మీగడపెరుగుతో మేళవించిన చల్ది, ఊరగాయలూ తెలుగుదనపు ఘుమఘుమలు

కడుపున దిండుగా గట్టిన వలువలో

లాలిత వంశనాళంబు జొనిపి

విమల శృంగంబును వేత్ర దండంబును

జాఱి రానీక డా చంక నిఱికి

మీగడపెరుగుతో మేళవించిన చల్ది

ముద్ద డాపలి చేత మొనయ నునిచి

చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు

వ్రేళ్ళసందులయందు వెలయ నిఱికి


సంగడీల నడుమ జక్కగ గూర్చుండి

నర్మభాషణముల నగవు నెఱపి

యాగభోక్త కృష్ణు డమరులు వెఱగంద

శైశవంబు మెఱసి చల్ది గుడిచె...

(పోతనామాత్యుడు)


ఆవుల్ని తోలుకొని ఊరుబయట వనంలోకి గోపాలకులందరూ వచ్చారు. భోజనం వేళ అయ్యేసరికి తెచ్చుకున్న చల్ది తినాలని అందరూ కూర్చున్నారు. కృష్ణుడి చేతిలో ఎప్పుడూ మురళి ఉంటుంది కదా! మరి అన్నం తినేదెలా? ఆ వంశనాళాన్ని (అంటే వెదురు గొట్టం!) తన నడుము చుట్టూ చుట్టగా కట్టుకున్న తుండుగుడ్డలో జొనిపాడు. అంతేనా - ఆవులని అదిలించేందుకు చిన్న బెత్తము (వేత్రదండం), కొమ్ముబూరా కూడా ఉన్నాయి చేతిలో. వాటినేమో జాఱిపోకుండా ఎడం చంకలో ఇఱికించాడు. అదే చేతిలో చలిది ముద్దని అదిమి పట్టుకున్నాడు. మాములు చల్దన్నమా అది! చక్కని చిక్కని మీగడపెరుగుతో కలిపినది. మరి ఆ పెరుగన్నంలో నంచుకోడానికి ఏమిటున్నాయి? చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలున్నాయి. అంటే ఇంకాస్త కావాలి, ఇంకాస్త కావాలని బతిమాలో పేచీపెట్టో తెచ్చుకున్న ఊరగాయ అన్నమాట! అది వ్రేళ్ళ సందుల్లో ఇఱికించాడు. హాయిగా స్నేహితుల మధ్య (సంగిడీలు - స్నేహితులకి చక్కని తెలుగుపదం) కూర్చుని, ఊసులాడుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ చక్కగా చల్ది ఆరగిస్తున్నాడు చిన్ని కన్నయ్య. చేతిలో ఉన్న వేణువునీ బెత్తాన్నీ కొమ్ముబూరనీ పక్కన పెట్టవచ్చు కదా! అలా తన దగ్గరే అట్టేపెట్టుకోడంలో బాలకృష్ణుని పసితనం మన కళ్ళకిగడుతుంది. అదీ పోతన వర్ణనలోని అందం! మీగడపెరుగుతో మేళవించిన చల్ది, ఊరగాయలూ తెలుగుదనపు ఘుమఘుమలు. వాటిని మీగడతరకల్లాంటి తెలుగుపదాలతో మేళవించి తెలుగు చిన్నారి కిట్టమూర్తిని మన కళ్ళముందుంచాడు పోతన.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!