Skip to main content
రామ సుగ్రీవ మిత్రధర్మము!
-
రామ సుగ్రీవ మిత్రధర్మము!
-
సప్తాంగములతో కూడిన రాజతంత్రమందు మిత్రునకు స్థానమున్నది.
అట్లే రాజునకున్న బలములలో మిత్రబలమొకటి. ఒ
క మహారాజ్యాధిపతితో యుద్ధము చేయవలసిన రామునకు మిత్రబలము
అవసరమై ఉన్నది. రాముడు రావణునిపై దండెత్తనున్నాడని తెలిసిన
సీత “రాముడు మిత్రులను సంపాదించెనా?” అని హనుమంతుని ప్రశ్నించినది.
శాపవిముక్తిని పొంది, దివ్యుడైన కబంధుని ద్వారా రాముడు సీతావృత్తాంతము నెఱుగదలచినను, కబంధుడు – సీత ఉన్న స్థానము తనకు తెలియునో, తెలియదో కాని ఆ విషయమును స్పృశింపక, రాముడున్న స్థితిలో ఆయనకవశ్యకమైన దానిని గూర్చి
ఇట్లు చెప్పుచున్నాడు-
“రామా! నీవు భార్యను పోగొట్టుకొని దుర్దశలో నున్నావు. ఇట్టి స్థితిలో యున్న నీకు మంచి స్నేహితుడు కావలసి ఉన్నది. అట్టి మిత్రుని సంపాదింపక నీ కార్యము సిద్ధిపొందునని నేను తలంచను” (అర.౭౨-౯,౧౦) అని
సుగ్రీవుని రామునకు మిత్రునిగా నిర్దేశించినాడు.
.
అయితే రాముని కార్యము నెఱవేరుటకు- రాజు, సైన్యవంతుడు,
బలవంతుడు అయిన వాలిని చూపక –
దుర్దశలో ఉన్నసుగ్రీవుని ఏల చూపినాడు?
తనకు సూచించినవాడు తనవలె దుర్దశా పీడితుడని ఎఱిగి
రాముడు దానికెట్లు సమ్మతించినాడు?
దుర్దశలో ఉన్నను స్థిరచిత్తుడు మైత్రికి అర్హుడని ధర్మశాస్త్రమిట్లు చెప్పుచున్నది -
” అప్పుడు బలహీనుడై ఉన్నను, మీదటికి వృద్ధినందునట్టి స్థిరచిత్తుడగు శాశ్వతమిత్రుని పొంది వృద్ధినొందినంతగా రాజు, సువర్ణ భూమ్యాది లాభములవలన వృద్ధినందడు”
(అధ్యా.౭- ౨౦౯, మనుస్మృతి). తుల్యావస్థలోనుండి పరస్పరసాయమపేక్షించు
వారి స్నేహము దృఢతరముగా నుండును.
.
అందుకే “ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు,తృప్తిపడువాడు, ప్రేమశీలి, నిలకడగలవాడు
అయిన మిత్రుడు శ్రేష్ఠుడు. అట్టివానిని సంపాదింపవలయును”
( అధ్యా.౭ – ౨౦౯, మనుస్మృతి) అని శాస్త్రము నిర్దేశించుచున్నది.
కావుననే “సత్యసంధుడు, వినయశీలి, ధైర్యశాలి, మతిమంతుడు, సమర్థుడు,
ప్రగల్భుడు, కాంతిమంతుడు, బలపరాక్రమవంతుడు”
(అర.౭౨-౧౩,౧౪) అయిన సుగ్రీవుని మిత్రునిగా కబంధుడు సూచించినాడు.
Comments
Post a Comment