పాత సినిమా కబుర్లు రచన: రావి కొండలరావు !

నీకు నేను.., నాకు నువ్వు రికమెండేషన్.!

(
పాత సినిమా కబుర్లు రచన: రావి కొండలరావు )

.

జూనియర్ భానుమతి అనీ – హాస్యపాత్రధారిణి. ఒక షూటింగ్‌లో రమణారెడ్డి తక్కిన వాళ్లు ఉన్నారు. భానుమతి కూడ ఉంది. మధ్యాన్నం భోజనాలారగించాక అంత తీరిగ్గా కూచుని ఉండగా – సదరు భానుమతి రెడ్దిగారిని ఓ మాట అడిగింది. “సర్… మీరు భరణీ వాళ్ళ సినిమాలో బుక్కయినారట మీ పక్కనో వేషం వుందిట – దానికి నా పేరు చెప్పరా?” 

అని అడిగింది. రమణారెడ్డి ‘ఆఁ’ అని అటూ ఇటూ చూశారు ప్రశ్నార్థకమూ ప్లస్ ఆశ్చర్యార్థకమూ మిళాయించి. ఏం చెబుతారో అని భానుమతి కూడా ఆత్రుతగా చూసింది.

“అవును – భరణీ వారు కొత్త సినిమా మొదలెడుతున్నారని తెలుసులే. కానీ నాకింతవరకూ ఏ కబురూ లేదు. ఉన్నానని నువ్వు చెబుతున్నావు గనుక. 

ఓ పని చెయ్యి. నువ్వు ఓపిక చేసుకుని భరణీకి వెళ్ళి – నాకు ఆ వేషం రికమెండ్ చేసి, ఇమ్మని పట్టు పట్టు. నన్ను వాళ్ళు బుక్‌చెయ్యగానే – నా పక్కన వేషం వుందా అని అడిగి, అప్పుడు తప్పకుండా నిన్ను రికమెండ్ చేస్తాను” అన్నారు రమణారెడ్డి – తాను చిరునవ్వు అయినా నవ్వకుండా పక్కన వున్న నాలాంటివాళ్ళను గొల్లున నవ్విస్తూ.

.

ఒకసారి రేలంగి గారు చెప్పారు:

“సి.పుల్లయ్య గారి డైరక్షన్‌లో యాక్ట్ చేస్తున్నాను. డైలాగు ఇంకోలా మార్చి చెప్తే బాగుంటుందేమో అనిపించింది. కానీ పుల్లయ్య గారంటే – పుల్లయ్యా 

ఆ పులితో చెప్పడమా! పైగా ఆయన దగ్గర నేను కుర్రాడిలా వుంటూ అన్ని 

పన్లూ చేసేవాణ్ణి ఏదో ఆయన దయవలనే నాకు మంచి వేషాలు వచ్చాయి! 

ఐనా తెగించి “సర్-ఇది ఇలా చెప్తే బాగుంటుందేమో సర్, 

బాగా నవ్వొస్తుంది” అన్నాను వినయంగా.

“మళ్ళీ చెయ్యి” అన్నారు పుల్లయ్యగారు. ఆయన గొల్లుమని నవ్వారు. కడుపు పట్టుకుని విపరీతంగా నవ్వారు. దగ్గు వస్తున్నా విపరీతంగా నవ్వుతూనే వున్నారు. ఆయన నవ్వు చూసి నేను మురిసిపోతున్నాను. ఆనందించేస్తున్నాను….” నా కామెడీ అయిడియ అంత గొప్పదన్నమాట” అని ఊహించుకుంటూ – ఆనందమే ఆనందం.

రెండు నిమిషాల తర్వాత ఆయన టక్కున నవ్వు ఆపి నా వేపు చూశారు. “బావుంది రేలంగీ… బావుంది… కానీ ఇప్పుడొద్దు. ఇంకో పిక్చర్‌లో పెట్టుకుందాం” అన్నారు సీరియస్‌గా అంతే! ఆయన చమత్కారానికి నవ్వాల, ఏడవాలా? ఏం చేయ్యాలో తెలీక వెర్రివెధవ మొహం వేసుకుని బయటికి వెళ్లిపోయాను.”

