ప్రాభాతి ..............(కరుణశ్రీ)

ప్రాభాతి ......

........(కరుణశ్రీ)

రేగిన ముంగురుల్ నుదుట ప్రేమ సుధా మధురైక భావముల్

ప్రోగులు వోయగా నిదురపోవు దయామయి! నా యెడందలో

ఆగక పొంగు స్వాప్నిక రహస్యము లెవ్వియొ నీదు గుండెతో

దాగుడు మూత లాడ సరదా పడుచున్నవి కన్నులెత్తుమా!

ఈ గిజిగాని గూడు వలెనే మలయానిల రాగడోలలో

నూగుచునుండె నా తలపు లూరక; నీ కబరీ భరమ్ములో

మాగిన కేతకీ సుమ సమంచిత సౌరభవీచి పై పయిన్

మూగి స్పృజించి నా హృదయమున్ కదిలించుచునుండె ప్రేయసీ

రాగము నందుకొన్నది తరంగిణి; బాలమరీచి మాలికిన్

స్వాగతమిచ్చె పద్మిని; హసన్ముఖియై మన దొడ్డిలోని పు

న్నాగము కుప్పవోసె సుమనస్సులు, కోవెలలో విపంచికల్

మ్రోగెను; లెమ్ము! పోదము! ప్రమోదముతో మన మాతృపూజకున్


Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.