ చాల పలచనిది. అలజడులు, ఆందోళనలు మనసులో, ఆలోచనలు బుద్ధిలో కూడ కలిగేవని చెప్పవచ్చు. ఈ రెండు కూడ మనోవృత్తులే.


అహంకారం : బయట ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలను గ్రహిస్తూ, వాటిలో ఎట్లాంటి ‘ప్రతిస్పందన’ లేకుండా, కేవలం ‘ద్రష్ట’ (చూసేవాడు)గా మాత్రమే ఉంటే, అప్పుడు చిత్తం ‘అహంకారం’గా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. అప్పుడు ‘నేను చూస్తున్నాను’, ‘నేను వింటున్నాను’ అనే భావం మాత్రమే ఉంటుంది. ఆ ‘నేను’ అనే భావమే అహంకారం. మనకు సంబంధం లేని సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు, మనసులో ఎటువంటి అలజడులు, ఆలోచనలు కలగకపోయినా ‘నేను చూస్తున్నాను’ అనే అనుభవం మాత్రం నిరంతరం కలుగుతుంటుంది. అదే అహంకారం.

ఈ ‘అహంకారం’ బాహ్యప్రపంచంలోని సన్నివేశాలనే కాక, మన మనోబుద్ధులలో కలిగే భావాలను, ఆలోచనలను కూడ తెలుసుకుంటుంటుంది. మనసు కోపంతో నిండి ఉన్నా, బుద్ధి ఆలోచనలతో సతమతమవుతున్నా అహంకారం వాటిని గ్రహించి, ‘నేను కోపంతో ఉన్నాను’, ‘నేను ఆలోచిస్తున్నాను’ అనే భావం కలిగి ఉంటుంది.

అందువల్ల మనోబుద్ధులలో ఎటువంటి స్పందనలు, ప్రతిస్పందనలు, భావాలు, ఆలోచనలు కలిగినా ఈ ‘అహంకారం’ తెలుసుకుంటుంటుంది. అసలు బాహ్యప్రపంచంలో కనిపించే దృశ్యాలన్నీ, స్పందన రూపంలో మన మనసులోనే ఉంటాయి. వాటినే ఈ అహంకారం చూస్తుంటుంది. అహంకారం చూసేది మనోబుద్ధులలో కలిగే స్పందనలను, ప్రతిస్పందనలను, మనోవృత్తులనే కాని, బాహ్య ప్రపంచాన్ని కాదని చెప్పవచ్చు. ఎవరైనా ‘నేను కొండను చూస్తున్నాను’ అంటే, ఆ కొండ అతని మనోఫలకం మీద ఏర్పరచిన ప్రతిబింబాన్ని చూస్తున్నాడన్నమాట! Photographer తన Camera వెనుక నల్ల గుడ్డ కప్పుకుని, Camera భూతద్దం వల్ల లోపలి గాజు పలక మీద పడ్డ ప్రతిబింబాన్ని చూస్తూ, ఎదురుగా కూర్చున్న మనుషులను ఇటు అటు జరుపుతాడు. ఆ విధంగనే, మనం (మన అహంకారం), మన మనసులో కలిగిన ప్రతిబింబాన్ని చూస్తూ, మనం బాహ్యప్రపంచాన్నే చూస్తున్నామని భ్రాంతి చెందుతున్నాం.

ఆ మనోఫలకం (మనసు అనే గాజుపలక), మలినంగా (అలజడులతో, ఆందోళనలతో కూడుకుని) ఉంటే మనకు కనిపించే బింబం కూడ వికృతంగా ఉంటుంది. మనసు కోపవికారంతో కూడి ఉన్నప్పుడు, ఆ బింబంకూడా వికారంగా కనిపిస్తుంది. మనసు నల్లగా ఉంటే (అంటే నిద్రావస్థలో) బింబమే కనిపించదు. బాహ్యప్రపంచంలో మార్పులు లేకపోయినా మన మనోవికారాలను బట్టి, బింబం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క తీరుగా కనిపిస్తుంది. మన మనోవృత్తులకు అనుగుణంగా కనిపిస్తుంది. ఎట్లా అంటే, అహంకారం చూసేది బాహ్యప్రపంచం కాదు. మనోబుద్ధులలో కలిగే మనోవృత్తులలో ఈ అహంకారం కూడ ఒక భావనే, ఒక మనోవృత్తే.