తెల్లవైనా నమ్ముకో..

లేదా నల్లవైనా నమ్ముకో..

.

వేలాది లక్షలాది కళ్లు-తెరమీద చూసే సినిమాకి మాత్రం రెండే కళ్లు. ఆ రెండు కళ్లూ “నిర్మాతా,దర్శకుడూనూ” అంటుంది సినిమా పరిశ్రమ. ఈ రెండుకళ్లూ సినిమా నిర్మాణాన్ని చత్వారం కళ్లతో కాకుండా, స్వచ్చమైన చూపుతో చూడాలి. అంత బాగా సుస్పష్టంగా ఈ కళ్లు చూడగలిగితేనే, తెరమీది బొమ్మని కూడ ప్రేక్షక నేత్రాలు అంత తేరిపార చూడగలుగుతాయి.

అయితే ఈ రెండు కళ్లూ అన్నింటినీ “సమాన దృష్టి”తో చూడగలగాలి. చూడాలి. అందుకు బాగా అనుభవం ఉండాలి. ఏ కంటికీ హ్రస్వదృష్టి వుండకూడదు. రెండు కళ్ళకీ దూరదృష్టి. దీర్ఘదృష్టీ కొండొకచో దివ్యదృష్టి కూడా వుండాలి. ఓ కంటికి హాస్వదృష్టి ఉంటే మాత్రం హాస్యమే.

.

అలాంటి కన్ను గల ఒక నిర్మాత (నేను ఆ కంపెనీలో పనిచేశాను గనక, అనుభవం సంపాయించాను గనక – ఆ హాస్వాక్షుని పేరు చెప్పడం బాగుండదు) ఆయన రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించే సరికి సర్వం విషాదమై పోయింది. కొంప మునిగిపోతోంది, ఇక లాభం లేదని మూడో సినిమాకి తానే “దర్శకుడూ, నిర్మాతా” అని ప్రకటించేసుకుని రంగంలోనికి దూకాడు.

నిర్మాతగా రెండు సాంఘికాలయినాయి గనక, స్వీయ దర్శకత్వంలో జానపదం తియ్యాలని సంకల్పించి కథా చర్చలకి దిగాడు. దిగడం అంతే ఏమిటి-అన్నీ తానే. తానుగా నాలుక్కాయితాల్లో రాసిన కథా సంగ్రహాన్ని-లేదా సంగ్రహ కథని-రచయితకి చూపించాడు. “మీరు కచ్చితంగా చెప్పండి మీ అభిప్రాయం. ఎలా వుంది కథ?” అని అడిగాడు.

అంత కచ్చితంగా చెప్పమన్నాడు కదా అని రచయిత నిర్మొహమాటంగా “అంత బాగులేదు. సువర్ణ సుందరి, పాతాళభైరవి, గుణసుందరి కథ లాంటివన్నీ గుర్తొచ్చాయి. కథ కలగాపులగంగా వుంది” అని చెప్పేసేసరికి, నిర్మాణ నేత్రం అయిన నిర్మాత కళ్లు ఎర్రబడ్డాయి. ఆ ఎర్రకళ్లతో రచయితని చూసేసరికి, రచయిత కళ్లు. హరిణ నేత్రాలయిపోయి, శరీరం చలికి వణికినట్టు వణికిపోయింది.

.

“నేను వేరే రచయిత చేత స్క్రిప్టు రాయిస్తాను. మీరొద్దు” అని నిర్మోహామాటంగా అతని మొహం మీద చెప్పి, కథాసార పత్రాల్ని ఊడలాక్కునాడు.

.

తనే రాయగలడు. తన ఉద్దేశాలు ఇంకొకడికి నూరిపోసి రాయించడంకంటే, తానే రాసుకోడం సులభం కదా! తనే పాటలు, మాటలూ, అంతకు ముందు సినిమాల్లో ఒక్కో పాటా రాసిన తను అన్ని పాటలూ అవలీలగా రాసేయగలడు. రాశాడు. సంగీత దర్శకుడిని పిలిపించాడు.

