Sunday, February 4, 2018

వివేకచూడామణి (6,7 వ భాగాలు ) !.

వివేకచూడామణి (6,7 వ భాగాలు ) !.

-

శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.


6. స్థూల శరీరం :


మన శరీరంలో ఉన్న పదార్థతత్త్వంకూడ ఈ పంచమహాభూతాల నుంచి వచ్చినదే. వస్తుతత్త్వంలో మన శరీరాలకు, ఈ పాంచభౌతిక ప్రపంచానికి భేదం లేదు. సప్తధాతువులతో (పై చర్మం, లోపలి చర్మం, మాంసం, కొవ్వు, రక్తం, ఎముకలు, మూలుగ) కూడిన ఈ శరీరం నుంచి ప్రాణం పోయిన తరువాత ఇది ఈ పంచభూతాలలోనే కలిసిపోతాయి. ఈ శరీరంలోనే, పంచ కర్మేంద్రియాలు అయిన కాళ్ళు, చేతులు, నోరు, గుదం, లింగం ఉన్నాయి. ఈ స్థూలశరీరంలోనే మన జ్ఞానేంద్రియాల పరికరాలైన కళ్ళు, చెవులు,ముక్కు, నాలుక, చర్మం ఉన్నాయి. ఈ దృశ్యప్రపంచంలో పనులు చేయటానికి వీటితో సంబంధబాంధవ్యాలు పెట్టుకోవటంలో కూడ ఈ శరీరం ఉపయోగపడుతుంది. కాలవశంలో ఈ స్థూలశరీరం నశించిపోతే, ఆ వ్యక్తి ఉండడు. అంటే నామరూపాలు, జాతి, వర్ణం, ఆశ్రమం ఇవన్నీ ఈ శరీరాన్నే ఆశ్రయించుకుని ఉంటాయి. అందువల్ల అందరూ ఈ స్థూలశరీరాన్నే వ్యక్తిగా పరిగణిస్తారు.


కాని, మనకు బయటకు కనిపిస్తున్న, నశించిపోయే స్వభావంగల ఈ స్థూలశరీరమే మన నిజతత్వమా? కాదని చిన్నపిల్లవాడికి కూడ కొద్ది అనుభవంతో తెలిసిపోతుంది. అల్లరి చేస్తున్న చిన్నపిల్లవాడిని తండ్రి గట్టిగా ‘కొడతాను’ అని బెదిరించి, చేయి ఎత్తి కొట్టబోతున్నట్లు నటించేసరికి, ఆ పిల్లవాడు ముందుగా తండ్రి ముఖంలోకి చూస్తాడు. ఆ ముఖంలో ఏ మాత్రం చిరునవ్వు కనిపించినా, ఆ కొట్టటం అంతా నటనే అని గ్రహించి, నవ్వుతూ పరుగు పరుగున వెళ్ళి తండ్రి కాళ్ళకు చుట్టుకుంటాడు. తండ్రి ముఖంలో కోపంగాని కనిపిస్తే, అతను కొట్టకుండానే భోరుమని ఏడవటం మొదలుపెడతాడు.

-


7. సూక్ష్మ శరీరం :

మనకు కనపడే దేహంలో మనకు కనిపించని మరొక వ్యక్తిత్వం ఉన్నదని కొద్ది విచక్షణాజ్ఞానంతో గ్రహించగలం. దానిని సూక్ష్మశరీరం అంటారు. ఈ రెండు శరీరాలలో ఏది మన నిజతత్వమని ఆలోచిస్తే, బయటకు కనపడే స్థూలశరీరం కంటే లోపల ఉన్న సూక్ష్మశరీరమే మన నిజతత్వమని గ్రహించగలం. మనం కట్టుకున్న బట్టలు మన నిజతత్త్వం కానట్లు, ఈ బాహ్యశరీరం కూడ మన నిజతత్త్వం కాదు. ఈ లోపలి శరీరం ఉండటానికి పనికివచ్చే ఒక గూడు ఆ లోపలి మనిషి వాడుకోటానికి పనికొచ్చే ఒక పనిముట్టు.

ఈ సూక్ష్మశరీర వస్తుతత్త్వం ఎటువంటిది? అని ఆలోచిస్తే, అది స్పందనా రూపకమైనది, భావనా రూపకమైనది, ఆలోచనా రూపకమైనది, అనుభూతి రూపకమైనది అని గ్రహించగలం. అంటే ఇవన్నీ ఒక రకమైన ‘వృత్తి’ (Waves, Vibrations) రూపకమైనవని చెప్పవచ్చు. వీటిని ‘మనోవృత్తులు’ అని కూడ అంటారు.