చిత్తం : మనసు, బుద్ధి, అహంకారం అనేవి వృత్తి రూపకమైనవని చెప్పుకున్నాం. అవి సముద్ర ఉపరితలం మీద కనపడే అలలవంటివి. అలలు ఎత్తుపల్లాలు కలిగి, నిరంతరం కదులుతుండటంవల్ల అవి వాటి క్రింద ఉన్న, వాటికి ఆధారభూతమైన సముద్రాన్ని పూర్తిగా కప్పి, తామే సముద్రమనే భ్రాంతిని కలుగచేస్తాయి. కాని ఆ అలల అస్తిత్వం, వాటి క్రింద ఉన్న సముద్రమే. అలలు లేని నిశ్చలమైన సముద్రం ఉండగలదు కాని, సముద్రం లేని అలలు ఉండలేవు.


ఆ విధంగానే ఈ మనసు, బుద్ధి, అహంకారం అనేవి చిత్తం అనే సముద్రం మీద కదిలే అలలు. వీటి అస్తిత్వాన్ని ‘చిత్తం’ అంటారు. ఈ మనోబుద్ధ్యహంకారాలు కలిగించే మనోవృత్తులు (అలలు) పూర్తిగా ఆగిపోతే, మిగిలేది స్పందన, ప్రతిస్పందన, అలజడి, ఆందోళన, ఆలోచన, భావం, అనుభూతి లేని మనోపదార్థం ఒక్కటే అదే ‘చిత్తం’ అని తెలుసుకోవాలి. గాఢనిద్రలో ఉన్నప్పుడు, మనకు బాహ్యప్రపంచంగాని, మన ఆలోచనలుగాని, ఆందోళనలుగాని, భావాలుగాని చివరికి ‘నేను ఉన్నాను’ అనే భావం కూడ ఉండదు. అప్పుడు (వృత్తిరూపకాలైన) మనసు, బుద్ధి, అహంకారం లేని ‘చిత్తం’ ఒక్కటే నిశ్చలంగా ఉంటుంది. వస్తుతత్త్వంలో మనోబుద్ధ్యహంకారాలు చిత్తానికి భిన్నమైనవి కావు కాబట్టి, మనోవృత్తులను చిత్తవృత్తులు అని కూడ అంటారు. (ఈ చిత్తం తన్మాత్రరూపం ఉన్న శుద్ధ ఆకాశతత్త్వంతో కలిగినదని చెప్తారు. అందువల్ల దీనిని ‘చిత్తాకాశము’ అని కూడ అంటారు).


9. ఆత్మ తత్త్వం :

స్థూలశరీరం అస్థిరమైనదని, నాశవంతమైనదని చెప్పుకున్నాం. అలాగే సూక్ష్మశరీరమైన మనో బుద్ధులు కూడ చంచలమైనవి, స్థిరత్వం లేనివి,

వృత్తిరూపకమైనవి. ఈ రెండు శరీరాలు కూడ అవస్థా భేదాలు చెందుతుంటాయి. ఒకప్పుడు జాగ్రదవస్థలో, మరొకప్పుడు స్వప్నావస్థలో, వేరొకప్పుడు సుషుప్తావస్థలో ఉంటాయి. గాఢనిద్రలో ఈ రెండు కూడ తమ అస్తిత్వాన్ని మరచిపోయి ఉంటాయి. వాటికి నిత్యత్వం, నిర్వికల్పత్వం (మార్పులు లేకపోవటం) లేవు. విశేషించి ఈ రెండు స్వయంప్రకాశమైనవి కావు. జడమైనవి, అవి స్వయంప్రతిపత్తి కలవి కావు (తమంతట తాము నిలువగలిగేవి కావు). కాబట్టి ఈ రెండు కూడ మన నిజతత్త్వాన్ని చూడలేవు. మార్పులు చెండుతుండేవి, మార్పులు లేని దానికిఆధారం కారాదు.