“ఈ పాటలకి వరసలు కట్టు. నవరసంగా వుండాలి. కాచీగానూ, క్లాసికల్ గానూ వుండాలి. ఇట్టు చెయ్యి” అంటూ పాటల కాయితాలు ఇచ్చాడు.

సం.ద.ట్యూన్లు కట్టడం మొదలు పెట్టి హార్మొనీ మెట్లతో మేడమెట్లు కట్టినట్టు కడుతున్నాడు. దర్శక నిర్మాతకి నచ్చడం లేదు. పక్కనే కూచుని హార్మోనీ వాయించడం చూస్తున్నాడు గనక, తనే అందులోనూ జొరబడి పయి వేళ్లు కదిపేయాలని ఉబలాట పడిపోతున్నాడు గాని, ఆ పని చెయ్యలేదు. అతను చేసిన వరసలు బాగులేవు.

.

రెండు రోజుల మ్యూజిక్ సిట్టింగ్స్ తర్వాత, దర్శక నిర్మాత కచ్చితంగా చెప్పేశాడు ట్యూన్‌లు ఎందుకు బాగులేవో “చూడూ! నువ్వు హార్మోనీ వాయిస్తున్నావు గదా, నల్ల మెట్లూ తెల్లమెట్లూ రెండూ ఎందుకు వాయిస్తావు? దేన్నో ఒక దాన్ని నమ్ముకో, నల్లవైనా వాయించు, తెల్లవయినా వాయించు. ఇవీ అవీ కలిపి వాయిస్తే నీకు మంచి ట్యూన్ ఎలా వొస్తుంది?” అన్నాడు.

దాంతో సంగీత దర్శకుడు, తబలిస్టూ పకపకా వస్తున్న నవ్వుకి ఆనకట్ట కట్టడానికి ప్రయత్నిస్తూ దర్శక నిర్మాత గారు “హ్యూమరథం” స్పీడుకి బ్రేక్ వెయ్యాలని చూసి లాభం లేదని గొల్లుమని నవ్వేశారు. 

తెల్లవీ, నల్లవి కలిపి వాయిస్తేనే ట్యూన్ అవుతుందని ఆయనకి చెప్పాలా-కూడదా? అది అజ్ఞానమా, అమాయకత్వమా?

.

నవ్వుతున్న సంగీత దర్శకుడికి, తన మాటల్లో నవ్వు రావడానికి కారణం ఏమిటని దర్శక నిర్మాత వెర్రిమొహం వేసి చూడసాగాడు. నవ్వు ఆపుకుని, సంగీత దర్శకుడు లాభం లేదని, హార్మొనీ మెట్ల గురించి, సరిగమల గురించీ రెండు మాటలు చెప్పి రెండు పాటలు కంపోజ్ చేసి రెండు పూటల్లో వినిపిస్తానని మాట ఇచ్చాడు.

ఆ సంగీత దర్శకుడు అశ్వత్థామ. తెల్లమెట్లు నల్లమెట్లు కలిపితేనే మెట్టు వస్తుందని తెలియని మహా పండితుడి దగ్గర పనిచేస్తున్నందుకు సిగ్గు పడిపోయిన అశ్వత్థామ! “

నేను మీ పాట రచనలో వేలు పెట్టను. మీరు హార్మొని మీద వేలు పెట్టకండి” అని సీరియస్‌గా చెప్పి పాటలు రికార్డు చేశాడు.

రికార్డింగులో కూడా ద.ని (దర్శకనిర్మాత) “పదనిమగ” అంటారేం? వరసగా సరిగమ పదని అని వేస్తేనే గదా వరస బావుంటుంది!” అని స.ద(సహాయ దర్శకుడు) దగ్గర మళ్లీ గొణిగాడే గాని, గట్టిగా నొరెత్తలేదు.

