సంస్కృతంతో నా చెలిమి - V V S Sarma - 4


సంస్కృతంతో నా చెలిమి - V V S Sarma - 4
.
మీరేదో "సంస్కృతం తేలికగా నేర్చుకున్నాను"
(పాండిత్యం కాదు, నిత్యజీవితంలో ఉపకరించే వరకు) అనిచెబుతూ "కుప్పుస్వామయ్యరు మేడ్ డిఫికల్టు"లా చేస్తున్నారే - అని మిత్రులు అనవచ్చు. అది నాకు భాష సరిగారాదు - అని ఛూపిస్తుంది. ఎలాగో ఆంగ్లానువాదంతో బాటుగా గౌతమ న్యాయ సూత్రాలు, అన్నంభట్టు తర్క సంగ్రహం, History of Indian Logic సతీశ్ చంద్ర విద్యాభూషణ్ గారి ఆంగ్ల గ్రంధం చదివి "నిత్య జీవితంలో సత్యాన్వేషణ-న్యాయ శాస్త్ర విచారం" - అని పదో పదకొండో వ్యాసాలు వ్రాశాను. ఇది మా సద్గురువులు శ్రీ శివానందమూర్తి గారు ఆరంభించిన సుపథ పత్రికలో. కాని సంస్కృతంలో ఒక్క వాక్యం మాట్లాడలేను కదా. కాని సంస్కృత శాస్త్ర గ్రంధాలు తెలుగు సరిగా వస్తే చాలా తేలికగా అర్థం అవుతాయి.
ఆన్నం భట్టు తొలి శ్లోకం:
నిధాయ హృది విశ్వేశం విధాయ గురు వందనం
బాలానాం సుఖ బోధాయ క్రియతే తర్క సంగ్రహః
హృదయంలో విశ్వేశ్వరుని నిలుపుకొని, అస్మద్గురు వర్యులకు వందనముచేసి, బాలలకు తేలికగా బోధించుటకు తర్క సంగ్రహం రచిస్తున్నాను. ఇది అర్థంకావడానికి శ్లోకం పై మనసు పెట్టాలి, అంతే సంస్కృతం రానక్కరలేదు..
ఒకసారి మిత్రులు సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యులు వేదుల సుబ్రహ్మణ్యంగారి ఇంటికి వెడితే అక్కడ కోనసీమ నుండి వచ్చిన వారి నాన్న గారు వేదుల సుందర రామశాస్త్రిగారి పరిచయం అయింది ఆయన నా వ్యాసావళి మెచ్చుకున్నారు. ఆయన సంస్కృత వ్యాకరణంతో భాషా ప్రవీణ అని తెలిసినది నాకు సంస్కృతం నేర్పాలండి - అని వారిని అడిగాను. లఘు సిద్ధాంతకౌముది, మీ దగ్గర ఏమన్నా చిన్న పుస్తకాలు ఉంటే తీసుకు రండి అన్నారు. పుస్తకాలు ఎక్కడ ఉంటాయో తెలియదు. కొంత వాకబు చేస్తే వేదాంత బుక్ హౌస్ అని శంకరపురంలో ఉన్నది. అక్కడ దొరకవచ్చు అని చెప్పారు . హదరాబాదు బస్ స్టాండులో చిన్న పుస్తకాలు, రైల్వే స్టేషన్ హిగిన్ బాదమ్సులో తర్కసంగ్రహం దొరికాయి
మనకి తెలుసు, వాక్యంలో కర్త ఉంటే కర్మ, క్రియ ఉంటాయని, ఇంగ్లీషులో subject, predicate ఉంటాయని అలానే సంస్కృతంలో శబ్దం ధాతువు అవ్యయాలు ఉంటాయని చెప్పారు. శబ్ద రూపం విభక్తి తో వచనం తో మారుతుంది తెలుగులోనూ అంతే కదా. ఇక్కడ భాష వచ్చు అక్కడశబ్దం తెలుస్తుంది కాని ప్రత్యయాలు రావు. శబ్ద మంజరి, ధాతు మంజరి దొరుకుతాయేమో చూడండి. అన్నారు ఎలాగ వీటిని వశపరచుకోవడం తెల్లవారగట్ల లేచీ కంఠస్థం చేయండి అన్నారు. 50వ పడిలో అప్పటికే పడిన నాకు ఇది కుదరదని అనుపించింది. ఎలాగో రామ శబ్దం ఏకవచనమన్నా నేర్చుకోండి అన్నారు. రామః (రాముడు), రామమ్ (రాముని) , రామేణ (రామునిచేత), రామాయ (రామునికై), రామాత్ (రాముని కంటె) ,రామే (రామునియందు) , హే రామ (భో రామ)(ఓ రామా). ఇవన్నీ ఉపయోగించిన ఒక చక్కటి శ్లోకం ఉన్నది.
రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచర చమూః రామాయ తస్మై నమః
రామాత్ నాస్తి పరాయణం పరతరం రామస్యదాసోస్మ్యహం
రామే చిత్త లయః సదా భవతుమే భో రామ ! మాముద్ధర
రామో రాజమణి
smile emoticon
రామః రాజమణి) సదా విజయతే = రాజులలో మణియైన రాముడు సదా విజయము పొందును (ప్రథమా విభక్తి), రామం రమేశం భజే = రమకు ఈశుడైన రాముని భజింతును (ద్వితీయా), రామేణాభిహతా నిశాచర చమూః = రామునిచేత నిశాచరుల సేన హతమైనది. (తృతీయా - కర్మణి ప్రయోగము);రామాయ తస్మై నమః,రామా నీకై నమస్కారము (చతుర్థీ), రామాత్ నాస్తి పరాయణం పరతరం రాముని కంటె ఉత్తమమైన ఆశ్రయం లేదు (పంచమీ) రామస్యదాసోస్మ్యహం - అహం రామస్య దాసః అస్మి = నేను రామునియొక్క దాసుడను (షష్ఠీ), రామే చిత్త లయః సదా భవతు మే = సదా రామునియందు నా చిత్తము లయమగునుగాక (సప్తమీ),భో రామ ! మాముద్ధర = ఓ రామా నన్ను రక్షించుము (సంబోదన)

Comments

  1. సంస్కృతంతో నా చెలిమి ఎన్ని భాగం లు
    ?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!