Sunday, February 11, 2018

వివేకచూడామణి (18,19, 20వ భాగాలు ) !


-

వివేకచూడామణి (18,19, 20వ భాగాలు ) !

-

శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.

-

18.ముక్తి స్థితి :

సమాధిస్థితిలో బ్రహ్మానుభవం పొందిన మహాపురుషులు ఎందరో మళ్ళీ ఈ లోకానికి తిరిగి రావటానికి ఇష్టపడరు. అందువల్ల సాధారణంగా ఆ సమాధిలోనే దేహత్యాగం చేస్తారు. దానిని విదేహముక్తి అంటారు.

కాని కొందరు బ్రహ్మతత్త్వంలో నిలిచి, ఈ దేహాన్ని విడిచిపెట్టరు. అలాంటి వారిని జీవన్ముక్తులు అంటారు. వారికి ఈ దేహం ఒక నీడలాగ, ఈ బాహ్యప్రపంచం ఒక స్వప్నంగా కనిపిస్తుంటుంది. అలాంటివారు ఈ లోకంతో ఎటువంటి సంబంధంలేని సన్యాసులలాగ గాని, లేక లోకకల్యాణార్థం పాటుపడే కర్మయోగులుగా గాని ప్రవర్తిస్తారు. వారు పనులు చేసినా, చేయకపోయినా, వారికి కర్మఫలమేమీ అంటదు. వారు ఈ లోకంనుంచి కోరేది ఏమీ లేదు. వారు పనిచేయటానికి ఇష్టపడితే అది లోకానికి మహోపకారం అవుతుంది.

-

19.జీవన్ముక్తుడి లక్షణాలు :


వివేకచూడామణిలో జీవన్ముక్తుడైన బ్రహ్మజ్ఞాని లక్షణాలు ఈ విధంగా చెప్పబడ్డాయి :

బ్రహ్మజ్ఞాని సదా బ్రహ్మభావంలోనే నిలుస్తాడు. ప్రారబ్ధకర్మవశాన అతని దేహం ఇటు అటు చరిస్తున్నా, ఆ దేహం వల్ల కలిగే శుభాశుభాలుగాని, మంచిచెడ్డలుగాని ఆ బ్రహ్మజ్ఞానికి అంటవు. ఛాయామాత్రమైన అతని శరీరం ఏమైపోయినా అతనికి అవసరం లేదు. అతడు అన్ని భావాలకు అతీతుడు. కర్మ చేస్తున్నా, చేయకపోయినా అతనిని కర్మఫలాలు బంధించవు. మంటలో దహింపబడ్డ వస్తువులన్నీ బూడిదగా మిగిలినట్లు – జ్ఞానవహ్నిలో దహించవేయబడ్డ ఈ సమస్త ప్రపంచం బ్రహ్మంగానే మిగులుతుంది. అతను బ్రహ్మం, ఉన్నది కూడ బ్రహ్మంలోనే కాబట్టి, అతడు ఎప్పుడూ అద్వయానందంలో ఉంటాడు. సముద్రంలో పడిన పడగలిలాగ అతని జీవాత్మ ఎప్పుడో పరమాత్మలో కలిసిపోయింది. ఆభాస మాత్రమైన దేహం, పండుటాకులాగ ఎప్పుడు, ఎక్కడ రాలిపోయినా అతను లక్ష్యపెట్టడు. బహుశః గుర్తించక

పోవచ్చు కూడా. అతడు స్వతంత్రుడు, నిరంకుశుడు. అతని ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. బాలుడిలాగ, పిచ్చివాడిలాగ, పిశాచంలాగ తిరస్కరింపబడవచ్చు. లేక, మహాపండితుడిలాగ సన్మానింపబడవచ్చు, లేక మూర్ఖుడిలాగ తిరస్కరింపబడవచ్చు. అజ్ఞానిలాగ నిర్లక్ష్యం చేయబడవచ్చు. మానాపమానాలు ఏవీ అతనిని అంటవు. అతడు సదా బ్రహ్మానంద రసాస్వాదనమత్తుడు.

బ్రహ్మవేత్త స్వయంగా బ్రహమే – దేహం కనిపిస్తున్నది కాబట్టి, అతనిని ఒక వ్యక్తిగా మనం భావిస్తున్నాం. పాము విడిచిన పొరకు ఎటువంటి అస్థిత్వం ఉన్నదో, బ్రహ్మజ్ఞాని దేహానికి కూడ అంతటి అస్థిత్వమే ఉన్నది. అందుకే ఆదిశంకరులు అటువంటివారిని కూడ (దేహంతో ఉన్నా) విదేహకైవల్యం పొందినవాడిగా పరిగణించారు. అలాంటి జ్ఞాని బ్రహ్మమే కాబట్టి, అతనికి పునర్జన్మ ఉండదు. బాధ మోక్షాల ప్రసక్తే ఉండదు.

-

20.స్వప్రయత్నం :

ఈ దేహం అనిత్యమని తెలిసినా, ఈ ప్రపంచంలోని ప్రలోభాలలో పసలేదని తెలిసినా, మృత్యుసమయంలో ‘నావి’ అనుకున్నవేవీ తనతో రావని తెలిసినా, మోహజాలంలో చిక్కుకుని, నిరంతరం దుఃఖావేశాలతో పరితపిస్తుండటం ఎంతటి దయనీయావస్థ! ఒక్కసారి, ఈ బాహ్య దృష్టిని లోపలికి మరల్చి, ‘నా నిజతత్త్వమేమిటి’ అని ఆలోచిస్తే, ప్రతి మానవుడికి తన నిజతత్త్వం కొద్దిగనో, గొప్పగనో అర్థంకాక మానదు. అప్పుడు అతను తన చుట్టుప్రక్కలగల ప్రపంచంలో ఏర్పరచుకున్న విలువలలో మార్పురాక మానదు.

ప్రతి సాధనకు మోక్షం సిద్దించకపోవచ్చు. కాని, ఆ సత్యాన్వేషణా ప్రయత్నంలో, ఎన్నో సూక్ష్మ విషయాలను తెలుసుకుని, మనసును, బుద్ధిని వికసింపచేసుకుని, ఒక వినూత్న దృక్పథంతో ఈ ప్రపంచాన్ని చూడటం మొదలవుతుంది. అదే అతని ఆధ్యాత్మ జీవితానికి ప్రారంభం. ఆ జీవితంలో ఉన్న మనశ్శాంతి, ఆనందం ఈ ప్రాపంచిక జీవితంలో వెతికినా కనపడవు.


ఆధ్యాత్మ జీవనపథాన్ని అనుసరించిన మనిషి తిరిగి మరలటం ఉండదు. అదే ముక్తిమార్గం. అందుకు స్వప్రయత్నం అవసరం.


ఓం శాంతిః, శాంతిః, శాంతిః

-

- సమాప్తం -


No comments:

Post a Comment