దిక్కు తోచలేదు…

ఆ సినిమా షూటింగుకే, ఆ ద.ని. గారు స్టూడియోలో సెట్టు వేస్తున్నారు. వెయ్యడం అయిపోయింది. బాక్‌గ్రౌండ్ పెయింటింగ్స్ చేస్తున్నారు. ద.ని వచ్చాడు చూడ్డానికి. సెట్టులో ఒకవేపు ‘గోడ’కి సూర్యోదయం ఎఫెక్ట్‌తో సంధ్య వర్ణం వేశారు. సూర్యోదయ సమయంలో అక్కడ దృశ్యం జరుగుతుంది గనక. ద.ని అటూ ఇటూ చూసి, ఉగ్రనేత్రుడయ్యాడు. ప్రొడక్షన్ మేనేజర్నీ సహాయ దర్శకుల్నీ దగ్గరికి పిలిచి- “తూర్పు ఏ పక్క?” అని అడిగాడు. అందరూ చూపించారు. సూర్యోదయ వర్ణం వున్న గోడని చూపించి, “ఇది ఏ పక్క?” అని అడిగాడు. “ఉత్తరం అన్నారంతా కోరస్‌లో.

“మరి, సూర్యోదయం ఉత్తర దిక్కుకి పెయింట్ చేస్తే మీరంతా ఏం చేస్తున్నారయ్యా?” అని ఉరిమాడు- ద.ని. సినిమా సెట్లో ఏ పక్క సూర్యోదయం వుంటే అదే తూర్పు అవుతుందనీ, సెట్టులో అ తేడా తెలీదని తెలియని ద.ని. అజ్ఞానానికి నవ్వాలో, ఏడవాలో తెలీక మేనేజరూ సహయకులూ తెల్లమొహాలు వేసి, వాటిని వెర్రి మొహాలుగా మార్చుకుని ద.ని.ని పిచ్చివాడిని చూసీ చూడనట్టు చూశారు.

కట్ కే కష్టం…

షూటింగులో, నటీనటులకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో ద.ని,కి తెలీదు. స.ద (సహకార దర్శకుడు) చేత చెప్పించేవాడు. అనుమానాలు అడిగితే, నీళ్లు నమూల్తూనే, “రెడీ, టేక్” అనేవాడు ఆయనగారి అజ్ఞాన ప్రతిభని అర్థం చేసుకున్న “హేరో”గారు (పెద్ద హీరోయే) “ఎందుకొచ్చిన గొడవ! ఏదో చెప్పింది విని, చేసేసుకుని పోదాం. కొన్ని డబ్బు కోసం చేసే సినిమాలుంటాయి” అని నచ్చజెప్పుకుని, తన పనేదో తాను చేసుకుపోయాడు.

ఏ షాటుకి ట్రాలీ వెయ్యాలో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెయ్యాలో, ఏ షాటుకి ఏ లెన్స్ వెయ్యాలో ద.ని,కి తెలియదని, చాయాగ్రాహాకుడికి (అన్నయ్య) తెలిసిపోయి, తానే అన్నీ చూసుకున్నాడు. షాట్ అయ్యాక, ఎక్కడ కట్ చెప్పాలో తెలీక ద.ని. దిక్కులు చూస్తూంటే స.ద. మెల్లిగా ‘కట్ చెప్పండి సార్’ అని ప్రాంప్టింగ్ ఇచ్చేవాడు. “స్టార్ట్” చెప్పడానికి, అనుమానం వుండేది కాదాయనకి. కట్ చెప్పడమే సమస్య.

సగానికి పైగా కలరు…

అంతకుముందు సినిమాలకి తాను నిర్మాత మాత్రమే. అంచేత షూటింగులకి ఎక్కువగా వచ్చేవాడు కాదు. వస్తే అదీ అదీ అంటారని. షాట్స్ రాసే కంటిన్యుటీ పుస్తకంలో కొత్త ‘కాలం’ ఒకటి ప్రవేశ పెట్టాడు. “రీజన్ ఫర్ రీటేక్” అని. షాట్సు మళ్లీ తీస్తే ఎందుకు తీశారో ఆయన ఆఫీసులో కూచుని చూసేవాడు. “రీజన్ ఫర్ రీ టేక్”లో హీరో డైలాగు మరిచిపోయాడనో, ట్రాలీ సరిగా వెళ్లలేదనో వుంటే, “హీరో ఎందుకు డైలాగు మరిచిపోయాడు? మీరు సీను ఇవ్వలేదా? అతను కంఠతా ఎందుకు పెట్టలేదు? ఆ బాధ్యత మీదే కదా!” అని అరిచేవాడు.

