భారత్ ఇ౦జనీరి౦గ్ పితామహుడు ,భారతర‌త్న, సర్ మోక్షగు౦డ౦ విశ్వేశ్వరయ్య‌

భారత్ ఇ౦జనీరి౦గ్ పితామహుడు ,భారతర‌త్న, సర్ మోక్షగు౦డ౦ విశ్వేశ్వరయ్య‌







వలసదేశంగా అణచివేతలో ఉన్నప్పుడూ, స్వాతంత్య్రం తెచ్చుకుని తప్పటడుగుల నడక సాగిస్తున్నప్పుడూ, రాజకీయ నాయకత్వం తమ ప్రతిభను ఇంకా రుజువు చేసుకోవలసి ఉందని జాతి భావించిన కాలంలోనూ భారతదేశ ప్రాభవాన్ని చాటినవారు ఇక్కడి శాస్తవ్రేత్తలు, సాంకేతిక నిపుణులు, కళాకారులు, సాహితీమూర్తులే.

దేశం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆర్యభట్టు, శుశ్రుతుడు, చరకుడు, ఆపస్తంభుడు, పాణిని, భాస్కరుడు, తరువాత సీవీ రామన్, జగదీశ్‌చంద్రబోస్, శ్రీనివాసరామానుజన్ వంటి వారి ఘనతను, ఆయా రంగాలకు ఆ మహనీయులు చేసిన సేవను విస్మరించే సాహసం ప్రపంచం చేయలేదు. ఆ కోవకు చెందిన వారే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సెప్టెంబర్ 15, 1860న విశ్వేశ్వరయ్య జన్మించారు. విశ్వేశ్వరయ్య గారిని స్మరించుకోవడం అంటే వ్యక్తి జ్ఞానసంపదకీ, దేశాభ్యున్నతికీ మధ్య ఉన్న అన్యోన్య బంధాన్ని గుర్తుకు తెచ్చుకోవడమే. నీటి పారుదల రంగానికి కొత్త దిశను నిర్దేశించిన ఇంజనీర్‌గా, ఆధునిక కర్ణాటక నిర్మాతగా, పండితునిగా ఆధునిక భారతదేశ చరిత్రలో సమున్నత స్థానం పొందిన విశ్వేశ్వరయ్య పూర్వీకులు నేటి ప్రకాశం జిల్లా గిద్దలూరుకు సమీపంలో ఉన్న మోక్షగుండం గ్రామస్తులే. విశ్వేశ్వరయ్య జన్మించడానికి మూడు శతాబ్దాల క్రితమే ఆ కుటుంబం మైసూరు సంస్థానంలోని (నేటి చిక్‌బళ్లాపూర్ జిల్లా) ముద్దెనహళ్లికి తరలివెళ్లింది.

తండ్రి శ్రీనివాసశాస్ర్తి ఆయుర్వేద వైద్యుడు, వేదనిధి. తల్లి వెంకాయమ్మ. తమ మూలాలకు గుర్తుగా ఇంటిపేరును ‘మోక్షగుండం’ అని మార్చుకున్నారు. విశ్వేశ్వరయ్య పదిహేనవ ఏట తండ్రిని కోల్పోయినపుడు కూడా కర్నూలుతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఆ కుటుంబీకుల మాతృభాష తెలుగే. ప్రాథమిక విద్య చిక్‌బళ్లాపూర్‌లోను, బెంగళూరులోను జరిగింది. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ. (1881), పుణే సైన్స్ కాలేజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టాలు తీసుకున్నారు. చదువు పూర్తికాగానే బాంబే ప్రజాపనుల శాఖలో ఉద్యోగం వచ్చింది.

తరువాత భారత నీటిపారుదలశాఖలో చేరవలసిందిగా ప్రభుత్వం ఆహ్వానించింది. వరద నిరోధానికి ఉపకరించే ఆటోమాటిక్ ఫ్లడ్‌గేట్స్ విధానాన్ని మొదటిసారి 1903లో పుణే సమీపంలోని ఖదకవల్సా జలాశయానికి ఏర్పాటు చేసి ఎంతో ఖ్యాతి గడించారు. ఇదే పరిజ్ఞానంతో గ్వాలియర్, కృష్ణరాజసాగర్ జలాశయాల వరద ముంపును తప్పించారు. కావేరి మీద నిర్మించిన కృష్ణరాజసాగర్ జలాశయం ఆనాటికి ఆసియాలోనే పెద్దది. అయితే హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించే ఏర్పాట్లు చేసిన తరువాత ఆయనకు మరింత ఖ్యాతి వచ్చింది.

విశాఖ నౌకాశ్రయాన్ని సాగర జలాల కోత నుంచి తప్పించడానికి పథక రచన చేసిన వారు కూడా విశ్వేశ్వరయ్య గారే. 1908లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తరువాత కొద్దికాలం నిజాం ప్రభుత్వంలో చీఫ్ ఇంజనీర్‌గా పని చేశారు. మూసీ నుంచి తరచుగా వరద ముంపును ఎదుర్కొంటున్న హైదరాబాద్ నగరాన్ని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను నిర్మించి రక్షించిన ఖ్యాతి ఆయనకే దక్కుతుంది. 1909లో మైసూరు సంస్థానం చీఫ్ ఇంజనీర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1912లో ఆ సంస్థానానికే దివాన్ అయ్యారు. ఐదవ కృష్ణరాజ వడయార్ మద్దతుతో మైసూరు (నేటి కర్ణాటక) స్వరూపాన్నే ఆయన మార్చివేశారు. మైసూరు ఐరన్ అండ్ స్టీల్ కర్మాగారం (ఇప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఉక్కు కర్మాగారం), భద్రావతి స్టీల్, జయచామరాజేంద్ర పాలిటెక్నిక్, మైసూరు విశ్వవిద్యాలయం, బ్యాంక్ ఆఫ్ మైసూరు, కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ వంటి ఎన్నో సంస్థలకు, పరిశ్రమలకు ఆయనే రూపకల్పన చేశారు. తిరుపతి-తిరుమల ఘాట్‌రోడ్ నిర్మాణంలో కూడా ఆయన కృషి ఉంది. 1915లో ఆయన దివాన్‌గా ఉండగానే బ్రిటిష్ ప్రభుత్వం సర్ బిరుదుతో సత్కరించింది. 1955లో స్వతంత్ర భారత ప్రభుత్వం భారతరత్నతో సన్మానించింది. 102 సంవత్సరాల పరిపూర్ణ జీవితంలో ఎన్నో అద్భుతాలు సాధించి, చరిత్ర సృష్టించిన విశ్వేశ్వరయ్య ఏప్రిల్ 14, 1962లో బెంగళూరులో కన్ను మూశారు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!