తరుణి ననన్యకాంత...

తరుణి ననన్యకాంత......... (వ్యాక్యత.....భైరవభట్ల కామేశ్వర రావు)
మొన్నీ మధ్య కొత్త రాయలవారు అల్లసాని ప్రసక్తి తెచ్చేసరకి మనసు మనుచరిత్ర మీదకి మళ్ళింది. కాస్త రసాస్వాదన చెయ్యాలనిపించింది. మనుచరిత్ర అనగానే "అటజని కాంచె..." కన్నా కూడా ముందు నాకు గుర్తొచ్చే పద్యం ఇది.

తరుణి ననన్యకాంత నతిదారుణ పుష్పశిలీముఖ్యవ్యధా
భర వివశాంగి నంగభవు బారికి నగ్గము జేసి క్రూరుడై
యరిగె మహీసురాధము డహంకృతితో నని రోషభీషణ
స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్చె గషాయ ధీధితిన్


వరూధిని love at first sightని తిరస్కరిస్తాడు ప్రవరుడు. ఇద్దరికీ మంచి రసవత్తరమైన వాదన జరుగుతుంది. కానీ ప్రవరుడు చలించడు. తన నిష్ఠతో అగ్నిదేవుణ్ణి ప్రార్థించి తనదోవన తను వెళ్ళిపోతాడు. వరూధిని విరహంతో వేగిపోతూ ఉంటుంది. అంతలో పొద్దువాలుతుంది. సూర్యాస్తమయం. దాన్ని వర్ణించే పద్యం ఇది!
మనం ఈ కాలంలో కూడా నవలల్లోనూ కథల్లోనూ వర్ణనలు చూస్తూనే ఉంటాం. ఈ వర్ణనలు చేసే ముఖ్యమైన పని, కథా వేగంలో కొట్టుకుపోతున్న పాఠకులకి కాస్త విశ్రాంతినివ్వడం, ఈ కాలంలో టీవీ సీరియళ్ళ మధ్య విరామంలా  వీటిని కథలో కాలాన్నీ, స్థలాన్ని సూచించడానికి కూడా వాడుతూ ఉంటారు. ఉదాహరణకి ఎండాకాలం వచ్చిందని చెప్పేబదులు, "పగటి వేడి చల్లారక సెగలుకక్కే భూమి అనే పెనం మీద చకోరాలకోసం ప్రకృతిమాత వెన్నెల అట్టుని పోసింది" అంటే ఒకవైపు ఎండాకాలాన్ని సూచిస్తూనే, గొప్ప చమత్కారం మనసుకి హత్తుకుంటుంది కదా! ఇదీ వర్ణనల ఉపయోగం.
అయితే చాలాసార్లు ఇవి తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టుంటాయి. వర్ణనలకీ, కథకీ సంబంధం ఉండదు. కొన్ని సార్లు కవి ప్రతిభ చేత వర్ణనలని కథోచితంగా చేస్తాడు. అప్పుడు కథ మరింత బాగా మనసుకి హత్తుకుంటుంది. ఇది అలాటి పద్యం!
సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఎఱ్ఱగా ఉన్నాడు. ఎందుకలా ఉన్నాడంటే కోపంతో అతని మొహం ఎఱ్ఱబడిందిట. ఎవరిమీద ఎందుకా కోపం అంటే, వరూధినిని అలా వదలి వెళ్ళిపోయిన ప్రవరుడి మీదట!
ఇక్కడ సూర్యుణ్ణి అడ్డంపెట్టుకొని పెద్దన ప్రవరుడి మీద తన కోపాన్ని ఘాటుగా వ్యక్తం చేసాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాటి సందర్భాలలోనే కవిహృదయం తెలిసేది! కథలో పాత్రగా ప్రవరుడిని ఉదాత్తంగానే చిత్రించాలి, లేకపోతే కథ చెడుతుంది. అలా చెయ్యాలంటే ప్రవరుడు వరూధినిని తిరస్కరించాలి. కానీ అది రసికుడైన అల్లసానికి ఇష్టం లేదు. ఏం చేస్తాడు పాపం! అంచేత సూర్యుడి మీద తోసాడు. సూర్యుడలా అనుకున్నాడనడంలో ఎంత చమత్కారం, పైగా అందుకే అతని మొహం ఎఱ్ఱగా ఉందనడం! ఔచిత్యం చెడకుండా, తన హృదయాన్ని వ్యక్తపరుస్తూ, పాఠకునికి చమత్కారాన్ని పండించడం గొప్ప కవిత్వమే కదా.

అయితే ఈ పద్యం తాలూకు గొప్పదనం ఇక్కడితో ఆగిపోదు. ఇందులో ప్రతిపదం ఎంతో సార్థకంగా ప్రయోగించాడు కవి. వరూధినికి వాడిన పదాలు చూడండి - తరుణి - లేత యవ్వనంలో ఉన్న స్త్రీ, అననన్య కాంత - వేరొకరిని వరించలేదు, తననే వరించిందాయెను, అతి దారుణ పుష్ప శిలీముఖ వ్యథాభర వివశాంగి - శిలీముఖం అంటే బాణం. పుష్ప శిలీముఖుడు మన్మథుడు. అతి దారుణమైన మన్మథ బాధతో వశంతప్పిన శరీరం కలది! అలాంటి వరూధినిని ఆ మన్మథుడికి అధీనం చేసేసి క్రూరుడై తనదారిని తాను పోతాడా ఆ బ్రాహ్మణాధముడు! అని తీవ్రమైన కోపాన్ని పూనాడా అన్నట్టుగా ఉన్నాట్ట సూర్యుడు. పెద్దనకి ఎంత ధైర్యం ఉంటే ప్రవరుడంతటి వాణ్ణి పట్టుకొని బ్రాహ్మణులలో అధముడు అని అనగలడు? ఇది ఒక రకంగా పెద్దన కాలంనాటి సాంఘిక పరిస్థితులని కూడా సూచిస్తుంది. నిష్ఠాచారాలకన్నా భోగాలపై ప్రజలకి ఎక్కువ మక్కువ ఆ కాలానికే మొదలయ్యి ఉంటుంది. ఈ కాలంలో ఇదే కథ సినిమాగా తీస్తే ప్రవరుడు వరూధిని కోరికని మన్నిస్తే కాని సినిమా హిట్టవ్వదు:-)
"రోష భీషణ స్ఫురణ" - ఇక్కడ "ష"కార "ణ"కార ఆవృత్తి క్రోధాన్ని స్ఫురింపజేస్తాయి. అలాగే ఎఱ్ఱ రంగుకి వాడిన "కషాయ" అన్న పదం కూడా. ఈ పద్యంలో మొదటిపాదంలో యతి స్థానంలో "దారుణ" అన్న పదం చక్కగా ప్రయోగించాడు పెద్దన. యతి స్థానాన్ని సాధారణంగా కొంచెం వత్తి పలకడమో, దీర్ఘం తీసి పలకడమో చెయ్యాలి, పద్యాన్ని చదివేటప్పుడు. ఇక్కడ "దారుణ"ని సాగదీసి పలికినప్పుడు అది ఎంత దారుణమో స్ఫురిస్తుంది. అలానే మూడవ పాదంలో "అహంకృతి" అన్న పదంలో యతిస్థానంలోని "హం"ని వత్తి పలకడం వల్ల ఆ సూర్యుడి కోపం స్ఫురిస్తుంది!
శబ్దశక్తి తెలిసిన కవులు దాన్ని భావానుకూలంగా ఉపయోగించుకుంటారనేందుకు ఈ పద్యం ఒక చక్కని ఉదాహరణ.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!