జగన్మోహిని అమృతము పంచుట !

జగన్మోహిని అమృతము పంచుట !

.

 ఆ జగన్మోహినీదేవి మెరుగారు చూపులూ, చల్లని పలుకులూ, బుజ్జగింపులూ కట్టుతాళ్ళలా సాగి సాగి రాక్షసుల నోళ్ళను కట్టేశాయి.

 రాక్షసులు అందించిన, అమృతకలశాన్ని, మాయా సుందరి మోహినీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన చేతులలోకి తీసుకున్నాడు. 

చిరునవ్వులు చిందే పలుకులతో “నేను పంచిపెట్టిన విధంగా ‘ఔను’ ‘కాదు’ అనకుండా ఒప్పుకోవాలి” అన్నాడు.

 ఆ షరతులకు అంగీకరించిన రాక్షసులూ, దేవతలూ “సరే” అన్నారు.

 వారందరూ ఉపవాసం ఉండి స్నానాలు చేసి హోమాలు ఆచరించారు. బ్రాహ్మణులకు గోదానాలు, భూదానాలూ, హిరణ్యదానాలూ మున్నగు దానాలు ఇచ్చి, వారి ఆశీర్వచనాలు అందుకున్నారు.

 తెల్లని బట్టలు కట్టుకున్నారు. చందనం పూతలూ, పూలమాలలూ, ధూపాలూ, దీపాలూ అలంకరించిన బంగారు మండపంలో చేరారు.

 తూర్పుకు కొసలు ఉండేలా పరచిన దర్భాసనాల మీద తూర్పుముఖంగా వరుసలు కట్టి కూర్చున్నారు.

అప్పుడు, కటిభారంతోనూ, స్తనాలభారంతోనూ, శిరోజాలభారంతోనూ చిక్కిన చక్కనమ్మ జగన్మోహిని, తన పద్మం వంటి చేతిలో అమృతకలశాన్ని పట్టుకుని ఒయ్యారంగా వచ్చింది. ఆమె ధరించిన రకరకాల ఆభరణాలు సవ్వళ్ళు చేస్తున్నాయి.

 ఆ మోహినీ అవతారం, ధరించిన కర్ణాభరణాల తళతళ మెరుపులు, ఆమె ముక్కుకూ, ముఖానికీ, చెవులకూ, చెక్కిళ్ళకూ, కనుగొనలకూ మనోహరంగా వ్యాపిస్తున్నాయి. అలా లక్ష్మీదేవితో సాటిరాగల ఆ అందగత్తెను చూసిన దేవతలకూ, రాక్షసులకూ అందరికీ మనసు చెదిరిపోయింది.

.

“రాక్షసులకు అమృతం పోయడం అంటే, పాములకు పాలుపోసినట్లే, ఆపదలు కలిగిస్తుంది” అంటూ మోహినీ దేవి అసురులను అందరిని ప్రత్యేకంగా ఒక ప్రక్క కూర్చోబెట్టింది.

.

“రాక్షసులులారా! తొందర పడకండి, ఆలస్యం చేయకుండా వస్తాను, నెమ్మదిగా కూర్చోండి.” అంటూ పలకరిస్తూ, కన్నులు కదలించింది. రెండు పాలిండ్ల పైనున్న పైటకొంగు జార్చింది. ‘వదిన, మరది’ వరసలు కలిపింది. మర్మస్థానాల మరుగు తొలగించినట్లే తొలగించి మరల కప్పేసింది. చిరునవ్వులతో మైమరపించింది. అద్భుతమైన నెరజాణ మాటలతో రాక్షసులను లొంగదీసుకుంది. దేవతలను “ఆలస్యం చేయకుండా తొందరగా తాగండి” అంటూ అమృతాన్ని దేవతలకు పంచేసింది. దేవతలు సంతృప్తితో అమృతాన్ని ఆరగించి, ఆమెను అభినందించారు.

.

ఆ మాయా మోహిని చూపులకు కరిగిపోయిన రాక్షసులు “ఈ మగువ మనకూ, దేవతలకూ తేడాలేకుండా పంచిపెడతాను అని పూనుకుంది కదా. అలా చేయకుండా మాట తప్పుతుందా. లేదు అలా తప్పదు. కానీ, మనం సాహసించి రమ్మని పిలిస్తే బదులు పలకదేమో! తిరిగి చూడదేమో! స్తనద్వయం మీద పైట కప్పేసుకుంటుందేమో! మరోమాట కలిపితే కంగారుపడి వెనకడుగు వేస్తుందేమో! మన యందు అలుగుతుందేమో! మన మీద చూపుతున్న విశ్వాసం చెడుతుందేమో!” అనుకుంటూ, జంకుతూ గొంకుతూ, ఊరకే ఉండిపోయారు తప్పించి “సుందరీ! తొందరగా తీసుకురా!” అని పిలవలేకపోయారు.

.

రాహువు దేవతలలో రహస్యంగా కలిసిపోయి దేవతల రూపు ధరించి అమృతం తాగుతుండగా సూర్యచంద్రులు చూసారు. చూసి మోహినికి సైగలు చేసారు. వెంటనే విష్ణువు చక్రాయుధంతో రాహువు తల ఖండించాడు. అమృతం ఆనటం వలన, రాహువు తల నిర్జీవం కాలేదు. అమరత్వం పొందింది. మొండెం నేలపై కూలిపోయింది.

.

అలా అమరత్వం పొందిన రాహువు శిరస్సును బ్రహ్మదేవుడు గౌరవించి గ్రహంగా చేసి ఆకాశంలో నిలబెట్టాడు. రాహుగ్రహం ఆ పగను వదలకుండా, అమావాస్య, పూర్ణిమలలో సూర్య చంద్రులను నేటికీ పట్టుకుంటోంది.

.

విష్ణు మూర్తి ఒక్క చుక్క కూడా రాక్షసులకు మిగల్చకుండా, అమృతమంతా దేవతకు బాహాటంగా పోసి, మోహినీ రూపాన్ని వదలిపెట్టి నిజాకారాన్ని ధరించాడు. ఇదంతా చూస్తున్న రాక్షస వీరులు దుఃఖించారు.

.

దేవతలూ, రాక్షసులూ సరిసమానమైన సంకల్పమూ, శక్తీ, బలమూ, తెలివీ, ధనమూ, ఆత్మగౌరవమూ ఉన్నవారే. కానీ ఇద్దరికి రెండు రకాలైన ఫలితాలు అందాయి. దేవతలు శుభాలను పొందారు. విష్ణువును ఆశ్రయించని కారణంచేత రాక్షసులు శుభాలను పొందకుండా అనేక దుఃఖాలపాలయ్యారు. అవును, విష్ణువును శరణు వేడని వారు శుభాలు పొందలేరు కదా!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!