పెళ్ళాల పాదతాడనం దేవుళ్ళకి శిరోధార్యం!

పెళ్ళాల పాదతాడనం దేవుళ్ళకి శిరోధార్యం!

భార్య పాదతాడనం రుచిచూసిన దేవుడనగానే మనకి గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడొక్కడే. అదికూడా, మన నంది తిమ్మనగారి పుణ్యమా అని తెలుగు కృష్ణుడికి మాత్రమే దక్కిన భాగ్యమది. మరి టపా శీర్షికలో "దేవుళ్ళు" అని బహువచనమేమిటి? మరో దేవుడు కూడా భార్య చేత తన్నించుకున్నాడా?! అన్న అనుమానం ఈపాటికి మీకు కలిగుండాలి. అవును, భార్య చేత తలదన్నించుకున్న దేవుడు మరొకడున్నాడు. అసలు నంది తిమ్మనగారి కృష్ణుడికి స్ఫూర్తినిచ్చింది కూడా ఆ దేవుడే అని నా నమ్మకం. అతనెవరో ఆ సందర్భమేమిటో తెలుసుకొనే ముందు, నంది తిమ్మనగారి పారిజాతాపహరణ కావ్యంలో మనందరికీ పరిచయమైన పద్యాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం.

జలజాతాసన వాసవాది సుర పూజాభాజనంబై తన
ర్చు లతాంతాయుధు గన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునన్
దొలగన్ ద్రోచె లతాంగి, యట్లయగు, కాంతుల్ నేరముల్ సేయ పే
రలుకన్ బూనినయట్టి కాంత లుచితవ్యాపారముల్ నేర్తురే!

ఈ సన్నివేశాన్ని ఎరుగని వారుండరు కదా. పారిజాతాపహరణ కావ్యం గురించి తెలియకపోయినా, శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమాలో "అలిగితివా సఖీప్రియా..." పాట, చాలామందికి తెలిసే ఉంటుంది. నారదుడు తెచ్చి యిచ్చిన పారిజాతపుష్పాన్ని తనకివ్వకుండా రుక్మిణికి యిచ్చాడని సత్య అలకబూనుతుంది. ఆమె అలక తీర్చే ప్రయత్నంలో చివరికి ప్రేమతో ఆమె కాళ్ళకి మ్రొక్కుతాడు శ్రీకృష్ణుడు. సత్యభామ చిగురులవంటి పాదాల ఎఱ్ఱని వెలుగులు తన కిరీటములోని మణికాంతులకి వన్నెపెట్టే విధంగా తలవంచి ఆ పాదాలని మ్రొక్కాడట! నిజంగా తానేదో అపరాధం చేసేశానన్న పశ్చాత్తాపంతోనా? అబ్బే! కృష్ణుడంటే ఎవరు? జగన్నాటకసూత్రధారి. అదంతా ఆయనకొక లీక. శృంగారలీల. అప్పుడేమయ్యింది? అతడు కోరుకున్నదే జరిగింది! బ్రహ్మేంద్రాది దేవతలచేత పూజింపబడే ఆ తలని తన ఎడంకాలితో త్రోసేసిందా భామ.

పద్యాలలో పదాలని ఆచితూచి వెయ్యడంలో దిట్ట నంది తిమ్మన. బ్రహ్మేంద్రాది దేవతలచే పూజింపబడేది అని చెప్పి ఊరుకో లేదు చూసారా. అది "లతాంతాయుధు కన్నతండ్రి" శిరసు అని కూడా మనకి గుర్తుచేసారు. అక్కడుంది కీలకం! లతాంతము అంటే లత చివరల పూచేది, పువ్వు అని అర్థం. లతాంతాయుధుడంటే సుమశరుడయిన మన్మథుడు, శృంగారదేవత. అతని తండ్రి అంటే సర్వ సృష్టిలోని శృంగారానికి కారణభూతమైన వాడన్న మాట. దీనివల్ల మనకి ధ్వనిస్తున్న విషయమేమిటి? సత్యభామ చేష్టని శృంగార రస దృష్టితోనే చూడాలి తప్ప ఏదో పరమపూజనీయమైన ఆ శిరసుకి అవమానం జరిగిందని భావించకూడదు సుమా అని కవి మనలని హెచ్చరిస్తున్నాడు. ఆ శిరసు ఎంతటి పూజనీయమైనదైనా కావచ్చు. కాని ఆ సన్నివేశంలో అది మన్మథ జనకుని శిరసు. శ్రీకృష్ణుడు  శృంగారనాయకుడు. ఆ చేష్ట శృంగారలీల. అందుకే ఆ తాకిడికి శ్రీకృష్ణుడు "ఉద్దీపిత మన్మథ సామ్రాజ్యాన్ని" పొందాడని తర్వాతి పద్యంలో అంటాడు తిమ్మన.  పైగా, తన్నినది ఎవరు? "లతాంగి". అతను లతాంతాయుధు కన్నతండ్రి, ఈమె లతాంగి. పొత్తు సరిగ్గా కుదరింది. లతలాంటి మేను ఎంత సున్నితంగా ఉంటుంది! అందుకే ఆ తాకిడికి ఆయనగారి మేను పులకించింది. ఆ పులకల ములుకులు ఆమె పదపల్లవానికి గుచ్చుకుంటే ఎక్కడ నొప్పి కలుగుతుందోనని తెగ బెంగపడ్డాడట ఆ కపట గోపాలుడు! ఆమె "నెయ్యపు కినుక"తో ("ప్రణయకోపాని"కి ఎంత ముచ్చటైన తెలుగు పదం!), తనని తన్నినా అది మన్ననే అని కూడా అంటాడు. అదంతా ఒక రసరమ్య విలాసం. దాన్ని తన ముద్దుముద్దు పలుకులతో మనోహరంగా చిత్రించాడు నంది తిమ్మన.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.