శివారెడ్డి కవి(తా) పరిచయం !

శివారెడ్డి కవి(తా) పరిచయం !


(కన్నెగంటి చంద్రశేఖర్, )





"ఇక్కడ రెండే మార్గాలు, రెండే పక్షాలు 

జనమున్నారు జనకంటకులున్నారు 

ప్రజలున్నారు ప్రజల్ని హింసించే ప్రభుత్వమూ వుంది గడ్డం

పెంచుకుని బొట్టు పెట్టుకుని ప్రభుత్వ జపమాల తిప్పుతావా 

జనంలో కలిసిపోయి జనయుధ్ధాన్ని ఎక్కుపెడతావా 

నిర్ద్వంద్వంగా నిర్ణయించుకో నిశ్చయించుకో 

నిజం పలకటం నీకూ మాకూ క్షేమదాయకం" 

(ఎటు నిలబడతావో, మోహనా! ఓ మోహనా!, 1987)


అంటూ తన మార్గాన్ని ఎన్నుకొని తన కవిత్వాన్ని ఎక్కుపెట్టటమే

కాక ప్రతి పాఠకుణ్ణీ నిలదీసి ప్రశ్నిస్తున్న కవి కె. శివారెడ్డి.

విప్లవ సాహిత్య సంఘాలకు బయట ఉంటూనే విప్లవ సాహిత్యాన్ని

సృష్టిస్తున్న వాళ్ళు అనేకులు ఉన్నా, తనదంటూ ఒక ప్రత్యేకమైన

శైలీ, పదజాలం ఏర్పరచుకున్న కవిగా శివారెడ్డి ప్రముఖ స్థానంలో 

నిలబడతారు. ఇవాళ తెలుగు కవిత్వాన్ని బలంగా ప్రభావితం చేస్తున్న 

వాళ్ళలో స్పష్టంగా వినిపించే గొంతు శివారెడ్డిది. 1980ల తర్వాత కలం 

పట్టిన ఆధునిక కవులంతా శివారెడ్డి వ్యక్తిత్వ కవిత్వాలతో ప్రభావితం

కాబడ్డవారేనన్నది విమర్శకులంతా అంగీకరిస్తున్న సత్యం.


ఇతని కవిత్వాన్ని గురించి పాపినేని శివశంకర్ "విప్లవకవి దృక్పథం 

జీవితంలోని ఎన్నో సంక్లిష్ట కోణాలను స్పృశించగలదని శివారెడ్డి 

నిరూపించారు. మట్టి మీదా మనిషి మీదా మమకారం, ఒక స్వఛ్ఛంద 

లక్షణం, సాధారణ వాక్యాల్లో అసాధారణ కవితాస్థాయి అతనిలో

కనిపిస్తాయి. వచన కవితా రూపానికి గొప్ప స్వేఛ్ఛ నిచ్చారు" అన్నారు.



"తల్లీ! నీకు నమస్కారాలు

నన్ను కన్నందుకు 

కని, నా ఈ జనం మధ్య పారేసినందుకు." 

(తల్లీ! నీకు నమస్కారం, భారమితి, 1983) 


అన్న పంక్తుల్లో జనం మీద ఎంత ప్రేమ కనబడుతుందో 


"మట్టి కన్న బలమైందీ ప్రియమైందీ ప్రాణప్రదమైందీ

సువాసనభరితమైందీ మరేదీ లేదు 

అందుకే మట్టి నా జీవితం నా అనుభవం నా స్వప్నం -

నగ్నంగా నీళ్ళలోకి దూకినట్టు మట్టిలోకి దూకుతాను" 

(నగ్న భూమ్మీద, మోహనా! ఓ మోహనా!, 1984) 


అంటున్నప్పుడు అంత ప్రేమా మట్టి మీద ఉన్నట్టు తెలుస్తుంది.


"ధ్వంసం చేయదగిందేదీ లేకపోతే నీకీ లోకంలో 

నువ్వు తప్పకుండా ధ్వంసం చేయదగిన వ్యక్తివి" 

(ధ్వంసం, నేత్రధనుస్సు, 1978) 


అంటూ నిక్కచ్చిగా, నిర్దాక్షిణ్యంగా తీర్పునిచ్చిన కవే 


"ఆమె ఎవరయితే మాత్రమేం ఎలా కదుపుతాం? 

