వక్రత .!

వక్రత .!

వక్రత అంటే, చెప్పే విషయాన్ని సాధారణంగా సూటిగా కాకుండా,

విభిన్నంగా చెప్పడం. 

ఉదాహరణకి “శ్రామికుని నెత్తురు చెమటగా కారిపోతోంది” అని చెప్పడం

సాధారణ అలంకారం. 

అదే, “శ్రామికుని నెత్తురు ఎఱ్ఱదనం కోల్పోయి పల్చబడి ఒంటిమీంచి జారిపోతోంది” అని అంటే అది వక్రత. 

వక్రత చెప్పే విషయాన్ని గూర్చి అనేక కోణాలని చూపించగలుగుతుంది,

కానీ కొన్నిసార్లు కవిత్వంలో అస్పష్టతకి కూడా దారితీస్తుంది. 

ఉత్తరహరివంశంలో అడుగడుగునా యీ వక్రత అగుపడుతుంది. 

చెప్పే విషయం కానీ, చేసే వర్ణనకానీ ఏదో విలక్షణతతో, 

వక్రమార్గం లోనే సాగించడం సోమన ప్రత్యేకత. 

ఉదాహరణకి యీ పద్యం చూడండి:

.

"కుజము కుంజరముచే కూలునో కూలదో?

.

కూలు; కుంజరము నీ కుజము గూల్చె!

.

మ్రాను పేరేటిచే మడుగునో మడుగదో?

.

మడుగు; పేరేటి నీ మ్రాను మడచె!

.

గాలునో యొకనిచే గాలదో సాలంబు?

.

గాలు; నీ సాలంబు గాల్చె నొకని!

.

దునియునో పరశుచే దునియదో వృక్షంబు?

.

తునియు; నీ వృక్షంబు తునిమె బరశు!

.

ననుచు దమలోన జర్చించు నమరవరుల

కభిమతార్థ ఫలార్థమై యంద వచ్చు

పారిజాతంబు నా మ్రోల బండియుండ

నంద గంటి నా కోర్కుల నంద గంటి!

.

ఇది కృష్ణుడు శివుని స్తుతించే పద్యం. పద్యం చదివిన వెంటనే ఇందులో కవి చెప్పదలచుకున్న విషయమేమిటన్నది బోధపడదు.

వాక్య నిర్మాణంలోనూ, చెప్పిన విధానంలోనూ ఉన్న వక్రత దీనికి కారణం. 

శివుని పారిజాతవృక్షంతో పోలుస్తున్నాడు కృష్ణుడు. 

చెట్టు ఏనుగు చేత కూలుతుందా కూలదా? కూలుతుంది.

కాని ఇక్కడ చెట్టు ఒక ఏనుగుని కూల్చింది!

అలానే తర్వాత పాదాలలో చెట్టు పెద్ద ఏరువల్ల వంగిపోవడం, 

అగ్ని వలన కాలడం, గొడ్డలిచేత విరగడం శివుని విషయంలో 

తారుమారవ్వడం కనిపిస్తుంది.

మొదటి పాదంలో ప్రశ్నకి రెండవ పాదం మొదటి పదంతో సమాధానం చెప్పడం,

ఆ తర్వాత దానికి వ్యతిరేకమైనది శివుని విషయంలో జరగడాన్ని ప్రస్తావించడం ఇక్కడ పద్య (వాక్య) నిర్మాణంలో సోమన చూపించిన వక్రత.

ఇదే అస్పష్టతకి దారితీస్తోంది. 

అలాగే ఇక్కడ ప్రస్తావించబడిన అంశాలు అర్థమవ్వాలంటే 

కొంత పురాణ జ్ఞానం అవసరమవుతుంది. 

శివుడు గజాసురుని సంహరించడం, గంగ గర్వాన్ని అణచడం,

మన్మథ దహనం – ఇవి మొదటి మూడు పాదాలలోని అంశాలు, ప్రసిద్ధమైనవే. నాల్గవ అంశం శివుడు పరశువుని ఖండించడం. 

దక్ష యజ్ఞ ధ్వంసమప్పుడు శివుడు విష్ణుమూర్తి పరశువుని

ఖండించాడని ఒక కథ ఉంది. బహుశా ఇక్కడ ప్రస్తావించినది అదే.

ఈ కథలు తెలియకపోతే పద్యం అసలు అర్థం కాదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!