ఈ సినిమాకి తానే రెండూ దర్శకుడు, (నిర్మాత) గనక, “రీజన్ ఫర్ రీటేక్” కాలమ్ తీయించేశాడు. ఎంచేతంటే తన తప్పులే ఎక్కువుంటాయి గనక; ఆ విషయం తనకి క్షుణ్ణంగా తెలుసు గనక!

ఎలాగోలా, తప్పటడగులు వేస్తూ దారి తప్పుతూ మళ్ళీ తెలుసుకుంటూ-సినిమా పూర్తయింది. “బ్లాక్ అండ్ వైట్” సిన్మాయే అయినా, నావల్టీ అని కొంత కలర్‌లో తీయించాడు ద.ని. పబ్లిసిటీలో చిత్రం పేరు కింద “సగానికి పైగా కలరు” అంటూ రాయించి వేయించాడు. కొన్ని పాటలు, కొన్ని దృశ్యాలు మాత్రమే రంగుల్లో వున్నాయి. సినిమా విడుదలైంది. ప్రొజెక్టర్లలో సజావుగానే నడిచింది గాని, థియేటర్లలో నడవలేదు.

ద.ని.సినిమా పేరు కింద బాడిన “సగానికి పైగా కలరు” అన్నదాన్ని వ్యాఖ్యాతలు ఇంకోరకంగా వాడుకున్నారు. “థియేటర్లో ప్రేక్షకులు సగానికి పైగా కలరు” అని! ఆ విధంగా హ్రస్వాక్షుడైన ఆ నిర్మాత-తన అజ్ఞానాహంకారాల వల్ల నష్టపోయాడని సారాంశం!

రియల్ షూటింగ్..

దర్శక నిర్మాత శ్రీధర్ (నాగేశ్వరరావు, సరోజా దేవి నటించిన ‘పెళ్లి కానుక’ ఇత్యాది తీసినవారు)మూడు భాషల్లో ఒక చిత్రం తీశారు. తెలుగు, తమిళం, కన్నడం. ఆ సినిమా బెంగుళూర్లో కొంత షూటింగు జరిగింది. ఒక షాటు తర్వాత ఒక షాటు చొప్పున మూడు భాషల్ని ఒకే సారి తీశారు. ఆయా భాషల నటులతో, తెలుగులో నేను, (తక్కిన రెండు భాషల్లో నా వేషం వేసినవారు గుర్తు లేదు).

మధ్యాహ్నాం వరకూ ఒక దృశ్యం షూట్ చేసి, మధ్యాహ్నం తర్వాత ఒక ఇంటిముందున్న లాన్లో చెయ్యాలి. వెతికారు. ఒక చోట ఒక ఇల్లు కనిపించింది. ఇల్లు అన్నమాట ఆ ఇంటికి చిన్నది.”పెద్ద బంగళా” అనాలి. దానిముందు ఆకు పచ్చ దట్టమైన తివాసీ పరిచినట్టు – పెద్ద అందమైన లాన్. అది దర్శక నిర్మాతనీ తక్కిన వారినీ ఆకర్షించింది. “అడుగుదాం. ఇస్తే ఇస్తారు లేకపోతే ఇంకోటి అడగొచ్చు” అనుకున్నారు, అడిగారు.

.

ఆ బంగాళాధిపతి బంగళాదేశీయుడు కాదు గాని, ఉత్తర రాష్ట్రీయుడు. మిలిటరీలో పెద్ద ఉద్యోగం చేసి రిటైరయిన వాట్ట. “ఓ గంట సేపు షూటింగ్ చేసుకుంటాం” అంటే సరే అన్నాడు. “ఆ లాన్ లాగే అతని హృదయంకూడా విశాలమే” అని అభినందించుకుని, అతనికి అభినందనాలు తెలిపారు. “సరే నేను బయటికి వెళ్తున్నాను. గేటు తెరిచే వుంటుంది. నేను తిరిగొచ్చే వరకూ వుండండి.” అని చెప్పి తాళం వేసిన బంగాళాని వప్పజెప్పి ఆ వాచ్‌మన్‌ని కూడా తనతో తీసుకుని కార్లో వెళ్లిపోయాడు ఓనరు.