ఒక సంక్షుభిత పగటి తర్వాత 

ఒక వ్యాకుల కలిత శిథిల పగటి తర్వాత 

ఏ సౌందర్యమూ లేని, ఏ లాలిత్యమూ లేని 

భయంకర పశువు పగటి తర్వాత 

విశ్రమిస్తున్న ఆమెను కదపడం ఎలా?" 

(ఆమె ఎవరైతే మాత్రం, కవితా ఓ కవితా, 1989) 


అంటూ ఇంటా బయటా పగలల్లా శ్రమించి, మరో పగటికోసం సిధ్ధమవుతూ 

నిద్రిస్తున్న ఆమెను లేపొద్దని చెపుతూ ఆమె శ్రమను గుర్తించి ద్రవించడం 

చూస్తాం.


శ్రీ శివారెడ్డి తొలి కవితా సంకలనం "రక్తం సూర్యుడు" 1974లో 'ఫ్రీవెర్స్ ఫ్రంట్' 

బహుమతి అందుకుంది. తర్వాత "చర్య", "ఆసుపత్రి గీతం","నేత్ర ధనుస్సు", 

"భారమితి" సంకలనాలు వెలువడ్డాయి. "మోహనా! ఓ మోహనా!" సంకలనానికి 

1990లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. 


1991లో "శివారెడ్డి కవిత" పేరిట ఒక సమగ్ర సంపుటం ప్రచురింపబడింది. 

"...దశలవారీగా సంపుటి నుంచి సంపుటికి పరిణామం చెందుతూ, వైవిధ్యం 

సంతరించుకుంటూ తీవ్రతరమవుతూ అనుభవ సంపన్నతతో" ముందుకుపోతూ, తన

కవిత్వానికి "లోతునూ, విశాలతనూ, గాఢతనూ, ఒక ప్రత్Yఏకతనూ" ఆపాదించిన 

శివారెడ్డి కవిత్వంలోని వివిధ గతులనీ, ఆ వైవిధ్యపు అంతస్సూత్రాన్నీ 

పరిచయం చేసే రెండు కవితలను చూడండి.


తరమ్మారినా...

----------------



ఆ గేటు పక్క

బెరుకు బెరుగ్గా - బెదురుగా 

నిలబడ్డాడు - మూడేళ్లవాడు, 

లోన వాళ్ళమ్మ బాసాన్లు తోముతుంది 

బయట వాళ్ళయ్య ఏడ రాళ్ళు గొడుతున్నాడో - 

వాళ్ళయ్య కూడా 

అదే వయసులో అలానే 

ఈ గేటుపక్క కాకపోతే 

మరో గేటూపక్క 

నిలబడే వున్నాడు


("చర్య" కవితాసంపుటి, 1975 నుండి)


మోహనా! ఓ మోహనా!