ఈ విధంగా ఆలోచించిన తరువాత, ఈ బాహ్యాంతర శరీరాల వెనుక, వాటికి ఆధారభూతమైన, నిర్వికల్పమైన, నిత్యమైన, వేరొక తత్త్వం ఉన్నదని, అదే ‘నేను’, ‘నేను’ అనే భావం వెనుక ఉన్న నిజతత్త్వమని నిర్ధారణకు వచ్చారు. అది జ్ఞానరూపమైనది. సూర్యుడికి కాంతి, వేడి స్వాభావిక గుణమైనట్లు, జ్ఞానం (Consciousness) ఎరుక ఈ ఆత్మకు స్వాభావికగుణం. సూర్యకాంతిలో ప్రపంచంలోని జీవరాసులన్నీ, సూర్యుడి ప్రమేయం లేకుండానే, తమ తమ పనులలో నిమగ్నమై ఉంటాయి. సూర్యుడు సర్వకర్మసాక్షి. అతనికి తన కాంతిలో జరిగే పనులలో అవి మంచివైనా, చెడ్డవైనా వాటితో ఎటువంటి ప్రమేయం లేదు. ఆ విధంగానే ఈ ఆత్మజ్ఞానప్రకాశంలో ఈ శరీరమనోబుద్దులు తమతమ అన్ని పనులను చేసుకుంటుంటాయి. అలాంటి పనులన్నిటికీ ‘ఆత్మ’ సాక్షి మాత్రమే. సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తుంటాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, తన నీడలోకే తాను వచ్చినప్పుడు అంధకారంలో మునిగిపోతుంది. అంతమాత్రాన సూర్యుడు లేడని కాదు. ఆ విధంగనే ‘ఆత్మ’ ప్రకాశంలో చిత్తం ఉన్నప్పుడు, అది చైతన్యవంతమై, స్థూలశరీరాన్ని కూడ చైతన్యవంతం చేస్తుంది. వెంటనే స్థూల, సూక్ష్మ శరీరాలు తమ తమ పనులు చేయటం మొదలుపెడతాయి. గాఢనిద్రలో ‘చిత్తం’ తమస్సులో ఉన్నప్పుడు ఆత్మ తేజం మరుగున పడుతుంది. అప్పుడు స్థూల, సూక్ష్మశరీరాలు చైతన్యాన్ని కోల్పోయి నిద్రావస్థలో ఉంటాయి. స్వప్నావస్థలో ‘చిత్తం’ రజోగుణ ప్రాధాన్యం కలిగి, ఆత్మప్రకాశం కొద్దికొద్దిగా ఉన్నప్పుడు, మనోబుద్ధులలో, మిగిలిపోయిన మనోవృత్తులను, పాత సంఘటనల స్మృతిరూపకమైన మనోవృత్తులను, కలిపి ప్రకాశింపచేయటం వల్ల పలురకాలైన స్వప్నాలు కలుగుతుంటాయి.

కాని, ఆ అసంపూర్ణజ్ఞానంలో, స్వప్నరూపకమైన ఈ మనోవృత్తులు బాహ్యప్రపంచంలో కలిగే యథార్థ సంఘటనలలాగ అనుభూతి కలిగిస్తాయి. చిత్తం ఈ విధంగా కొన్ని అవస్థలలో కొన్ని విధాలుగా ఉన్నా, ఆత్మతత్త్వం మాత్రం సూర్యుడిలాగ, ఒకే విధంగా, ఎటువంటి మార్పులు లేకుండా ప్రకాశిస్తుంటుంది.

ఈ జ్ఞాన రూపకమైన ఆత్మతత్వమే మన నిజతత్త్వమని మన శాస్త్రాలన్నీ అంగీకరిస్తున్నాయి.

ఈ సందర్భంలో ఒక ముఖ్యవిషయం గమనించవలసి ఉంటుంది. ‘ఆత్మ’ అనేది మన శరీర మనోబుద్ధులకు వేరై వాటికి ఆధారభూతమైన తత్త్వాలను, మన వేదాంతగ్రంథాలలో, తదితర గ్రంథాలలో ‘ఆత్మ’ అనే పదాన్ని వేరువేరు సమయాలలో వేరువేరు అర్థాలలో వాడుతుంటారు. ‘ఆత్మ’ అనే పదం ‘నేను’ అనే అర్థంలో, ఒకప్పుడు దేహాన్ని సూచించేదిగా ఒకప్పుడు మనసును, వేరొకప్పుడు బుద్ధిని, మరొకప్పుడు జీవాత్మను సూచిస్తుంటుంది. ఒక్కొక్కప్పుడు శుద్ధ ఆత్మతత్త్వం అనే భావంలో సర్వాత్మతత్త్వానికి కూడ వాడుతుంటారు. అందువల్ల సందర్భాన్ని బట్టి ‘ఆత్మ’ అనే పదం దేనిని సూచించటానికి వాడబడినదో చూసుకుంటుండాలి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!