లాన్ మధ్యలో దాదాపు రెండు గంటల పాటు షూటింగ్ జరిగింది. కెమెరాని అటూ ఇటూ తిప్పడం, లైట్లు పెట్టడం, మూడు భాషల నటులూ అటూ ఇటూ నడవడంతో ఆ పచ్చిక తివాసీ బాగా నలిగి పోయింది. కొంత భాగం చిరిగిపోయింది కూడా! ఎంత జాగ్రత్తగా వున్నా తప్పదు మరి!

షూటింగ్ ఇంకో రెండు షాట్సుందనగా రంమ్‌యని కార్లో వచ్చి దిగాడా కమాండర్. దిగినవాడు చూశాడు. తివాసీ ధ్వంసమైపోయి వుంది! ఇంగ్లీషు, హిందీ భాషల్లో తిట్టడం మొదలు పెట్టాడు. ప్రొడక్షన్ వాళ్లు ఏదో సర్దిచెప్పి, ‘మళ్లీ అందంగా తీర్చి దిద్దుతాం’ అని అంటున్నాకూడా వినిపించుకోకుండా లోపలికి వెళ్లి పెద్ద తుపాకీతో వచ్చి అందరికీ గురిపెట్టి వేమూరి గగ్గయ్య క్రోధస్ధాయిలో పద్యం చదివినట్టు – గద్యం చెప్పి, యుద్ధంలో శత్రువుల మీదికి ఉరికినట్టు ఉరికాడు.

అంతే! తుపాకీ చప్పుడుకి పిట్టలు ఎగిరి పోయినట్టు ఎక్కడున్న వాళ్లు అక్కడుండకుండా, ఎలా వున్నవాళ్లు అలా పరుగెత్తారు! రోడ్డు మీదకి పరుగెత్తిన వాళ్లు ఆ పక్క ఈ పక్కా పిక్కబలం చూపించారు. పంచె ఊడిపోతున్నా లెక్క చెయ్యకుండా, నేనో చెట్టు పక్కకి పరుగెత్తాను. ఉన్నవాళ్లలో నాకు తెలిసినవాడు నాగేష్. ముందు ధైర్యవంతుడిలాగా నిదానంగా నడిచినా, తర్వాత ఓ కారు వెనక నక్కాడు. కెమెరా భుజాన వేసుకుని కెమెరా వాళ్లూ, లైట్ల వాళ్లూ దొరికిన చోటుని అందుకున్నారు. ఆ కమాండరు, తుపాకీ పెట్టి కాల్చకపోవచ్చుగాని, అతని వాగ్ధాటీ తుపాకీ గురీ అలా కనిపించాయి. గేటుదాకా వచ్చి, మరింత తీవ్రస్థాయిలో “ప్రశంసించి” వెనుదిరిగి నిష్క్రమించాడు.

తుపాకీ తుపాను చల్లరినట్టయింది. పిట్టలన్నీ మెల్లిగా మెల్లిగా గూడు చేరుకున్నట్టు బిక్కు బిక్కుమని ఓ చోట చేరుకుని – ఒకటే నవ్వు, భయం పారిపోయింది గనక, గుండె చేత్తో పట్టుకుని ‘బ్రతుకుజీవుడా’ అని మరీ నవ్వు! “రియల్ షూటింగ్” అన్నాడు నాగేష్.

సినీతి ” సినీ షూటింగులకి అందమైన లాన్స్ ఇవ్వరాదు, అడగనూ రాదు!

లాభం గూబల్లోకి..

ఒక సినిమా షూటింగు ఆచంట దగ్గరున్న ఒక గ్రామంలో ఆ సినిమా పేరు… గుర్తు రావడంలేదు గాని, దర్శకుడు విజయబాబు. అంతకుముందు “వధూవరులు” అని ఓ చిత్రం డైరక్టు చేశాడు. ఆ సినిమాలోని ఒక దృశ్యం పెళ్లి చూపులు. ఒక అబ్బాయి పెళ్లి చూపులకి వస్తాడన్నమాట.