స్పందన రూపకమైన మనోవృత్తులను – 1. స్పందన, 2. ప్రతిస్పందన, 3. క్రియ అనే మూడు విధాలుగా విభజించవచ్చు. ఇంద్రియాలు బాహ్యప్రపంచం నుంచి తెచ్చే సంకేతాలను గ్రహించి, దానిని విశ్లేషించి, వాటిని అన్వయించుకోవటం (తెలుసుకోవటం) ‘స్పందన’ (Perception) అనవచ్చు. ఆ విధంగా తెలిసిన సమాచారానికి అనుగుణంగా మనసులో కలిగే భావతరంగాలను ‘ప్రతిస్పందన’ (Reaction) అనవచ్చు. ఆ ప్రతిస్పందనకు అనుగుణంగా ప్రవర్తించటానికి కావలసిన సంకేతాలను ‘క్రియా రూపకమైనవి’ (Action oriented) అని చెప్పవచ్చు. ఈ విధంగా ‘స్పందన’ ‘ప్రతిస్పందన’, ‘క్రియ’ ఒక క్రమపద్ధతిలో ఒక దాని వెనుక ఒకటి ప్రవాహరూపంలో జరిగిపోతుండటం వల్ల సూక్ష్మ శరీరానికి ఒక ‘అస్తిత్వము’ (ఉన్నది అనే భావం) కలిగింది. సూక్ష్మశరీరం లోపల ఉన్నా, బయటకు కనపడే స్థూలశరీరాన్ని ఆడిస్తుంటుంది. కాని బాహ్యప్రపంచానికి కనిపించేది బాహ్యశరీరం కాబట్టి, మానావమానాలు, సత్కారతిరస్కారాలు, పాదాభివందనాలు, నామకరణ, ఉపనయనం, వివాహం అన్నీ బాహ్యశరీరానికే జరుగుతుంటాయి.

ఇక, భావనారూపకమైన మనోవృత్తులు ఎటువంటివంటే – కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, భయం, అనుమానం మొదలైన భావనలతో కూడుకున్నవి. రాగం, ద్వేషం కూడ మనో వృత్తులే – మనిషిలో కలిగే ఆవేదనలకు, దుఃఖానికి ఈ భావనలే ప్రధానకారణాలు. మనిషి చేసే ప్రతి పని ఈ భావనల పరిధిలోనే జరుగుతుంటుంది. మనకు ఒకడిపై ద్వేషం కలిగితే వాడిని సర్వనాశనం చేయటానికి పూనుకుంటాం. వాడు ఏ పని చేసినా మనకు చెడ్డగానే కనిపిస్తుంటుంది. ఆ దృష్టితోనే అతనితో వ్యవహరిస్తాం. మనకు ఒకడిపై ప్రేమ కలిగితే అతని తప్పులన్నీ ఒప్పులుగానే కనిపిస్తాయి. అతను చేసే ఎంతటి స్వల్పకార్యాలైనా మహత్కార్యంగా అనిపిస్తాయి.

ఇక ఆలోచనారూపకమైన మనోవృత్తులను : 1. వాంఛా రూపకమైనవి, 2. విచక్షణా రూపకమైనవి, 3. నిర్ణయాత్మకమైనవి, అని విభజించవచ్చు.

క్రొత్త అనుభవాలను పొందటానికి, అంతకు ముందు అనుభవవించిన వాటిని తిరిగి పొందటానికి కలిగే మనోవృత్తిని ‘వాంఛ’ అనవచ్చు.


మనం తెలుసుకుంటున్న విషయాలను విశ్లేషించి, అందులోగల నిజానిజాలు, మంచిచెడ్డలు తెలుసుకోవటం విచక్షణారూపకమైన ఆలోచనలు. మన దైనందిన వ్యవహారాలలో, క్రొత్త వ్యవహారాలలో పూర్వాపరాలను విచారించి, నిర్ణయం తీసుకోవటానికి దోహదం చేసే ఆలోచనలు నిర్ణయాత్మకమైనవి.

ఇక అనుభూతి పూర్వకమైన మనోవృత్తులు – మనం చూసే ప్రతీ దృశ్యంలో, చేసే ప్రతీ పనివల్ల, ఆలోచించిన ప్రతీ ఆలోచనవల్ల అంతరంగంలో ఒక తృప్తిభావంగాని, అసంతృప్తభావంగాని కలుగుతుంది. తృప్తభావం ఆనందం కలిగిస్తుంది. అసంతృప్తభావం దుఖాన్ని కలిగిస్తుంది.

ఈ స్థూల, సూక్ష్మ శరీరాలను సంధానపరచి (ఒకదానితో ఒకటి చేర్చి), ఆ రెండిటిలో చైతన్యం కలిగించేది ‘ప్రాణశక్తి’. అది లేకపోతే రెండిటి మధ్యలోగల బంధం విడిపోతుంది.

-

No comments:

Post a Comment