--------------------



నాకింద పక్కలానో నావకింద నీళ్ళలానో

కళ్ళకింద నీడలానో ఆకాశం కింద పక్షిలానో

పక్షి రెక్కల కింద గాలిలానో,  ఆకు సందుల్లో నర్తించే

కిరణపుంజంలానో

ఎండాకాలం గాలి మండి పైకి లేచినప్పుడు నువ్వు కనపడతావు

వీధిలో "ఎర్రటి సూర్యుడు రాయి" నెత్తి మీద పడ్డప్పుడు నువ్వు

వినపడతావు

దూర దూర ప్రాంతాలనుంచి తరుముకొచ్చే -

తోటల మీదుగానో   నదీ జలాల మీదుగానో

పంట పొలాల మీదుగానో -

గాలి ఉప్పెనలా ముంచెత్తుతావు

ఎప్పుడు చూచినా నీ వేళ్ళు రక్తమయాలయ్యే వుంటాయి

ఎప్పుడు చూచినా నీ కళ్ళు సూర్యాస్తమయాలయ్యే వుంటాయి

పొద్దుటి పూట తలుపులు ఓరగా తీసే వుంటాయి

రాత్రి వేడి గాలంతా అయిష్టంగానే బయటికి నడుస్తుంది

కోడి కూతల్లేని ఉదయ సంధ్యలు

నీ నగ్న పాదాల్లా వస్తూనే వుంటాయి

చేతులెత్తి ఎవ్వరికీ నమస్కరించలేక

దేహాన్నిచ్చి జీవితాన్ని కొనుక్కున్నావు

కళ్యాణ మందిరం పక్కన తెంచుకోలేని 

నాగపాశాలు  కంఠానికి బిగుసుకుంటాయి

మనసుకు పడ్డ ఈ బేడీలు ఎవ్వడూ విప్పలేడు


చేదైన వేపచెట్టు చిగురించిన వసంతకాలంలా నువ్వు -

అద్భుతంగా సంగీతించిన నిచ్చెనల వెదురు వనంలా నువ్వు

నిన్నా ఉన్నతాసనంలో చూచినప్పుడు

మంజులత్వం పొందిన కాఠిన్యాన్ని చూచినట్టు

నిన్ను నువ్వు హత్య చేసుకున్న సంఘటన  కళ్ళముందు మెదిలినట్టు -

ఇన్నాళ్ళ అజ్ఞాతవాసం తర్వాత

ఇదుగో ఈ ఆఫీసు తోటలో కూస్తున్న కోయిలా

నువ్వేం తిన్నావో తెలియదు గానీ

ఇన్నాళ్ళ తర్వాత నీ కంఠంలో కొత్తగా జాలి ధ్వనిస్తుంది

జాలిలో పుట్టిన క్రోధం దర్శనమిస్తుంది

ఎంత క్రూరత్వం!

అందాన్ని అనాకారిగా తయారుచేసే క్రూరత్వం

ప్రతీదాన్నీ తాసులో తూచే క్రూరత్వం

ప్రతీదాన్నీ వస్తువుకింద మార్చి అమ్ముకునే క్రూరత్వం

నీ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని   కుదించి 

కుదించి, ఖండించి పార్శిల్ చేసి  విదేశాల కెగుమతి చేసే

క్రూరత్వం

నీ నుంచి నిన్ను విడదీసి   నిన్ను హరించి సంహరించే క్రూరత్వం

నా జ్ఞాపకాల్లో బతుకుతున్న మోహనా!

హేమంతగాన చిరులేత ఎండల కళ్ళ మోహనా!

నా స్మృతిపేటికలో పదిలంగా వున్న వరిమొవ్వులోని మంచు బిందువా!

తొలగించేకొలది మిగిలిపోయే తెరల్లో మరిగిపోతున్న మోహనా!

లేవాలి గదా, లేచి పక్కల్ దీసి మంచాలెత్తి  

ముఖాల్ కడిగి   ప్రవాహంలో పడిపోవాలి గదా -

దయలేని విధి నిర్వహణలో

రోజుకో అంగం తర్పణ గావించాలి గదా -

బతుకు మోహనా! బతుకు

బతకటాన్ని ఓ పెద్ద పాపకార్యం చేసిన

బతకటాన్ని ఓ పెద్ద బండ బరువు చేసిన

బతకటాన్ని ఓ బడా వ్యాపారం చేసిన

ఈ సుందరమయ వ్యవస్థలో బతుకు మోహనా! బతుకు!

నా అక్షరాల్లో ఒక అక్షరం నా ముందు ఎదిగి

జాలిగా నా మీద వంగి నా చుబుకాన్ని తాకితే నువ్వు గుర్తొస్తావు

ఎప్పుడన్నా రాస్తున్నప్పుడు పాళీ చిట్లి  కలం కళ్ళు కనబడకపోతే

నువ్వు గుర్తొస్తావు

గొంతెత్తి శ్రీ శ్రీని స్మరిస్తుంటే

ఏ సంప్రదాయవాదో విసిరిన రాయి నుదుటికి తాకి రక్తం చిమ్మితే నువ్వు

గుర్తొస్తావు

ఏకాంతంగా కూచున్నప్పుడు - కాంతిని చూచి గదిలోకొచ్చి

అద్దం మీద బల్లికి ఎరవ్వబోతున్న సీతాకోక చిలుకని చూచినప్పుడు

నువ్వు గుర్తొస్తావు

ఏ ఆడపిల్లని చూచినా

రాత్రికీ పగటికీ మధ్య కొట్టుకుంటున్న నల్లని తెరలా

నాలో ఎల్లప్పుడూ కదుల్తూనే వుంటావు


(ఏప్రిల్ 3, 1984)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!