అది బ్లాక్ అండ్ వైట్ సినిమా. బాగా లోబడ్జెట్ వేసుకున్న సినిమా. అంచేత, రెండో టేకూ, మూడో టేకూ అని వుండవు. క్షుణ్ణంగా రిహార్సలు చేసి, ఫస్టు టేకు ఓకే చెయ్యవలసిందే. పెళ్లికొడుకు వేసిన అబ్బాయి లోకల్ టాలెంట్. చాలా కొత్తవాడు. కెమెరా అన్నా, దర్శకుడన్నా, పక్క నటులన్నా అమిత భయం గలవాడు. దృశ్యంలో, పెళ్లికూతురు కాఫీ అతనికి అందిస్తూ కావాలని అతని మీద ఒలకబోస్తుంది. అతను పాంటు తుడుచుకుంటూ “అపశకునం, ఈ పెళ్లి నాకొద్దు” లాంటి డైలాగులు చెప్పాలి.

బిక్కు బిక్కు మంటూ రిహార్సల్సు చేశాడు. “భయపడొద్దు నానా! టేక్!… నెగెటివ్ చాలా ఖరీదు.. జాగ్రత్త.. అమ్మాయి కాఫీ పొయ్యగానే లేచి డైలాగ్ చెప్పు” అన్నడు దర్శకుడు. తల ఊపాడు పెళ్లికొడుకు, ఫెడీమంది క్లాప్ బోర్డు. అబ్బాయి ఆ దెబ్బకే అదిరిపడ్డాడు. అమ్మాయి వచ్చి కాఫీ ఇవ్వబోయి ఒలకబోసింది. అబ్బాయి లేచి డైలాగు చెప్పబోయి, “తత్తత్తత్తత్త నేనేన్నే…” అన్నాడు. అతని తత్తరపాటుకి షూటింగు చూస్తున్నవాళ్లు ఫక్కుమని నవ్వారు.

“వన్స్‌మోర్” అన్నాడు చాయాగ్రాహకుడు. “ఎందుకూ? ఓ.కే. ఈ టెక్ వోకే చేదాం” అన్నాడు డైరెక్టరు. “అదెలాగ?” అని అడిగాడు సహకార దర్శకుడు “ఏముంది? సింపుల్… ఈ కారెక్టర్‌కి ఇక్కడి నుంచి నత్తి పెడదాం” అన్నాడు దర్శకుడు.

“అదెలాసార్! నత్తిపెడితే, షాట్‌పొడుగు ఇంకా ఎక్కువై నెగెటివ్ ఖర్చుకదా?” అన్నాడు చాయాగ్రాహకుడు. దర్శకుడు టోపీ తీసి తల గోక్కున్నాడు. “డబ్బింగులో ఏదో చేదాంలేండి.. ఇది ఓకే. రెండో టేకు లేదు. మరిన్ని తత్తత్తలూ మెమ్మేమ్మేలూ వేస్తాడు” అన్నాడు దర్శకుడు వేరేషాటుకి ముందంజు వేస్తూ.

ముందడుగు…

రామానాయుడిగారి చాలా సినిమాల్లో నేను వేశాను గాని. ఏనాడూ “నా కెంత ఇస్తారు? ఏమిస్తారు?” అని అడిగే అలవాటు లేదు నాకు. ఆయనిచ్చింది పుచ్చుకోడమే. ఎప్పుడిస్తే అప్పుడు పుచ్చుకోడమే. “ముందడుగు” సినిమాలో నేనున్నాను. డేట్స్ చెప్పారు. నాయుడుగారు ఆఫీసులో వున్న సమయం కనుక్కుని, గబగబా వెళ్లి ‘నమస్కారం’ అని “డేట్స్ ఇచ్చారు థాంక్స్ అన్నాను.

“దాందేముంది? మన సినిమాల్లో ఉండడం మామూలేగదా” అన్నారు రామానాయుడు. “మామూలే అనుకోండి. మరి అడ్వాన్స్ ఇస్తారా?’ అన్నాను. ఆయన కళ్లు చిట్లింది. అదోలా చూసి, “ఏమిటయా ఎప్పుడూలేంది అడ్వాన్సు అడుగుతున్నావు?” అన్నారు. “మీరే అన్నారు కదా సార్ “ముందడుగు” అని…” అన్నాను సినిమా టైటిల్‌ని బట్టి.

“బలే వాడివయ్యా… అందుకా ముందు అడుగుతున్నావు…” అని నాయుడుగారూ నవ్వేశారు.

బన్సురీ చురాయీ…

కళ్యాణం రఘురామయ్య ‘ఈలపాట’ రఘురామయ్యగా ప్రసిద్ధుడు. కుడిచేతి చూపుడు వేలుని మడిచి, నోట్లోని నాలికని ముడిచి, వేలు పెట్టి ఈల పుట్టించి సంగీతమో పాటో ఆలపించే వారు. అదొక టెక్నిక్. ఆ టెక్నిక్‌లో ఆయన గట్టివాడు. అదలా వుండగా, స్టేజి మీద నటుడు. పాట మాట ఎలా వున్నా పద్యం చదవడంలో పేరు గాంచినవాడు. గుక్క పట్టి రాగాన్ని తిప్పి తిప్పి స్థాయి మార్చి నిలపడంలో అఖండ కంఠుడు. పద్యం కంటే రాగానికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే ప్రేక్షకులు ఊరుకునేవారు కాదు. ఎంతసేపు రాగం తీస్తే అంత సేపూ చప్పట్లే.

సినిమాల్లో మొట్ట మొదటి కృష్ణ పాత్రధారి రఘురామయ్యే, పోతిన శ్రీనివాసరావు తీసిన ‘పృథ్వీ పుత్ర’ (1934)లో కృష్ణుడు. మరికొన్ని చిత్రాల్లో నారదుడు. కృష్ణ, నారద పాత్రలు ఆరోజుల్లో ఆయనే ఎక్కువగా నటించారు. జానపద చిత్రం ‘గొల్లభామ’లో హీరో, ఒకే ఒక్క సాంఘిక చిత్రం ‘పంతులమ్మ’లో నటించినట్టు జ్ఞాపకం. సినిమాల్లో నటిస్తున్నా నాటకాలు వదల్లేదు. అయితే నాటకంలో ఏ పాత్ర ధరించినా సరే. నాటకాంతంలో రఘురామయ్య చేత ప్రేక్షకులు గోలా గగ్గోలూ పెట్టి ఈలపాట పాడించుకునేవారు.

నాటకం ప్రేక్షకులకి అదో అలవాటు వుండేది. బందా కనకలింగేశ్వరరావు కృష్ణుడు పాత్ర వేసిన చివర్లో ‘గుత్తి వంకాయ కూర’ పాడించుకునేవారు. ప్రైవేట్ రికార్డు ద్వారా ఆ పాట పాప్యులరు, ఘంటసాల వేసినప్పుడు కూడా చివర్లో జగమేమాయో, కుడి ఎడమైతేనో పాడి తీరవలసిందే. రఘురామయ్యకీ ప్రేక్షకులకీ వున్న సంబంధం ఈ ఈలపాట సంబంధం.

ఒక సినిమాలో (పేరు గుర్తు రావడం లేదు) కృష్ణుడు. సినిమా ‘ది యెండ్’ తర్వాత ప్రేక్షకులు ఈలపాట అడగలేరు గదా. ఒక ఈలపాట లేకపోతే, ప్రేక్షకులు నిరుత్సాహ పడిపోతారని, దర్శక నిర్మాతలు తీవ్రంగా ఆలోచించి, ఓ చమత్కారం చేశారు. ఆ సినిమాలో కృష్ణుడు చీటికీ మాటికీ మురళి వాయిస్తున్నాడని, సత్యభామ ఓ ఘట్టంలో ఆ ‘ప్లూట్’ దాచేస్తుంది. కృష్ణుడు వెతుక్కుంటాడు – కనిపించలేదు. లాభంలేదని, రఘురామయ్య అవతరం ఎత్తి, నోట్లో వేలు పెట్టుకుని కాస్సేపు ఈలపాట పాడతాడు శ్రీకృష్ణుడు. ఏర్పాటు బావుంది కదా ఉభయతారకంగా!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!